Tuesday, August 25, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెగని కృష్ణా నీళ్ల పంచాయితీ

తెగని కృష్ణా నీళ్ల పంచాయితీ

- Advertisement -

అర్దాంతరంగా ముగిసిన కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ
50:50 వాటాపై తెలంగాణ ప్రతిపాదన..66:34 కట్టుబడి ఉండాలని ఏపీ వాదన
ఈ ఏడాది తాగునీటికే కేటాయింపులు: కేఆర్‌ఎంబీ
బోర్డు ప్రతిపాదనకు రెండు రాష్ర్టాలు అంగీకారం..
సెప్టెంబర్‌ 4‌న మరోసారీ భేటీ కావాలని నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హైదరాబాద్‌‌లోని జలసౌధలో సోమవారం జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం అర్దాంతరంగా ముగిసింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ కాంబోజు అధ్యక్షతన జరిగిన భేటీకి తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు హాజరయ్యారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌నీటి వాటాలపై బోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సంవత్సరం మొత్తం నీటి వినియోగంపై తెలంగాణ ప్రతిపాదన చేయగా, అక్టోబర్ వరకు నీటి కేటాయింపులు చేయాలని ఏపీ ప్రతిపాదించింది. తాగు నీటికి 47 టీఎంసీలు కావాలని ఏపీ కోరగా, మొత్తంగా 50:50 వాటాను నిర్ణయించాలనీ, తాగు నీటి కోసం వచ్చే ఆగస్టు వరకు 50 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరింది. అయితే నీటి వాటాలపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు రాష్ర్టల నీటి వాటాలపై చర్చించేందుకు సెప్టెంబర్​ 4న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా కృష్ణా నదీ కింద ఉన్న ప్రాంతాలకు తాగునీటి అవసరాల కోసమే నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలకు రెండు రాష్ర్టాలు అంగీకరించాయి.

​ 50 టీఎంసీలు కేటాయించాలి: తెలంగాణ ఈఎన్సీ రమేశ్‌‌బాబు
తెలంగాణ తాగు నీటి అవసరాలకు గాను కృష్ణా నది నుంచి 50 టీఎంసీలు కేటాయించాలి. శ్రీశైలం నుంచి 10 టీఎంసీలు, నాగార్జున సాగర్‌ ‌నుంచి 40 టీఎంసీలు వాడుకుంటాం. ఈ ఏడాది మొత్తంగా కృష్ణా నది జలాల పంపిణీ 50:50 రేషియో ప్రాతిపదికన చేపట్టాలి. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా చేపడుతున్న నీటి వాడకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోర్డుకు ఫిర్యాదు చేశాం. ఏపీ ఇప్పటికే తమ వాటా కంటే అదనంగా 10 టీఎంసీల నీటిని వాడుకుంది. సెప్టెంబర్ 4న జరిగే బోర్డు సమావేశంలో తాగునీటి అవసరాలపై మాత్రమే చర్చ ఉంటుంది. భవిష్యత్​లో ప్రవాహాలు వస్తే తదుపరి ఆలోచిస్తాం.

నీటి వాటాలపై చర్చించలేదు: ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి
కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఇరు రాష్ర్టాల నీటి వాటాలపై చర్చించలేదు. ఎల్‌‌నినో ప్రభావం వల్ల తాగునీటి ప్రాధాన్యతపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఏడాది మొత్తం నీటి వినియోగానికి సంబంధించిన నివేదికను తెలంగాణ అందించగా, ఏపీ మాత్రం అక్టోబర్ నెల వరకు అవసరమైన నీటి పంపిణీకి ప్రతిపాదనలు పెట్టింది. రాబోయే కాలానికి సంబంధించి 47 టీఎంసీల నీటిని కేటాయించాలని తాము కోరగా, దానికి తెలంగాణ అభ్యం తరం వ్యక్తం చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 22 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణ సమ్మతించింది. మొత్తం కృష్ణా నీటి వాటాను గతంలో మాదిరిగానే 66:34 రేషియోగా పంపిణీ చేయాలని బోర్డును కోరాం.

సెప్టెంబర్‌ 4‌న మరోసారీ భేటీ
ఈ ఏడాది కాలానికి సంబంధించి నీటి వాటాల విషయం తేలక పోవడంతో సెప్టెంబర్‌ 4‌న మరోసారీ భేటీ కావాలని బోర్డు నిర్ణయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ర్టాలు ఈ ఏడాదికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలను ఈ నెలాఖరులోపు సమర్పించాలని బోర్డు సూచించింది. మొత్తం టీఎంసీలు, ఏ ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీలు వాడుకుంటారు, తదితర వివరాలను అందించాలని బోర్డు కోరింది. సెప్టెంబర్‌ 1‌న జరిగే సమావేశానికి రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖల ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌లు హాజరయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కేఆర్‌ఎంబీ ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -