దినుశ, సూర్యబండార ప్రతిఘటన
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 265/8
భారత్, శ్రీలంక
రెండో టెస్టు
మూడో రోజు
కొలంబో టెస్టులో టీమ్ ఇండియా ఆధిపత్యం కొనసాగుతుంది. సోనల్ దినుశ (85 నాటౌట్), పసిందు సూర్యబండార (80) అర్థ సెంచరీలతో ప్రతఘటించినా, టీమ్ ఇండియాదే పైచేయిగా నిలిచింది. పేసర్ ప్రసిద్ కృష్ణ (3/47), స్పిన్నర్ మానవ్ సుతార్ (3/83) మూడేసి వికెట్లు పడగొట్టి ఆతిథ్య శ్రీలంకను ఇరకాటంలో పడేశారు. కానీ ఆఖరు 38 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టిన శుభ్‌మన్ సేన… ఒకింత అసంతృప్తితో మూడో రోజు ఆటను ముగించింది. ప్రస్తుతం శ్రీలంక 238 పరుగుల తొలి ఇన్నింగ్స్ వెనుకంజలో కొనసాగుతోంది.
నవతెలంగాణ-కొలంబో
బ్యాటర్లు సమిష్టిగా రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన టీమ్ ఇండియా.. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. పేసర్ ప్రసిద్ కృష్ణ, స్పిన్నర్ మానవ్ సుతార్లు మూడేసి వికెట్లతో మ్యాజిక్ చేయగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 83.4 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. సోనల్ దినుశ (85 నాటౌట్, 137 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో ఫిఫ్టీ ప్లస్ ఇన్నింగ్స్ నమోదు చేయగా.. పసిందు సూర్యబండార (80, 133 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించాడు. ఇతర బ్యాటర్లు భారత బౌలర్ల మాయకు విలవిల్లాడగా.. ఈ ఇద్దరు అర్థ సెంచరీలతో ప్రతిఘటించారు. 45.3 ఓవర్లలో 173/7తో నిలిచిన శ్రీలంక ఇన్నింగ్స్ పతనం లాంఛనమే అనిపించినా.. ఆ తర్వాత 38 ఓవర్లలో ఆ జట్టు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. టెయిలెండర్లతో కలిసి సోనల్ దినుశ భారత బౌలర్లను సమర్థవంతంగా నిలువరించగా.. వరుణుడి రాకతో గంటకు పైగా ఆట తుడిచిపెట్టుకుపోయింది.
మెరిసిన బౌలర్లు
ఓవర్‌నైట్ స్కోరు 8/2తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. కమిల్ మిశార (19)ను ప్రసిద్ కృష్ణ అవుట్ చేయగా.. 35/3తో ఆ జట్టు కష్టాల్లో కూరుకుంది. పసిందు సూర్యబండార (80), కామిందు మెండిస్ (32) నాల్గో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నిర్మించారు. ఆరు ఫోర్లతో 75 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన సూర్యబండార భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ప్రసిద్‌కృష్ణ విడదీశాడు. దీంతో 29.6 ఓవర్లో శ్రీలంక 122 పరుగుల వద్ద నాల్గో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వ (8), నిరోశ్ డిక్వెలా (0)లకు తోడు సూర్యబండార సైతం పెవిలియన్‌కు చేరటంతో శ్రీలంక 173/7తో కష్టాల్లో కూరుకుంది. ఈ పరిస్థితుల్లో ఆ జట్టు ఫాలోఆన్ ప్రమాదంలో పడినట్టే కనిపించింది.
ఔరా.. సోనల్ దినుశ
టెస్టు సిరీస్‌లో ఇరు జట్లలో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లలో సోనల్ దినుశ ముందున్నాడు. వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో సోనల్ ఫిఫ్టీ ప్లస్ ఇన్నింగ్స్ బాదాడు. జట్టు కష్టాల్లో ఉండగా, మరోవైపు భారత బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో బంతులేసినా… వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయటంతో పాటు స్కోరుబోర్డును సైతం ముందుకు నడిపించాడు. కేశర నువాంత (18, 74 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) జతగా దినుశ 137 బంతుల్లో 57 పరుగులు జోడించాడు. టీ విరామానికి ముందే ఆలౌట్‌పై కన్నేసిన భారత్‌కు సోనల్ చెక్ పెట్టాడు. 82 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో అర్థ సెంచరీ సాధించిన సోనల్ దినుశ.. విమర్శకుల మెప్పు పొందే ఆటతీరు కనబరిచాడు. దీంతో శ్రీలంక 83.4 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులతో కోలుకుంది. ఆఖరు సెషన్లో వర్షం అంతరాయం కలిగించటంతో మళ్లీ ఆట కొనసాగలేదు. దినుశతో పాటు లహిరు కుమార (8 నాటౌట్) అజేయంగా క్రీజులో నిలిచాడు.
గతి తప్పిన బౌలింగ్!
గాలె టెస్టులో గర్జించిన బౌలర్లు.. కొలంబోలో కాసింత వెనుకంజ వేశారు. పేసర్లు, స్పిన్నర్లు రెండు సెషన్ల పాటు మెప్పించినా ఆ తర్వాత ఉత్సాహం తగ్గింది. మూడో రోజు ఆట ఆఖరు 38 ఓవర్లలో భారత్ మూడు వికెట్లు పడగొట్టలేకపోయింది. ఫలితంగా శ్రీలంక ఫాలోఆన్ ప్రమాదం నుంచి గట్టెక్కి… తొలి ఇన్నింగ్స్ లోటును భారీగా తగ్గించుకునే దిశగా సాగుతోంది. అరంగ్రేట స్పిన్నర్ సరాంశు జైన్ తొలి స్పెల్‌లో ఆకట్టుకున్నా.. ఆ తర్వాత మాయ చేయలేకపోయాడు. మానవ్ సుతార్, రవీంద్ర జడేజాలు వికెటు టూ వికెట్ బౌలింగ్ వేసినా ప్రయోజనం దక్కలేదు. బంతి పాతబడిన తర్వాత పేసర్లకు సైతం బ్యాటర్లపై ఒత్తిడి పెంచే అవకాశం లేదు. కొత్త బంతి అందినా, ఆశించిన ఊరట దక్కలేదు. టెయిలెండర్లు తోడుగా సోనల్ దినుశ భారత బౌలర్లను విసిగిస్తూనే ఉన్నాడు. సోనల్ను ఇరకాటంలో పడేయటంలో భారత బౌలర్లు వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో విఫలం అయ్యారు. నేడు ఉదయం సెషన్లో ఆఖరు రెండు వికెట్లు ఎంత త్వరగా పడగొడితే.. భారత్ విజయావకాశాలు అంతగా మెరుగవుతాయి. వర్షం ప్రభావిత మ్యాచ్‌లో టెయిలెండర్లను పడగొట్టేందుకు 40-50 ఓవర్లు తీసుకుంటే ఫలితం కచ్చితంగా ప్రతికూలంగానే ఉంటుందని చెప్పనవసరం లేదు!.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 503/9 డిక్లేర్డ్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : లహిరు ఉదార (సి) జైస్వాల్ (బి) ప్రసిద్ 1, మిశార (సి) జురెల్ (బి) ప్రసిద్ 19, జయసూర్య (ఎల్బీ) సుతార్ 2, సూర్యబండరా (బి) జడేజా 80, మెండిస్ (సి) జడేజా (బి) ప్రసిద్ 32, డిసిల్వ (సి) రాహుల్ (బి) సుతార్ 8, సోనల్ నాటౌట్ 85, డిక్వెలా (సి) జురెల్ (బి) సిరాజ్ 0, నువాంత (సి) జైన్ (బి) సుతార్ 18, కుమార నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం: (83.4 ఓవర్లలో 8 వికెట్లకు) 265.
వికెట్ల పతనం : 1-1, 2-8, 3-35, 4-122, 5-137, 6-171, 7-173, 8-230.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 11-0-33-1, ప్రసిద్ కృష్ణ 14-1-47-3, మానవ్ సుతార్ 21-1-83-3, సరాంశు జైన్ 18-5-51-0, రవీంద్ర జడేజా 19.4-4-45-1.



