నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. రిటైర్మెంట్ సమయంలో అంగన్వాడీ సిబ్బందికి అందించే సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. దీంతో 65 ఏళ్ల వయస్సు పూర్తై రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, అంగన్వాడీ హెల్పర్లకు రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రయోజనం అందనుంది. అంతేకాదు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అంగన్వాడీ సిబ్బంది స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగే వారికి కూడా ఇవే ప్రయోజనాలను వర్తింపజేయనున్నట్లు సర్కార్ వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వ మిషన్ సక్షమ్ అంగన్వాడీ పోషణ్ 2.0 మార్గదర్శకాల ప్రకారం.. అంగన్వాడీ సిబ్బందికి గరిష్ట పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లుగా నిర్ణయించారు. గతంలో అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష.. హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లకు రూ.50 వేలుగా సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ ఉండేవి. అయితే ప్రభుత్వం ఈ మొత్తాలను పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వయస్సులో విధుల నుంచి వైదొలిగే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ అందిస్తున్నారు.
అలాగే 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అంగన్వాడీ సిబ్బంది స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగినా ఈ ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2,572 మంది అంగన్వాడీ సిబ్బంది బ్యాంకు అకౌంట్లలో సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ కింద రూ.15.61 కోట్లు జమ చేశారు. ఇందులో 473 మంది అంగన్వాడీ టీచర్లకు రూ.4.73 కోట్లు.. 1,930 మంది అంగన్వాడీ హెల్పర్లకు రూ.9.65 కోట్లు చెల్లించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.



