Monday, August 24, 2026
E-PAPER
Homeఆటలుపేస్ బౌలర్ కు బేడీలు వేసి తీసుకెళ్లిన పోలీసులు

పేస్ బౌలర్ కు బేడీలు వేసి తీసుకెళ్లిన పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టులో కలకలం రేగింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్‌ను పోలీసులు బేడీలతో అదుపులోకి తీసుకున్న ఘటన కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి డెర్బీలోని ఓ నైట్‌క్లబ్ వెలుపల ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విచారణకు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. డెర్బీలోని ‘మోలీ మలోన్స్ ఐరిష్ టావెర్న్’ అనే నైట్‌క్లబ్ వెలుపల నలుగురు పోలీసులు కార్స్‌ను చుట్టుముట్టి చేతులకు బేడీలు వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో తోటి ఇంగ్లండ్ ఆటగాడు మాథ్యూ పాట్స్ అతడితో మాట్లాడుతుండగా, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఆ వీడియోలో కనిపించడం గమనార్హం. అయితే పోలీసులు కార్స్‌ను అరెస్ట్ చేయలేదని, కొద్దిసేపటికే విచారించి ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండా విడుదల చేశారని తెలిసింది.

క్లబ్ నుంచి బయటకు వచ్చి తిరిగి లోపలికి వెళ్లే క్రమంలో బౌన్సర్లతో వివాదం జరగడమే ఈ గొడవకు కారణమని సమాచారం. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో కార్స్ జట్టులో ఉన్నప్పటికీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. దీంతో అతడిని కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఈసీబీ అనుమతించింది. డర్హమ్ తరఫున ఆడిన మ్యాచ్‌లో కార్స్ రెండు వికెట్లు తీశాడు. ఈ ఘటనపై ఈసీబీ స్పందిస్తూ, “డెర్బీలో జరిగిన సంఘటన మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరుపుతున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం” అని తెలిపింది. ఆగస్టు 27 నుంచి లార్డ్స్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో కార్స్ సభ్యుడిగా ఉన్నాడు. గతంలో బెట్టింగ్ సంబంధిత కార్యకలాపాల కారణంగా కార్స్ మూడు నెలల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -