సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సభలో సీఎం స్పష్టత ఇవ్వాలి : కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ
నవతెలంగాణ- కాజీపేట/హసన్‌పర్తి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటికైనా అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కెజికెఎస్) రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు. ఈ నెల 18న జరిగే సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గీత కార్మికులకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
గీత కార్మికుల చైతన్య బస్సు యాత్ర హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి, అదంపర్తి, భీమారం, యూనివర్సిటీ, అదాలత్, కాజీపేట మీదుగా ఆదివారం మడికొండకు చేరుకుంది. రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించగా ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ,
గీత కార్మికుల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని, వృత్తిలో ప్రమాదాలకు గురై మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా ఆ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.
వృత్తిలో ప్రమాదాలు జరిగిన గీత కార్మికులకు చెల్లించాల్సిన సుమారు రూ.20 కోట్ల ఎక్స్‌గ్రేషియా పెండింగ్‌లో ఉందని తెలిపారు. 50 ఏండ్లు నిండిన గీత కార్మికులకు పెన్షన్ అందించేందుకు జీవో ఉన్నప్పటికీ, కొత్తగా దరఖాస్తులు స్వీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేము కొత్తగా ఎలాంటి కోరికలు కోరడం లేదు, ఎన్నికల సమయంలో మీరే ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నాం’ అని రమణ స్పష్టం చేశారు. వృత్తిలో ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రకటించిన కాటమయ్య రక్షణ కవచంను రాష్ట్రంలోని అర్హులైన గీత కార్మికులందరికీ వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల చొప్పున భూమి కేటాయించాలన్నారు. నీరా, తాటి, ఈత ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. నందనంలోని ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లోని గీత కార్మిక సొసైటీలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. చుక్కయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌని సాంబయ్య గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బండి రంజిత్‌కుమార్ గౌడ్, గౌరవ అధ్యక్షులు గడ్డం యాదగిరి గౌడ్, కోతి సాంబరాజు గౌడ్, మోటపోతుల రాజు గౌడ్, బుర్ర సుధాకర్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలి : రమణ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మానుకోట నుంచి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వరకు నిర్వహించే గీతన్నల చైతయాత్రను జయప్రదం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ కోరారు. గీత కార్మికుల చైతన్య యాత్ర లో భాగంగా ఆదివారం హసన్ పర్తి మండల కేంద్రంలో నిర్వహించిన చైతయాత్రలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కోటి తాటి, ఈత చెట్లకు నంబర్లు వేసి చెట్లను రక్షించాలని వీటిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రతి సొసైటీకి ఐదెకరాల భూమి ఇవ్వాలని, కోటి వరాల పథకంలో కల్లుగీత సొసైటీలకు ఇచ్చిన భూములకు ఫెన్సింగ్, నీటి సౌకర్యం కల్పించి తాటి, ఈత, ఖర్జూర చెట్లు నాటాలని వృత్తి చేసే ప్రతి ఒక్కరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని అందరూ వాడే విధంగా చైతన్యం కల్పించాలని కోరారు.
నీరాకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన రూ.25 కోట్లు, సంక్షేమానికి కేటాయించి రూ.67 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. నీరా కలెక్షన్స్ సెంటర్లు నందనం, సర్వేల్, చారు గుండా, మునుపెల్లిలో పనులు పూర్తి చేయాలని కోరారు. ప్రతి జిల్లాలో తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, యువతి యువకులకు ఉపాధి కల్పించాలన్నారు. ఏజెన్సీ ఏరియాలో వృత్తి చేసే గీత కార్మికులందరికీ సభ్యత్వం ఇచ్చి సొసైటీలు, పీఎఫ్టీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 18 సర్వాయి పాపన్న జయంతి రోజు ట్యాంక్ బండ్ పై విగ్రహం ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోటపోతుల రాజు, గౌని వెంకన్న, బాల్నే వెంకట మల్లయ్య, గౌని సాంబయ్య, కోడం కరుణాకర్, పాలకూరి జగన్, బుర్ర సుధాకర్, మొక్క నాగేశ్వరరావు, సురుగు రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



