నాడు అర్బన్ నక్సల్
నేడు దిమాగీ నక్సల్
విమర్శకులను మావోయిస్టులుగా ముద్ర వేస్తున్నారు : మోడీ వ్యాఖ్యలపై
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ ఆగ్రహం
ప్రధాని అబద్ధాలు చెప్తున్నారు
యువతను ‘నక్సల్స్’గా చిత్రీకరించడం తగదు
తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్, ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించిన ‘దిమాగీ నక్సల్’ పదంపై రాజకీయ దుమారం రేగింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే, ప్రభుత్వాన్ని విమర్శించే వారిని మావోయిస్టులుగా ముద్ర వేస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ ఆరోపించారు. మావోయిస్టులను అణచివేసే పేరుతో జరుగుతోన్న చర్యల విధానాన్ని ప్రశ్నిస్తూ… కొన్ని ఘటనలను ‘ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం’గా ఆయన అభివర్ణించారు. బీజేపీ, ఆరెస్సెస్‌లను విమర్శించే వారిని గతంలో ‘అర్బన్ నక్సల్స్’గా పిలిచేవారనీ, ఇప్పుడు అదే తరహాలో ‘దిమాగీ నక్సల్’ అనే కొత్త పదాన్ని ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మేధావులు, రచయితలు, సామాజిక కార్యకర్తలను ఇలాంటి పదజాలంతో లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
విమర్శకులే లక్ష్యంగా…
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు, తమ హక్కుల కోసం జంతర్‌మంతర్ వద్దకు వచ్చి నిరసనలు తెలిపే వారు, విమర్శకులపై ‘దిమాగీ నక్సల్’గా ముద్ర వేస్తున్నారని బేబీ అన్నారు. ఇందుకు నటుడు, రచయిత గిరీశ్ కర్నాడ్‌ను ప్రస్తావించారు. ఒక బహిరంగ కార్యక్రమంలో ‘అర్బన్ నక్సల్’ అని రాసి ఉన్న ప్లకార్డును ధరించి ఆయన నిరసన తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ప్రముఖ సామాజిక కార్యకర్తలు, హేతువాదులు అయిన ఎం.ఎం కల్బుర్గి, గోవింద్ పన్సారే, గౌరీ లంకేశ్ హత్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీ, ఆరెస్సెస్‌లను విమర్శించే వారిపై దాడులు జరిగాయని ఆయన అన్నారు. ప్రతిపక్షాలను ‘దేశ వ్యతిరేకులు’గా చిత్రీకరించడం ఒక సులభమైన రాజకీయ ఆరోపణగా మారిందనీ, ఇప్పుడు ‘దిమాగీ నక్సల్’ కూడా అదే ధోరణిలో భాగమని బేబీ విమర్శించారు.
మావోయిస్టులపై చర్యల విధానాన్ని ప్రశ్నించాలి
మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యమని కేంద్రం చెప్తున్నప్పటికీ.. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అనుసరిస్తున్న పద్ధతులపై చర్చ జరగాలని బేబీ అన్నారు. యువతను అదుపులోకి తీసుకుని, చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కాల్చిచంపి, అనంతరం వాటిని ఎన్‌కౌంటర్లుగా చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలను ఆయన ‘ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం’గా అభివర్ణించారు. మావోయిస్టు సమస్యకు సైనిక చర్య ఒక్కటే పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధానికి లేఖ రాశాం
మావోయిస్టు హింసను తాము సమర్థించడం లేదని స్పష్టం చేస్తూ తాను, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత దీపాంకర్ భట్టాచార్య కలిసి ప్రధాని మోడీకి లేఖ రాసినట్టు బేబీ తెలిపారు. ఆయుధాలు వదిలేందుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులతో చర్చలు జరిపి వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని ఆ లేఖలో సూచించినట్టు చెప్పారు. మావోయిస్టు హింసను వ్యతిరేకిస్తూనే, సమస్య పరిష్కారానికి చర్చలు, పునరావాసం, చట్టపరమైన ప్రక్రియలకు ప్రాధాన్యం ఇవ్వాలని తాము కోరినట్టు ఆయన వివరించారు.
మోడీ అబద్ధాలు : కాంగ్రెస్, సీపీఐ, ఎస్పీ
ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ అబద్ధాలు చెప్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దానిని ప్రధాని మోడీ తాను చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ… గతంలో ప్రధాని తన రాజకీయ ప్రత్యర్థులను ‘అర్బన్ నక్సల్స్’గా పిలిచారనీ, ఇప్పుడు ‘దిమాగీ నక్సల్స్’గా అభివర్ణిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రధాని రాజకీయ నిరాశకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తాను ‘ఇంటెలెక్చువల్ నక్సల్’ అని చెప్పుకోవడం గర్వంగా ఉందంటూ వ్యంగ్యంగా స్పందించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా కూడా ప్రధాని తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అబద్దాలు చెప్పడానికి ఎర్రకోట వేదిక కాదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.
యువతపై ‘నక్సల్’ ముద్ర సరికాదు : సీజేపీ
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రధాని వ్యాఖ్యలను విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతో విద్యావంతులైన యువతను ‘నక్సల్స్’గా ముద్ర వేయడం తగదని అన్నారు. ఒక తరం నిశ్శబ్దంగా ఉండాలని చెప్పినప్పటికీ, ఇప్పుడు యువత తన గొంతును వినిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు జంతర్‌మంతర్‌లాంటి వేదికలు ఏర్పడుతున్నాయనీ, యువతను విభజించకుండా ఏకం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రధాని వ్యాఖ్యలు అహంకారానికి, సమస్యలను పరిష్కరించడంలో అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ‘‘దిమాగీ నక్సల్స్ లేదా మరేదైనా పదజాలం పనిచేయదు ప్రధాని. చదువుకున్న యువతను ఇలా నక్సల్స్ అని ఎలా తేలిగ్గా ముద్ర వేస్తారు? మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతోనే ఇలా అంటారా?’’ అని సౌరవ్ దాస్ ప్రశ్నించారు. దేశంలో యువత తమ హక్కులు, సమస్యలు, భవిష్యత్తు గురించి ప్రశ్నించడం ప్రారంభించిందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహజమైన ప్రక్రియ అని, ప్రశ్నించే వారిని భయపెట్టడం లేదా ఒక ముద్ర వేయడం పరిష్కారం కాదనే విధంగా ఆయన స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరో సందేశాన్ని విడుదల చేసిన సౌరవ్ దాస్… దాదాపు 12 ఏండ్ల తర్వాత దేశం నిజమైన అర్థంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టు అనిపిస్తోందన్నారు. ప్రతి జిల్లాలో ఒక జంతర్ మంతర్ పుడుతోందని ఆయన వివరించారు. నిరాశతో ఉన్నవారికి పరస్పరం ఆశ కల్పించే వేదికలు, తమకు శక్తి లేదనుకునే వారికి ఐక్యత ద్వారా శక్తిని చూపించే వేదికలు ఏర్పడుతున్నాయని అన్నారు. యువతను విభజించేందుకు అధికారంలో ఉన్నవారు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు.



