Monday, August 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅంతా భ్రాంతియేనా…!

అంతా భ్రాంతియేనా…!

- Advertisement -

మిత్రదేశాల్లో ఎగసిపడుతున్న ఆగ్రహ జ్వాలలు
గల్ఫ్‌లో అమెరికాపై సన్నగిల్లిన విశ్వాసం
ఆతిథ్యం ఇచ్చి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన
ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్న దేశాలు

వాషింగ్టన్‌ : ఇరాన్‌ యుద్ధం తెలుగు టీవీ సీరియల్‌ మాదిరిగా అంతూపొంతూ లేకుండా కొనసాగుతుండడంతో గల్ఫ్‌ వ్యాప్తంగా అమెరికా పట్ల ఆగ్రహం పెల్లుబుకుతోంది. మధ్యప్రాచ్యాన్ని అమెరికా సురక్షిత ప్రదేశంగా ఉంచగలదా అని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌, కువైట్‌, బహ్‌రైన్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై ఆరు నెలలు కావస్తోంది. అయినా దానికి ముగింపు ఎప్పుడో ఎవరికీ తెలియడం లేదు. మరోవైపు చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఇంధన సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు మరింత అయోమయాన్ని కలిగిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపడంలో అమెరికా వైఫల్యం, అసమర్ధతపై ఐదు పశ్చిమాసియా దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

భద్రత కంటే ప్రమాదమే అధికం
ఇంధన సరఫరాలో ఖతార్‌, సౌదీ అరేబియా వంటి గల్ఫ్‌ దేశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ దిగ్బంధించడంతో ఆ దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎర్ర సముద్రాన్ని హిందూ మహా సముద్రంతో కలిపే బాబ్‌ అల్‌-మందెబ్‌ జలసంధిని దిగ్బంధిస్తామని హౌతీలు చేసిన హెచ్చరికతో పరిస్థితి మరింత క్షీణించింది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అమెరికా విషయంలో గల్ఫ్‌ దేశాలు సానుకూలంగానే ఉండేవి. అమెరికా దళాల ఉనికి అవాంఛనీయమే అయినప్పటికీ వాటితో ఉపయోగం కూడా ఉన్నదని అవి భావించాయి. అయితే ఇప్పుడు వాటి వైఖరిలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. అమెరికా సేనలు, స్థావరాలతో తమకు ఒరిగిందేమీ లేదని అవి నిర్ణయానికి వచ్చాయి. యుద్ధం ప్రారంబమైనప్పటి నుంచే అమెరికా పట్ల వాటి విశ్వాసం క్రమేపీ క్షీణించింది. మధ్యప్రాచ్యంలో అమెరికా చర్యలు తమ భద్రతకు ఉపయోగపడడం మాట అటుంచి అవి తమకు ప్రమాదాన్ని కలిగిస్తున్నాయని ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తీవ్రంగా నష్టపోయిన సౌదీ
అయితే ఇక్కడ ఓ విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంది. ఆయుధాలు, శిక్షణ, గూఢచార సమాచారం కోసం గల్ఫ్‌ దేశాలు ఇప్పటికీ అమెరికా పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇరాన్‌ను ఎదుర్కోవాలంటే తమకు అమెరికా సాయం అవసరమని అవి భావిస్తున్నాయి. అయితే అమెరికా పట్ల వ్యక్తమవుతున్న అసంతృప్తి కారణంగా కొన్ని దేశాలు తమ భద్రత కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాయి. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్‌ దేశాలు గత వారం పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది అమెరికాకు ఓ స్పష్టమైన సంకేతమేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. గల్ఫ్‌ దేశాలలో సౌదీ అరేబియా తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. ఇరాన్‌తో పాటు హౌతీలు కూడా దానినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. సౌదీ ఇంధన కేంద్రాలపై హౌతీలు పదే పదే దాడులు జరుపుతున్నారు. హార్ముజ్‌ మూతపడడంతో సౌదీ అరేబియా తన చమురు ఎగుమతులను ఎర్రసముద్ర ఓడరేవుల ద్వారా జరుపుతోంది. అయితే అక్కడ హౌతీల నుంచి క్షణక్షణం ముప్పు పొంచి ఉంటోంది. హార్ముజ్‌ను ఇరాన్‌ మూసివేయడానికి ముందు సౌదీ అరేబియా ఆ జలసంధి మీదుగా రోజుకు ఐదు మిలియన్‌ బ్యారల్స్‌ చమురును రవాణా చేసేది. ఇప్పుడు ఆ జలసంధి మీదుగా ట్యాంకర్ల రాకపోకలు దాదాపు 90 శాతం తగ్గిపోవడంతో చమురు ధరలు కొండెక్కి కూర్చున్నాయి.

సాయానికి బహుమతి ఇదేనా?
వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక కథనం ప్రకారం… అమెరికాపై ఆయా దేశాలకు ఉన్న అసంతృప్తి కేవలం అధ్యక్షభవనంపై దౌత్యపరమైన ఒత్తిడికే పరిమితం కాలేదు. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అనేక సైనిక స్థావరాలు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో కొన్ని స్థావరాలు గల్ఫ్‌ దేశాలలో కొనసాగుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాలు ఇరాన్‌ ఆగ్రహానికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అమెరికా సైనిక స్థావరాలను మనం ఎందుకు అనుమతించాలన్న ప్రశ్న ఇప్పుడు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌, కువైట్‌, బహ్‌రైన్‌ దేశాలలో తలెత్తుతోంది. ఇరాన్‌తో దౌత్య ప్రయత్నాలలో అమెరికా వైఫల్యం, గత ఐదు నెలలుగా ట్రంప్‌ చేస్తున్న పొంతన లేని ప్రకటనల కారణంగా గల్ఫ్‌ దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయిల్‌ సేనలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి అమెరికాపై ఆగ్రహం పతాక స్థాయికి చేరిందని ఓ గల్ఫ్‌ అధికారి తెలిపారు. ‘యుద్ధాన్ని ప్రారంభించింది ట్రంప్‌. కానీ మూల్యం చెల్లిస్తోంది మాత్రం మేమే’ అని ఆయన అన్నారు.

గల్ఫ్‌ను ఆర్థికంగా దెబ్బతీసిన యుద్ధం
గల్ఫ్‌ దేశాలలో ఒకటైన ఒమన్‌ యుద్ధాన్ని మొదటి రోజు నుంచే వ్యతిరేకించింది. సౌదీ, యూఏఈ, బహ్‌రైన్‌ తొలుత కొంత సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మూడు దేశాలు తరచూ ఇరాన్‌ దాడులకు గురయ్యాయి. వాస్తవానికి ప్రారంభంలో ఇరాన్‌ యుద్ధానికి గల్ఫ్‌ దేశాలు పూర్తి మద్దతు ప్రకటించలేదు. అలాగని వ్యతిరేకించ లేదు కూడా. ఇరాన్‌ ప్రభుత్వం పతనం కాబోదని, హార్ముజ్‌ ఇప్పట్లో తెరుచు కోదని రూఢ అయిన తర్వాత వాటి ఆశలు అడియాసలయ్యాయి. మారు తున్న ట్రంప్‌ వైఖరులు గల్ఫ్‌ దేశాలను కలవరపెడుతున్నాయి. సుదీర్ఘ యుద్ధం గల్ఫ్‌ దేశాలను ఆర్థికంగా బాగా దెబ్బతీసింది. వేసవిలో పర్యాటకుల సంఖ్య బాగా పడిపోయింది. కాగా గల్ఫ్‌ దేశాలతో తమ సంబంధాలు దెబ్బతిన్నాయన్న వాదనను అమెరికా తోసిపుచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -