నవతెలంగాణ-ఆలేరు టౌన్
రైతు సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలకు సిద్ధం కావాలని, అఖిల భారత రైతు కూలీ సంఘం, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు, కళ్ళేపు అడవయ్య, ప్రధాన కార్యదర్శి బెజాడి కుమార్ పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలో మంగళవారం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సెప్టెంబర్ 8, 9 తేదీలలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగు, ఏ.ఐ.కె.ఎం.ఎస్. రాష్ట్ర మహాసభలు విజయవంతం కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుందని, గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, విత్తనాలు ఎరువుల ధరలు కేంద్రంలోని ప్రభుత్వం పెంచుకుంటూ పోతున్నాదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం భారత వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టె ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడని, వీటికి వ్యతిరేకంగా మహత్తర రైతాంగ ఉద్యమాలకు పిలుపునిచ్చారు.
పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, సాగు పెట్టుబడులు పెరగడం, నకిలీ విత్తనాలు–ఎరువుల సమస్యలు, పంటలకు సరైన మార్కెట్ సౌకర్యాలు లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. మరోవైపు వ్యవసాయ కూలీలకు ఏడాది పొడవునా ఉపాధి లభించకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు రుణభారాన్ని తగ్గించేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి, కనీస వేతనాలు, భూమి మరియు నివాస హక్కులు కల్పించడంతో పాటు గ్రామీణ పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అద్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు ఇక్కిరి సహదేవ్, చిరబోయిన రాజయ్య, సహాయ కార్యదర్శి మామిడాల బాలమల్లేష్, కోశాధికారి తమ్మడి అంజయ్య, గోపాల్ రెడ్డి, పద్మ సుదర్శన్, చిరబోయిన కొమురయ్య, ఇక్కిరి బీరయ్య, గోవిందు పరమేష్, జాలపు సుధాకర్ రెడ్డి, మాలోతు లాల్ తదితరులు పాల్గొన్నారు.



