Tuesday, August 25, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అభ్యుదయ ఉద్యమాలకు వెన్నుదన్ను వల్లిపల్లి సుమతి

అభ్యుదయ ఉద్యమాలకు వెన్నుదన్ను వల్లిపల్లి సుమతి

- Advertisement -

సుమతిని అక్కా అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకునేవాళ్లం. ఆడపిల్లలకు అసలు చదువెందుకు అనే రోజుల్లోనే సాంకేతిక విద్యను అభ్యసించింది. అభ్యుదయ భావాలకు, వామపక్ష ఉద్యమాలకు ప్రభావితమై కులాంతర వివాహం చేసుకొని అందరికీ ఆదర్శనంగా నిలిచింది. ఐద్వా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. ప్రజా ఉద్యమాల్లో పని చేస్తున్న నాయకులను, కార్యకర్తలను అప్యాయంగా అక్కున చేర్చుకుంది. అలాంటి ఆదర్శమూర్తి ఆగస్టు 25న మనల్ని విడిచి వెళ్లిపోయింది. చివరి వరకూ పార్టీ పట్ల ఎంతో బాధ్యతగా నడుచుకుంది. తన శరీరాన్ని ప్రభుత్వ ఆసుపత్రికిచ్చి మరణంలోనూ చైతన్యాన్ని ప్రదర్శించింది. ఆమె మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను…

వల్లిపల్లి సుమతి… కృష్ట జిల్లా కాటూరు గ్రామంలో పుట్టారు. తల్లి లక్ష్మీ తులసి, తండ్రి నాగభూషణం. అభ్యుదయ భావాలు కలిగిన కుటుంబం వీరిది. అంతేకాదు ఆమె పుట్టిన కాటూరు అభ్యుదయ భావాలకు, మహిళా ఉద్యమానికి పుట్టినిల్లు. మానికొండ సూర్యావతి, రాజేశ్వరమ్మ, కడియాల బుల్లెమ్మ నాయకత్వంలో అప్పట్లో మహిళా ఉద్యమం నడిచేది. మూఢనమ్మకాలకు, ఛాందస భావాలకు వ్యతిరేకంగా మహిళల్లో, యువతలో పెద్ద ఎత్తున ప్రచారం చేసేవారు. అలాగే స్ర్తీ విద్య, వితంతు పునర్వివాహాలు, కులం మతం పట్టింపులు లేని సమాజం కోసం అనేక ఉద్యమాలు అక్కడి నుండే జరిగేవి. అలాంటి చోట పుట్టి పెరగడం వల్ల సుమతిపై కూడా ఆ ప్రభావం పడింది.

​అప్పట్లోనే సాంకేతిక విద్య…
సుమతి వాళ్లు ముగ్గురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. ఆర్థికంగా అంతంత మాత్రమే. అయినప్పటికీ నాగభూషణం దంపతులు తమ పిల్లలను బాగా చదివించారు. ఆరోజుల్లో ఆడపిల్లలకు చదువెందుకు అని అందరూ అనుకునేవారు. కానీ ఆయన తన ముగ్గురు ఆడపిల్లల్ని సాంకేతిక విద్యలో ప్రోత్సహించారు. అంతేకాదు గ్రామంలోని మిగతా ఆడపిల్లలను కూడా చదివించమంటూ తల్లిదండ్రులను ప్రోత్సహించేవారు. ఇంట్లో సుమతినే పెద్ద కూతురు. ఆమె సివిల్‌ ఇంజనీరింగ్‌‌లో డిప్లొమా చేసి, ఇరిగేషన్‌ ‌డిపార్ట్‌‌మెంట్‌‌లో ఉద్యోగం సంపాదించింది. పి.మధును కులాంతర వివాహం చేసుకుంది. అప్పటికే మధు పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా ఉన్నారు. తన చెల్లెళ్లను చదివించడంతో పాటు వాళ్లు కూడా కులాంతర వివాహాలు చేసుకునేలా ప్రోత్సహించిన ఆదర్శ మూర్తి సుమతి. భర్త మధు పార్టీ పనుల్లో విరామం లేకుండా తిరుగుతుంటే ఉద్యోగం చేసుకుంటూనే ఆమే కుటుంబాన్ని చూసుకునేది. అంతేకాదు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు ఇంటికి వచ్చినా అందరికీ అన్నీ చేసి పెట్టేవారుది. ఎంతో ప్రేమగా వారినీ తన కుటుంబ సభ్యులుగా ఆదరించేది. అలాగే సైన్స్ ఉద్యమం (జె.వి.వి.) లో కూడా కీలక పాత్ర పోషించింది. కూతురు ప్రతిభకు పదేండ్లు వున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నైట్‌ కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ (డిగ్రీ) సీటు వచ్చింది. కానీ పాప చదువుకోసం దాన్ని విరమించుకుంది.

ఉద్యోగానికి వీఆర్‌ఎస్‌ ‌తీసుకొని
కూతురు ప్రతిభ ఈరోజు డాక్టర్‌ అయ్యిందంటే అందులో సుమతి కృషి చాలా ఉంది. అంతేకాదు ఈ రోజు పి.మధు పార్టీలో ఓ నాయకుడిగా ఎదిగాడంటే అందులో ఆమె పాత్ర చాలా కీలకం. తర్వాత ఉద్యోగానికి వీఆర్‌ఎస్‌ ‌తీసుకొని మహిళా ఉద్యమంలోకి వచ్చింది. అలాగే ప్రజాశక్తిలో కొన్ని రోజులు అనువాదకురాలిగా చేసింది. బుక్‌హౌస్‌‌లో ఉంటూ అనేక పుస్తకాలను అనువదించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఐద్వా అభివృద్ధికి తన వంతు కృషి చేసింది. 2001లో ఐద్వా అఖిల భారత 7వ మహాసభలు విశాఖపట్నంలో జరిగాయి. అప్పడు ఓ సావనీర్‌ ‌తీసుకొచ్చాం. ఆ సావనీర్‌ పనులన్నీ ఆమె దగ్గరుండి చూసుకుంది. వ్యాసాలు తెప్పించడం, తప్పులు లేకుండా చూడడం, ఫ్రీగా ప్రింటింగ్‌ వేయించడం ఇలా అన్నీ పనులూ ఆమె చూసుకుంది.

మానవి బోర్డు సభ్యురాలిగా…
మానవి పత్రిక ప్రారంభించడంలో సుమతి కీలకపాత్ర పోషించింది. పత్రిక బోర్డు సభ్యురాలిగా ఉంటూ మానవికి కావల్సిన వ్యాసాలు తెప్పించడం, రాయడం, దాన్ని బయటకు తీసుకురావడంలో ఎంతో కృషి చేసింది. అలాగే మోటూరు ఉదయం ట్రస్ట్‌ ‌ప్రారంభంలో కూడా ఆమె కీలకపాత్ర పోషించింది. ట్రస్ట్‌‌లో ఒక సభ్యురాలిగా కూడా ఉంది. ఐద్వా రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఉండేది. ఒక కేసుతల్లితల్లితలతల్లి విషయంలో బెంగుళూరు వరకు వెళ్లి వచ్చింది. అప్పట్లో మహబూబ్‌‌నగర్‌ ‌జిల్లా ధన్వాడ ప్రాతంలో జోగిని వ్యవస్థ బాగా ఉండేది. చాలా మంది మహిళలు బలైపోతూ ఉండేవారు. అప్పట్లో ఇద్దరు పిల్లల తల్లి ఆకలి తట్టుకోలేక చనిపోయింది. అప్పుడు నేనూ, సుమతి కలిసి ధన్వాడ వెళ్లి పక్కన ఉన్న మరో రెండు గ్రామాల్లో తిరిగి జోగినీల సమస్యలు తెలుసుకున్నాం. సుమతి అయితే వాళ్లతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. వారికి పునరావాసం కల్పించాలని, పిల్లలకు చదువులు చెప్పించాలని కొన్ని డిమాండ్స్‌‌తో జిల్లా కలెక్టర్‌‌ని కలిసి వినతిపత్రం ఇచ్చాము.

పెన్షన్‌ ‌మొత్తం విరాళంగా…
రాష్ట్రం విడిపోయిన తర్వాత వారి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌‌కు మారింది. గత కొన్నేండ్లుగా మహబూబ్‌‌నగర్‌‌లో డాక్టర్‌‌గా పని చేస్తున్న తన కూతురు ప్రతిభ దగ్గరే ఆమె ఉంటుంది. తను కదలేని స్థితిలో ఉన్నా తనకు వచ్చే పెన్షన్‌‌ మొత్తం రెండు రాష్ట్రాల పార్టీ కమిటీలకు విరాళంగా ఇచ్చేది. ఇటీవల హైదరాబాద్‌‌లో జరిగిన ఐద్వా అఖిల భారత మహాసభలకు కూడా 30 వేలు విరాళం ఇచ్చారు. ఇదంతా ప్రజా ఉద్యమాలపై ఆమెకున్న ప్రేమకు నిదర్శనం. పార్టీ అన్నా, పార్టీలో పని చేసే పూర్తి కాలం కార్యకర్తలన్నా ఆమెకు ఎంతో ప్రేమ.

రాజకీయ చైతన్యంతో ఉద్యమాలకు తోడ్పాటు…
నాకైతే వ్యక్తిగతంగా ఎన్నో సలహాలు ఇచ్చేవారు. పెండ్లి కాక ముందు నుండి నాకు సుమతక్కతో మంచి పరిచయం. మా సృజన పుట్టిన కొత్తలో ఉద్యమాన్ని, పాపని సమన్వయం చేసుకోలేక సతమతమవుతుంటే ఎలా నిర్వహించుకోవాలో సలహాలు ఇచ్చేది. అభ్యుదయ ఉద్యమాలు జరగడం ఓ భాగమైతే వాటి ప్రభావం మనుషులపై చాలా ఉంటుంది. అలా ప్రభావితమైన వ్యక్తి సుమతి. ఆ ప్రభావంతోనే రిటైర్‌ అయిన తర్వాత కూడా పార్టీకి తన వంతుగా సహకారం అందించింది. అప్పట్లో చిర్రావూరిగారినైతే నాన్న అంటూ అప్యాయంగా పిలిచేది. నండూరి ప్రసాదరావు అండర్‌ ‌గ్రౌండ్‌‌లో ఉన్నప్పుడు సుమతి దగ్గరే ఉండేవారు. ఎంహెచ్‌‌తో కూడా ఈమెకు మంచి అనుబంధం ఉండేది. నాయకులందరినీ తన కుటుంబ సభ్యులుగా చూసుకునేది. కుటుంబాల్లో ఉండే మహిళల తోడ్పాటు లేకుండా అభ్యుదయ ఉద్యమాలు కొనసాగించడం సాధ్యం కాదు. అలాంటి పాత్ర పోషించిన వారిలో సుమతి ఒకరు. చివరి రోజుల్లో తల్లిని ప్రతిభ కంటికి రెప్పలా చూసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -