Monday, August 24, 2026
E-PAPER
Homeమానవిఆమె ముఖమే ఎందుకు కనిపిస్తుంది?

ఆమె ముఖమే ఎందుకు కనిపిస్తుంది?

- Advertisement -


‘నా ముఖం వీడియో తీయనివ్వకండి మేడమ్.. మా నాన్న చూస్తే చచ్చిపోతాడు!’.. ఈ ఒక్క మాటలో ఒక స్త్రీ భయం ఉంది. కానీ అంతకంటే లోతుగా చూస్తే స్త్రీని మనిషిగా కాకుండా కుటుంబ గౌరవానికి ప్రతీకగా చూసే పితృస్వామ్య సమాజం మీదున్న భయం కనిపిస్తుంది. ఒక పోలీసు దాడిలో మహిళల ముఖాలే ఎందుకు కెమెరాలకు చిక్కుతాయి? ఆ గదుల్లోకి వెళ్లిన పురుషుల ముఖాలు ఎక్కడ? దళారుల ముఖాలు ఎక్కడ? ఆ వ్యవస్థను నడిపించే వారి ముఖాలు ఎక్కడ? ఇదే ప్రశ్న ఈ కథనం మన ముందుంచుతుంది.


మన సమాజంలో స్త్రీని శతాబ్దాలుగా ఒక స్వతంత్ర వ్యక్తిగా కాకుండా తండ్రి ఆధీనంలోని కూతురిగా, భర్త ఆధీనంలోని భార్యగా, కొడుకు ఆధీనంలోని తల్లిగా చూసే భావజాలం బలంగా పనిచేసింది. మనుస్మృతి వంటి గ్రంథాలలో ప్రతిబింబించిన స్త్రీ స్వాతంత్ర్య నిరాకరణ భావజాలం చారిత్రకంగా భారతీయ పితృస్వామ్య నిర్మాణాలకు ఒక ముఖ్యమైన సిద్ధాంత ఆధారం అయింది. ఆధునిక రాజ్యాంగం స్త్రీకి సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం హక్కులుగా ఇచ్చినప్పటికీ, మనువాదపు సామాజిక మనస్తత్వం మాత్రం ఇంకా అనేక రూపాల్లో మన కుటుంబాల్లో, కుల వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో, మీడియా భాషలో, స్త్రీ శరీరంపై నైతిక తీర్పుల్లో కొనసాగుతూనే ఉంది. అందుకే ఒక మహిళ చేసిన పని కుటుంబ పరువుకు మచ్చగా కనిపిస్తుంది. కానీ అదే పనిలో పాల్గొన్న పురుషుడి కుటుంబ పరువు గురించి సమాజం ఎందుకు మాట్లాడదు?

ఇది యాదృచ్ఛికం కాదు
పితృస్వామ్యం స్త్రీ శరీరాన్ని కుటుంబ గౌరవానికి ప్రతీకగా మార్చింది. పురుషుడి శరీరాన్ని మాత్రం అతని వ్యక్తిగత స్వేచ్ఛగా వదిలేసింది. స్త్రీ తప్పు చేస్తే ‘కుటుంబ గౌరవం’.. పురుషుడు చేస్తే ‘వ్యక్తిగత విషయం’! ఆ అమ్మాయి ‘మా నాన్న చూస్తే చచ్చిపోతాడు’ అని ఎందుకు భయపడింది? ఎందుకంటే మన సమాజంలో కూతురు శరీరంపై తండ్రికి, భార్య శరీరంపై భర్తకు, స్త్రీ ప్రవర్తనపై కుటుంబానికి ఒక నైతిక అధికారం ఉన్నట్టుగా భావించే పితృస్వామ్య సంస్కృతి ఇంకా బతికే ఉంది. ఒక అమ్మాయి ప్రేమిస్తే కుటుంబ పరువు పోతుంది. ఒక అమ్మాయి తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకుంటే కుటుంబం అవమానానికి గురైనట్టవుతుంది. ఒక అమ్మాయి తన శరీరంపై తానే నిర్ణయం తీసుకుంటే సమాజం ఆమె నైతికతను ప్రశ్నిస్తుంది. కానీ అదే సమాజంలో ఒక పురుషుడు వ్యభిచార సేవను కొనుగోలు చేస్తే అతని తండ్రిని పిలిచి.. ‘మీ కొడుకు ఇలా చేశాడు. మీ కుటుంబ పరువు పోయింది’ అని ఎవరు ప్రశ్నిస్తారు? ఇదే పురుషాధిక్య సమాజపు ద్వంద్వ ప్రమాణం.

స్త్రీ శరీరం మీద అందరికీ హక్కు ఎందుకు?
స్త్రీ శరీరం ఆమెదే. కానీ పితృస్వామ్య సమాజం దానిపై ఎన్నో హక్కులు ప్రకటించింది. తండ్రి.. “నా కూతురు ఎలా ఉండాలి?”, భర్త.. “నా భార్య ఎలా ఉండాలి?” కుటుంబం.. “మా ఇంటి ఆడపిల్ల ఇలా చేయకూడదు”, కులం.. “మా కులంలోని స్త్రీలు ఈ హద్దు దాటకూడదు”, మతం.. “స్త్రీకి ఇంతవరకే స్వేచ్ఛ”, సమాజం.. “ఆమె ఇలా దుస్తులు వేసుకోవద్దు’’, మార్కెట్.. “నీ శరీరాన్ని అందంగా మార్చుకో, అమ్ముకో, ప్రదర్శించు.” అయితే చివరికి స్త్రీ ఎక్కడ ఉంది? తన శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు మాత్రం ఆమెకే పూర్తిగా ఎందుకు ఉండదు? ఇదే స్త్రీ అస్తిత్వం యొక్క అసలు ప్రశ్న.

మనువాదం నుంచి మార్కెట్ వరకు
ఒకవైపు మనువాద పితృస్వామ్యం స్త్రీని “పవిత్రత”, “కుటుంబ గౌరవం”, “మర్యాద” అనే సంకెళ్లతో నియంత్రిస్తుంది. మరోవైపు పెట్టుబడిదారీ వినియోగ సంస్కృతి స్త్రీ శరీరాన్ని ఒక వస్తువు, ఆకర్షణ, మార్కెట్ విలువగా మార్చుతుంది. రెండూ భిన్నంగా కనిపించినా ఒక విషయంలో ఒకటే.. స్త్రీని సంపూర్ణ మనిషిగా కాకుండా ఒక నిర్దిష్ట ప్రయోజనానికి ఉపయోగపడే వస్తువుగా చూడటం. మనువాదం ఆమె శరీరాన్ని కుటుంబ గౌరవం కోసం నియంత్రిస్తుంది. మార్కెట్ ఆమె శరీరాన్ని లాభం కోసం వినియోగిస్తుంది. ఈ రెండింటి మధ్య స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ అస్తిత్వం, స్త్రీ నిర్ణయాధికారం నలిగిపోతున్నాయి. అయితే ప్రతి మహిళను బాధితురాలిగానే చూడాలా? లేదు. ఇదే ఈ చర్చలో చాలా జాగ్రత్తగా చూడాల్సిన అంశం. ఒక మహిళ స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయాన్ని మనకు నచ్చలేదనే కారణంతో ఆమెను నేరస్థురాలిగా చూడలేం. అలాగే పేదరికం, కుటుంబ ఒత్తిడి, భర్త హింస, మానవ అక్రమ రవాణా, దళారీ వ్యవస్థ వంటి కారణాలను చూపించి ప్రతి నిర్ణయాన్నీ పూర్తిగా సమర్థించలేం.

దీప్తి కథ ఒక భిన్నమైన ప్రశ్నను అడుగుతుంది
ఆమెకు ఉద్యోగం ఉంది. ఆదాయం ఉంది. కానీ వినియోగ సంస్కృతి సృష్టించిన “ఇతరుల్లా జీవించాలి” అనే కోరిక ఆమెను ప్రమాదకరమైన నిర్ణయానికి నడిపించింది. అక్కడ మనం ఆమెను మాత్రమే నిందించడం సరిపోతుందా? క్రెడిట్ కార్డు, అప్పులు,, సోషల్ మీడియా సృష్టించే కృత్రిమ జీవన ప్రమాణాలు, మార్కెట్ పెంచే అదుపులేని కోరికలు ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిందే. అయితే చివరికి వ్యక్తిగత నిర్ణయానికి వ్యక్తిగత బాధ్యత కూడా ఉంటుంది.

ఎంపికలు ఎన్ని ఉన్నాయి?
పోలీసు దాడి నుంచి పురుషాధిక్య వ్యవస్థ వరకు పోలీసులు అక్రమ రవాణా, మైనర్ల దోపిడీ, బలవంతపు నిర్బంధం, దళారీ వ్యవస్థపై చర్యలు తీసుకోవాలి. అది ప్రభుత్వ బాధ్యత. కానీ ఒక దాడిలో మహిళలను మాత్రమే పట్టుకుని, వారి ముఖాలను వీడియోలుగా ప్రచారం చేసి, వారినే సమాజం ముందు అవమానిస్తే.. అది న్యాయాన్ని అసంపూర్ణంగా చేస్తుంది. నేర వ్యవస్థలో చివరి మెట్టుపై ఉన్న మహిళ ముఖం అందరికీ కనిపిస్తుంది. పై మెట్లలో ఉన్న దళారి, నిర్వాహకుడు, డబ్బు సంపాదించేవాడు, సేవను కొనుగోలు చేసేవాడు మాత్రం ఎందుకు కనిపించడు? ఇది కేవలం పోలీసింగ్ సమస్య కాదు. ఇది పురుషాధిక్య సమాజపు దృష్టి సమస్య. స్త్రీని శిక్షించడం ద్వారా సమాజం తన నైతికతను నిరూపించుకోవాలని చూస్తుంది. పురుషుడిని ప్రశ్నించకుండా వదిలేస్తూ అదే సమాజం తన పురుషాధిక్యాన్ని కాపాడుకుంటుంది.

ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి?
దాడులు అవసరమైన చోట జరగాలి. కానీ దాడి తర్వాత కథ మొదలవ్వాలి.. ముగియకూడదు. అక్రమ రవాణాకు గురైన మహిళకు న్యాయ సహాయం కావాలి. బలవంతపు దోపిడీ నుంచి బయటపడిన మహిళకు భద్రత కావాలి. పిల్లలకు విద్య కావాలి. ప్రత్యామ్నాయ ఉపాధి కావాలి. మానసిక సహాయం కావాలి. గృహహింస నుంచి రక్షణ కావాలి. సామాజిక పునరావాసం కావాలి. ముఖ్యంగా ఆమెను మళ్లీ అదే పరిస్థితుల్లోకి నెట్టకుండా ఆర్థిక స్వావలంబన కల్పించాలి. లేకపోతే ప్రతి దాడి తర్వాత మహిళలు పోలీసు వాహనంలోకి ఎక్కుతారు, కొన్ని గంటల తర్వాత విడుదలవుతారు, కొన్ని రోజుల తర్వాత అదే వ్యవస్థలోకి తిరిగి వెళ్తారు. అప్పుడు ప్రభుత్వం నేరాన్ని అరికట్టలేదు. కేవలం ఒక రాత్రిని నిర్వహించింది.

మరి పురుషుడి బాధ్యత?
ఈ చర్చలో అత్యంత అసౌకర్యమైన ప్రశ్న ఇదే. సేవను కొనుగోలు చేసే పురుషుడి గురించి మనం ఎంత మాట్లాడుతున్నాం? అతని ముఖం ఎందుకు వైరల్ కాదు?
అతని కుటుంబం ఎందుకు ప్రశ్నించబడదు? అతని నైతికత ఎందుకు చర్చకు రాదు? స్త్రీని మాత్రమే నైతికతకు ప్రతీకగా నిలబెట్టి, పురుషుడిని ఆ నైతికతకు అతీతంగా ఉంచే సమాజాన్ని ప్రశ్నించకపోతే సమస్యకు పరిష్కారం రాదు. స్త్రీ శరీరాన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చే వ్యవస్థలో కొనుగోలుదారుడి పాత్రను కూడా ప్రశ్నించాలి. ఇది పురుషులందరినీ నిందించడం కాదు. పురుషాధిక్య నిర్మాణాన్ని ప్రశ్నించడం. మంచి పురుషుడు అంటే స్త్రీకి రక్షకుడిగా ఉండేవాడు మాత్రమే కాదు; స్త్రీని తనతో సమానమైన మనిషిగా గుర్తించేవాడు. స్త్రీకి రక్షణ కాదు సమానత్వం కావాలి. మన సమాజం తరచుగా “ఆడవాళ్లను రక్షించాలి” అంటుంది. కానీ స్త్రీకి ఎప్పటికీ రక్షకుడు అవసరమయ్యేలా చేసే వ్యవస్థను ఎందుకు మార్చకూడదు?

స్త్రీవాదం అంటే…
స్త్రీ చేసిన ప్రతి పనినీ సమర్థించడం కాదు. స్త్రీకి కూడా సంపూర్ణ మానవత్వం ఉందని అంగీకరించడం. ఆమె నిర్ణయాలను సమాజం విమర్శించవచ్చు కానీ ఆమె మానవ గౌరవాన్ని మాత్రం దోచుకోకూడదు. ‘సమ్మతి’ వెనుక దాగి ఉన్న బలవంతం సంధ్య అడిగిన ప్రశ్న ఈ కథనానికి గుండె లాంటిది. “ఒక్క దారే పెట్టి ‘నువ్వే ఎంచుకున్నావు’ అంటే.. అది కూడా నా ఇష్టమేనా?” పితృస్వామ్య సమాజం తరచుగా బలవంతాన్ని కేవలం శారీరక హింసగా మాత్రమే చూస్తుంది. కానీ ఆకలి కూడా ఒక బలవంతమే. అప్పు కూడా ఒక బలవంతమే. పిల్లల ఆకలి కూడా ఒక బలవంతమే. భర్త హింస కూడా ఒక బలవంతమే. ఉద్యోగం లేకపోవడం కూడా ఒక బలవంతమే. సామాజిక భద్రత లేకపోవడం కూడా ఒక బలవంతమే. అందుకే “ఆమె స్వయంగా వెళ్లింది కదా?” అనే ఒక్క ప్రశ్నతో కథ ముగించలేం.

పూర్ణిమా యర్రంశెట్టి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -