తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వ్యవహారశైలి చూస్తే ఎన్నికలు ముందే వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. రెండు పార్టీల సభల్లోనూ “వచ్చేది మేమే.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే” అనే రాజకీయ నినాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదికలు క్రమంగా ముందస్తు ఎన్నికల ప్రచార సభలుగా మారుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని పలుమార్లు ప్రకటించారు. ఇటీవల పరకాల సభలో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరడం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. మరోవైపు బీఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో తమకే అధికారం వస్తుందని ప్రచారం చేస్తోంది. అయితే ఎన్నికలకు ముందే ప్రజల రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేయడంకంటే, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రెండు పార్టీలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
అధికార పక్షం గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేరుకుపోయిన అప్పులు, ఆర్థిక భారాలు, పెండింగ్ బిల్లులు, అసంపూర్తి ప్రాజెక్టులే తమకు వారసత్వంగా వచ్చాయని చెబుతోంది. ప్రతిపక్షం మాత్రం తాము చేసిన అభివృద్ధిని ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందని విమర్శిస్తోంది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయంగా సహజమే అయినప్పటికీ, వాటి మధ్య అసలు ప్రజా సమస్యలు మరుగున పడకూడదు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాల హామీ ఎప్పుడు అమలవుతుంది? రైతులకు పంటలకు గిట్టుబాటు ధర, రుణభారం నుంచి ఉపశమనం ఎలా లభిస్తుంది? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఎప్పుడు అందుతాయి? పేదలకు నాణ్యమైన వైద్యం ఎక్కడ లభిస్తుంది? ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు అవసరమైన నిధులు ఎప్పుడు అందుతాయి? ఇవే ఇప్పుడు చర్చకు రావాల్సిన ప్రశ్నలు.
విద్యారంగం తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన అంశం. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయకుండా ప్రైవేటు విద్యావ్యవస్థ విస్తరణనే అభివృద్ధిగా చూడటం సరైంది కాదు. ప్రభుత్వ పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకాలు, పరిశోధనకు నిధులు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టళ్ల వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ అవసరం. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ హామీ అమలుపైనా స్పష్టత రావాలి.ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకురావాలి. గ్రూప్-3 నియామకాల్లో 1,370 మందికి నియామక పత్రాలు అందించడం స్వాగతించదగినదే అయినా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి స్పష్టమైన కాలపట్టిక అవసరం. నిరుద్యోగులు ఇక హామీలను కాకుండా నియామక ప్రక్రియను చూడాలనుకుంటున్నారు.వైద్య రంగానికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరతను నివారించడం, మందుల లభ్యత, పేదలకు ఉచిత వైద్యం, జిల్లా ఆసుపత్రుల సామర్థ్యాన్ని పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం వంటి అంశాలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలి.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, ఫోర్త్ సిటీ వంటి అంశాలు కూడా రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రజా చర్చకు రావాలి. ప్రాజెక్టు వ్యయం ఎంత? ప్రజలకు దాని ప్రయోజనం ఏమిటి? నిర్వాసితుల పునరావాసం ఎలా ఉంటుంది? పర్యావరణంపై ప్రభావం ఏమిటి? ప్రజల ఆస్తులు, హక్కులకు రక్షణ ఎలా కల్పిస్తారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం చెప్పాలి. అభివృద్ధి పేరుతో పేదలు నష్ట పోకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. అదేవిధంగా వ్యవసాయం, సాగునీరు, కరువు, రైతుల రుణభారం, ఉపాధి, మహిళల భద్రత, పట్టణ పేదరికం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ వంటి అంశాలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కూడా తన అనుభవాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు నిర్మాణాత్మక సూచనలివ్వడం కూడా ప్రతిపక్ష బాధ్యతే.
ఎన్నికలు ఒక్కరోజు జరిగే ప్రక్రియ. కానీ పాలన ఐదేండ్లు కొనసాగుతుంది. అందువల్ల ఎన్నికల ప్రచారం కంటే ప్రజల జీవితాలను ప్రభావితం చేసే పాలనకే ప్రాధాన్యం ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ఉపాధి, విద్య, నీరు, భూమి, గౌరవప్రదమైన జీవితం కోసం సాగిన ప్రజా ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఆ హామీల అమలును ప్రశ్నిస్తూ ప్రజల తరఫున నిరంతరం పోరాడటం ప్రధాన ప్రతిపక్ష బాధ్యత. అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఎన్నికల లెక్కలకంటే ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే తెలంగాణ ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుంది.
డా.ఆర్.ఎల్.మూర్తి, 8247672658
ప్రజా సమస్యలపై చర్చేది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



