నవతెలంగాణ – హైదరాబాద్ : మద్య నిషేధం కఠినంగా అమలులో ఉన్న బిహార్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. దీంతో రోడ్డుపై పడిన మద్యం సీసాల కోసం జనం ఎగబడ్డారు. పట్నాలోని ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోదీపూర్ వద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది.
భారతీయ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) సీసాలతో వెళ్తున్న ఓ కారు జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులోని మద్యం బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఇది గమనించిన పాదచారులు, ట్రక్కు డ్రైవర్లు, ఇతర ప్రయాణికులు వెంటనే అక్కడికి చేరుకుని బాటిళ్లను ఏరుకోవడం ప్రారంభించారు. కొందరు తమ చేతికి దొరికినన్ని సీసాలను పట్టుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ ఈ-రిక్షా పక్కనే జనం మద్యం బాటిళ్ల కోసం పోటీ పడటం ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే మద్యం స్మగ్లర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది.



