2-0 విజయంపై భారత్ గురి
సమంపై ఆతిథ్య శ్రీలంక ఆశలు
నేటి నుంచి భారత్, శ్రీలంక రెండో టెస్టు
ఉదయం
10 నుంచి సోనీస్పోర్ట్స్‌లో…
స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌లపై గత మూడు టెస్టు సిరీస్‌ల్లో రెండింట ఓడిన టీమ్ ఇండియా.. అదే తరహా పరిస్థితుల్లో ఓ సిరీస్‌ను నెగ్గేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 2-0 విజయంపై భారత్ కన్నేయగా.. స్పిన్ మాయతో సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదల శ్రీలంక శిబిరంలో కనిపిస్తోంది. భారత్, శ్రీలంక రెండో టెస్టు నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-కొలంబో
స్పిన్ సవాల్‌ను ఎదుర్కొవటంలో శుభ్‌మన్ సేన సఫలం అవుతుందా? అనే అనుమానాలతో మొదలైన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో.. గాలె టెస్టులో విజయంతో ఆ అనుమానాలకు భారత్ గట్టి సమాధానమే ఇచ్చింది. స్పిన్‌ను సమర్థవంతంగా ఆడటంతో పాటు స్పిన్‌తో ప్రత్యర్థిని మాయ చేయటంలో భారత్ విజయవంతమైంది. ఆరంభంలో పేస్, ఆఖర్లో స్పిన్‌కు సహకరించే కొలంబోలో భారత్, శ్రీలంక నేటి నుంచి రెండో టెస్టులో ఢీకొట్టనున్నాయి. స్పిన్నర్ల మాయాజాలంపై ఆతిథ్య లంకేయులు ఆశలు పెట్టుకోగా.. భారత్ సమిష్టి ప్రదర్శన పునరావృతం చేయాలనే ఆలోచనతో బరిలోకి దిగుతోంది.
కుల్దీప్కు అగ్ని పరీక్ష
చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కెరీర్లో అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నాడు. గాలె టెస్టులో భారత స్పిన్ త్రయం మాయ చేసినా.. ముగ్గురు స్పిన్నర్లలో అంచనాలను అందుకోలేని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్కడే. ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టిన కుల్దీప్ యాదవ్ మ్యాచ్‌లో బ్యాటర్లపై ఒత్తిడి పెంచలేదు. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ వికెట్ల జాతర సాగించగా, సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఆశించిన మేరకు రాణించాడు. దీంతో తుది జట్టులో కుల్దీప్ యాదవ్ చోటు ప్రశ్నార్థకంగా మారింది. రెండో టెస్టుకు కుల్దీప్ను కొనసాగిస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. కుల్దీప్ యాదవ్ ఫామ్ కోల్పోయాడా? జట్టు మేనేజ్మెంట్ అతడికి సరైన భరోసా ఇవ్వటం లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. తొలి టెస్టులో భారత్ సమిష్టిగా రాణించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక్కడే బ్యాటింగ్ ఆర్డర్లో నిరాశపరిచాడు. కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ మెప్పించగా.. దేవదత్ పడిక్కల్ అదరగొట్టాడు. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్‌లు కీలక అర్థ సెంచరీలు సాధించారు. బ్యాటర్లు ఇదే జోరు కొలంబోలోనూ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. వికెట్ల వేట ప్రధానంగా స్పిన్నర్లు చూసుకోగా.. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణలు చక్కటి సహకారం అందించారు. తొలి టెస్టులో ఆల్‌రౌండ్ షో చూపించిన భారత్ నేడు కొలంబోలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
సమం చేయాలని..
తొలి టెస్టులో ఓడినా, ఆతిథ్య జట్టు మరీ తీసికట్టుగా ఆడలేదు. సోనల్ దినుశ బ్యాట్‌తో గొప్పగా రాణించాడు. నిరోషన్ డిక్వెలా, ధనంజయ డిసిల్వలు అర్థ సెంచరీలతో మెరిశారు. ఈ ముగ్గురికి బ్యాటింగ్ లైనప్‌లో కామిందు మెండిస్, లహిరు ఉదార సహకారం దక్కితే పరుగుల వేటలో కష్టాలు ఉండవు. కానీ బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు పూర్తిగా తేలిపోయారు. కేశర నువాంత, ప్రభాత్ జయసూర్య భారత్‌ను ఇరకాటంలో పెడతారనే అంచనాలు తలకిందులయ్యాయి. ఈ ఇద్దరిని భారత బ్యాటర్లు అలవోకగా ఆడారు. పేసర్లు ఫెర్నాండో, కుమార సైతం ప్రభావం చూపించలేదు. బ్యాట్‌తో శ్రీలంక మెరుగ్గానే కనిపిస్తున్నా.. టెస్టుల్లో విజయానికి బౌలర్లు 20 వికెట్లు పడగొట్టాలి. ఇక్కడే ఆతిథ్య శ్రీలంక బలహీనంగా కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం
కొలంబోలో వర్షం సూచనలు ఉన్నప్పటికీ.. గాలె కంటే మెరుగైన వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. తొలి టెస్టులో రోజుకు సగటున 70 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. పిచ్‌పై పచ్చిక ఉండటంతో ఆరంభంలో పేసర్లకు అనుకూలించనుంది. పొడిబారిన పిచ్ టర్న్‌కు అనుకూలం. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం మెండుగా ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
శ్రీలంక : లహిరు ఉదార, కమిల్ మిశార, కామిందు మెండిస్, ధనంజయ డిసిల్వ (కెప్టెన్), సోనల్ దినుశ, పసిందీ సూర్యబండార, నిరోషన్ డిక్వెలా (వికెట్ కీపర్), కేశర నువాంత, ప్రభాత్ జయసూర్య, అషిత ఫెర్నాండో, లహిరు కుమార.



