Monday, September 14, 2026
E-PAPER
Homeఖమ్మంఆధారాలు లేని ఆరోపణలు మానుకోండి

ఆధారాలు లేని ఆరోపణలు మానుకోండి

- Advertisement -

– మాజీ ఎమ్మెల్యే సండ్రకు కాంగ్రెస్ శ్రేణుల స్ట్రాంగ్ కౌంటర్
నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, గాదె చెన్నకేశవరావు తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ చైర్‌పర్సన్‌ తో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆసుపత్రి సేవలపై ప్రజల్లో అపోహలు సృష్టించడం తగదని హితవు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వంద పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సత్తుపల్లి ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయిందని స్పష్టం చేశారు.

స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఆసుపత్రిలో అవసరమైన వసతులు, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆసుపత్రిలో నీటి సమస్య వల్ల డయాలసిస్ సేవలకు అంతరాయం కలుగుతుందని తెలుసుకున్న ఎమ్మెల్యే రాగమయి దయానంద్ వెంటనే స్పందించి బోరు వేయించి సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు. సింగరేణి సహకారంతో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి ఆధునిక వైద్య సేవలను సత్తుపల్లికి తీసుకురావడానికి ప్రయత్నాలు వేగవంతం చేశారని పేర్కొన్నారు. పాము కాటు బాధితుడు గొల్లమందల శివకు వైద్యం అందించవద్దని ఓ అగ్రనాయకుడు ఫోన్ చేశారన్న సండ్ర ఆరోపణలను వారు తప్పుపట్టారు. ధైర్యం ఉంటే ఆ ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సంబంధిత వైద్యుడు గంగరాజుతో మాట్లాడగా తమకు ఎవరూ ఫోన్ చేయలేదని స్పష్టం చేశారని వెల్లడించారు.

​ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మెరుగుపడుతున్న తరుణంలో, లేనిపోని సమస్యలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. నిజంగానే సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు చల్లగుళ్ల కృష్ణయ్య, ఫయాజ్ అలీ, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, విరివాడ నాగభూషణం, గొర్లమారి రామ్మోహన్‌రెడ్డి, పింగిలి సామేలు, సందీప్ గౌడ్, షరీఫుద్దీన్, నాగుల్ మీరా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -