వాళ్లు రక్తపిశాచులు…సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు
కేసీఆర్‌ను సైతం తీసుకురావాలని కేటీఆర్, హరీశ్‌లకు విజ్ఞప్తి
ఆయన విలువైన సూచనలిస్తే రాష్ట్రానికి ఉపయోగం
నా లెక్కలన్నీ పక్కా చెబుతాను..ఎవరి పాలనేంటో అక్కడే తేల్చుకుందాం
పరకాల సభలో సీఎం రేవంత్‌రెడ్డి..ములుగు జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
‘మాజీ సీఎం కేసీఆర్‌ది కుటుంబ న్యాయం.. తమది, తమ పార్టీది సామాజిక న్యాయం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ హయాంలో వాళ్ల కుటుంబ సభ్యులకు పదవులిస్తే.. తాము మాత్రం సామాజిక సూత్రాన్ని పాటించామని తెలిపారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి ములుగు, పరకాల నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ాలు చేశారు. సాయంత్రం పరకాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ శాసనసభకు రాకుండా కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి ములుగు, పరకాల నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సాయంత్రం పరకాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ శాసనసభకు రాకుండా కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ తన కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు ఇచ్చుకున్నాడని గుర్తు చేశారు. కానీ.! తాను మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆడబిడ్డలైన సీతక్క, కొండా సురేఖలను మంత్రిపదవుల్లో కూర్చోబెట్టామని తెలిపారు.
కేసీఆర్ ఎర్రబెల్లికి మినిస్టర్ పదవి ఇస్తే.. తాను దళితుడైన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ని మంత్రిని చేశానని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో కల్వకుంట్ల కవితను ఎంపీ చేస్తే తాను మాత్రం ఎస్సీ ఆడబిడ్డ అయిన కడియం కావ్యను పార్లమెంట్‌కు పంపానని వివరించారు. యశస్వీని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపానని తెలిపారు. కేసీఆర్ తన సడ్డకుని కొడుకు సంతోష్‌రావును ఎంపీ చేస్తే తాము మిత్ర ధర్మం పాటించి వేం నరేందర్‌రెడ్డిని రాజ్యసభకు పంపామని తెలిపారు. ఉద్యమకారుడైన కోదండరామ్‌కి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించిందన్నారు. కేసీఆర్ మాత్రం తన కొడుక్కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు తాము బీసీ బిడ్డ అయిన మహేశ్‌కుమార్ గౌడ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించామని అన్నారు. ఈ రకంగా కేసీఆర్ హయాంలో ఆయన కుటుంబానికే న్యాయం జరిగితే తమ పార్టీ హయాంలో సబ్బండ వర్గాలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని సీఎం వివరించారు.
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు..
అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్, హరీశ్‌రావు పదే పదే అడుగుతున్నారని, రాష్ట్ర అభివృద్ధిపై సెప్టెంబర్ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తేల్చుకుందా మని బీఆర్‌ఎస్ పార్టీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. నా లెక్కలన్నీ పక్కా చెబుతానని, సుమారు ఈ మూడేండ్ల పాలనలో మేం చేసిన అభివృద్ధిని, మీరు చేయలేని పనులను పూర్తిస్థాయిలో చర్చిద్దా మన్నారు. ఈ సమావేశాలకు కేటీఆర్, హరీశ్‌రావులే కాకుండా కేసీఆర్ ను సైతం తీసుకురావాలని కోరారు. ఆయన సలహాలు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయని అన్నారు. కేసీఆర్ నాకు రాష్ట్రాన్ని అప్పగించిన సమయంలో 8లక్షల11వేల కోట్ల అప్పులను అప్పగించారని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంపై రూ.6500కోట్ల అప్పుల భారమే ఉండేదని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 8లక్షల11వేల కోట్లకు అప్పులు పెరిగాయన్నారు. లక్ష రూపాయలు రుణ మాఫీ చేస్తామని కేసీఆర్ రైతులను మోసం చేశారని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో 25లక్షల మంది రైతులకు 2లక్షల రుణమాఫీలో భాగంగా 25వేలా 617కోట్లను రైతుల ఖాతాల్లో వేసి రుణ విముక్తులను చేశామన్నారు. రూ.36వేల కోట్ల నిధులను రైతుభరోసాకు ఇచ్చామన్నారు. ఉచిత విద్యుత్ కోసం రూ.30వేల కోట్లను రైతుల ప్రయోజనార్ధం ఖర్చు పెడుతున్నామన్నారు. తమ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రి పదువులు ఇచ్చామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో పెట్రోల్ పంపులు, సోలార్ ప్లాంట్స్, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా చేసిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ ధృతరాష్ట్రుడా ?
కేసీఆర్ బిడ్డ కవితకు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని కర్కోటకుడైన అన్న కేటీఆర్ కవితను మెడలు పట్టి బయటకు నెట్టారని, దీన్ని సరిదిద్దాల్సిన కన్నతండ్రి కేసీఆర్ ధృతరాష్ట్రుడిగా ప్రేక్షకపాత్ర వహించారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరెలను ఎన్నడన్న కట్టుకున్నారా..చేండ్లలో అడవి పందులను బయపెట్టడానికి ఆ చీరెలను కట్టారని, కానీ మేము ఇచ్చిన పాలపిట్ట చీరెలు కట్టుకుని వచ్చిన మహిళలకు అన్నగా నేను ఎంతో సంతోష పడుతున్నానని అన్నారు.
నిరుద్యోగులు రెచ్చిపోవ్వొదు
నిరుద్యోగులు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పటి వరకు 70వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ కూడా వేశామన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో గరిష్ట వయోపరిమితిని కూడా పెంచామని, ఈ విషయాన్ని నిరుద్యోగులు గ్రహించాలని కోరారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియమాకాలు చేయలేదన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి 1200మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులయ్యారని అన్నారు. రెచ్చగొట్టాలి…మంది పిల్లలను చంపగొట్టాలనే విధంగా బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరించారని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు రక్తదాన శిబిరం నిర్వహించారని, ఇందులో కేసీఆర్ గానీ, అతని కుటుంబ సభ్యులు ఎవరూ రక్తదానం చేయలేదన్నారు. కార్యకర్తలు మాత్రం రక్తదానం చేశారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు రక్త పిశాచాలుగా మారారని, హరీశ్‌రావు, కేటీఆర్,ఎర్రబెల్లి దయాకర్‌రావు, వినోద్‌రావు, సంతోష్‌రావులు ఎందుకు రక్తదానం చేయలేదని ప్రశ్నించారు. కాకలు తీరిన నాయకుడని చెప్పుకునే ఎర్రబెల్లి దయాకర్‌రావును చిన్న అమ్మాయి యశస్విని 50వేల మెజార్టీతో ఓడించి బండకేసి కొట్టిందన్నారు. ఇది నా విజయమో.. యశస్విని విజయమో కాదని, ఇది ప్రజల విజయమని అన్నారు. రైతు, మహిళల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్నామని, నిండు మనస్సుతో 2029లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
హైదరాబాద్ తర్వాత వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. రూ.300కోట్లకు పైగా ఖర్చు పెట్టి మామునూరులో భూసేకరణ చేసి ఆ భూమిని ఎయిర్‌ఫోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియాకు అందించినట్టు తెలిపారు. రానున్న రెండేండ్లలో ఎయిర్‌ఫోర్ట్ నిర్మాణం పూర్తి చేసి విమానాలు తిరిగేలా చేస్తామన్నారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. 8లక్షల కోట్ల అప్పు చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 80వేల ఇండ్లను కూడా నిర్మించలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్లలో 8లక్షల ఇండ్లను పూర్తి చేసిందన్నారు. జైశంకర్‌సార్ స్వగ్రామం అక్కంపేటను గత పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెవెన్యూ గ్రామంగా చేయలేకపోయిందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో అక్కంపేటను రెవెన్యూ గ్రామం చేశామని తలిపారు. పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి 30ఏండ్ల కుర్రాడిగా పని చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ అంటేనే సంక్షేమం : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ, సామాజిక న్యాయం అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికులంలో పుట్టినా రాష్ట్రంలో కుల గణన చేసి దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచారని అన్నారు. అలాంటి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, విప్ డాక్టర్ రాంచద్రనాయక్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశ్వస్వినిరెడ్డి, మురళీనాయక్, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్, అడిషనల్ కలెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సురేఖ దూరం
సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి కొండా సుస్మితపటేల్ పోటీ చేస్తారని కొండా మురళీధర్‌రావు ప్రకటన చేశారు. ఈ సమయంలో పరకాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఈ కార్యక్రమానికి హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, పరకాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు మొలుగూరి భిక్షపతి హాజరుకాలేదు.



