Tuesday, April 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచర్చలను విఫలం చేసి...!

చర్చలను విఫలం చేసి…!

- Advertisement -

యుద్ధోన్మాది అమెరికా రంకెలు వేస్తున్నది. మరోసారి ఇరాన్‌ మీద విరుచుకుపడేందుకు, యావత్‌ ప్రపంచాన్ని ఇబ్బందుల పాల్జేసేందుకు పూనుకుంది. ఏ క్షణంలో అయినా దాడులు, ప్రతిదాడులు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం నాడు ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలను ట్రంప్‌ యంత్రాంగం ఒక ప్రహసనంగా మార్చి వైఫల్య నెపాన్ని ఇరాన్‌పై నెట్టింది. ఒకవేళ మరోసారి ఇరాన్‌ చర్చలకు వచ్చినా తాను ఖాతరు చేయబోనని ఆదివారం రాత్రి ప్రకటించిన ట్రంప్‌ తన అసలు రూపాన్ని మరోమారు బయటపెట్టుకున్నాడు. చర్చలకు ముందే తమ యుద్ధ నౌకల్లో మారణాయుధాలను నింపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండువారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించినప్పటికీ తన తొత్తు ఇజ్రాయిల్‌తో లెబనాన్‌పై దాడులను కొనసాగించింది. చర్చలను విఫలం చేసేందుకే ఇలా చేసింది. కాల్పుల విరమణ ఒప్పంద గడువు ఈ నెల 22వ తేదీ వరకు ఉన్నప్ప టికీ మనదేశ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఏడున్నర (ఇరాన్‌లో 5.30) తరువాత హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనం కోసం మిలిటరీని నడిపేం దుకు పూనుకున్నట్లు అమెరికా మిలిటరీ సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. రండి ఎలా చేస్తారో చూస్తామంటూ ఇరాన్‌ స్పందించింది. తమ రేవుల భద్రతకు విఘాతం కలిగిస్తే పర్షియన్‌ లేదా ఒమన్‌ గల్ఫ్‌లో ఉన్న ఇతర దేశాల రేవులను వేటినీ వదలబోమని ప్రకటించింది.

దాడుల గురించి ట్రంప్‌ ప్రకటన ప్రభావం చమురు మార్కెట్‌పై పడింది. ఇది రాసిన సమయానికి బ్రెంట్‌ రకం 103డాలర్లకు పెరిగింది. దాడులు, ప్రతిదాడులు కొనసాగితే 150 డాలర్ల వరకు పెరగవచ్చనే ఆందోళన వెల్లడైంది. అమెరికా చర్యను తాము సమర్ధించటం లేదని బ్రిటన్‌,ఆస్ట్రేలియా ప్రకటించి మరోసారి గాలితీశాయి. శాంతికోసం ప్రయత్నించాలన్న పోప్‌ లియో 14పై కూడా ట్రంప్‌ విరుచుకుపడటం కండకావరాన్ని వెల్లడించింది. యుద్ధం వద్దంటూ ఒక సాధారణ ప్రకటన చేశాను తప్ప ఎవరినీ పేరుపెట్టి చెప్పలేదని, అయినా అనుకున్నదాన్ని నిర్భయంగా చెబుతానంటూ స్పందించిన పోప్‌ రిపబ్లికన్‌ పార్టీ యంత్రాంగం బెదిరింపులకు లొంగేది లేదన్న సంకేతమిచ్చారని చెప్పాలి. ట్రంప్‌కు తన సందేశం అర్ధం కాలేదని, ట్రంప్‌ కంపునోట్లో నోరు పెట్టేందుకు తాను సిద్ధం కాదన్నట్లుగా ఎవరితో నూ వాగ్వాదానికి దిగదలుచుకొనేది లేదని కూడా పోప్‌ చెప్పటం హుందాతనాన్ని వెల్లడించింది. ట్రంప్‌ ఉన్మాదం చివరికి తనను తాను ఏసుక్రీస్తు మాదిరి పరిగణించుకొని గాయపడిన ఒక సైనికుడిని పరామర్శిస్తున్నట్లుగా కృత్రిమమేధతో తయారు చేసిన చిత్రాన్ని స్వయంగా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు.తమ నేతలు దైవాంశ సంభూతులంటూ ఎవరైనా వీర భక్తులు వీదుల్లో వీరంగం, వంది మాగధులు స్తోత్రపాఠాలు వల్లించి ఉంటారేమో గానీ ఇలాంటి చౌకబారు పనులు బహుశా ఏ అమెరికా లేదా ఇతర దేశాధినేతలెవరూ చేసి ఉండరు.

నిజానికి హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ పూర్తిగా మూసివేయలేదు. తన మిత్రదేశాల నౌకల రవాణాను అనుమతిస్తున్నది, శత్రుదేశాల వాటి మీద ఆంక్షలు విధించింది. ఫలితంగా రోజుకు 150 నౌకలు తిరిగేవి మార్చినెల మొత్తంలో అంతే సంఖ్యలో రాకపోకలు సాగించాయి. ఆ జలసంధిలో ఇరాన్‌కు కప్పం గట్టి రాకపోకలు సాగిస్తున్న ఓడలను కూడా అడ్డుకుంటామని ప్రకటించిన ట్రంప్‌ కొద్ది రోజుల క్రితం తాము కూడా టెహరాన్‌తో కలసి పన్ను వసూలు చేస్తామని చెప్పిన మాటలను మరచిపోరాదు. ఇరాన్‌ ఆంక్షలను విమర్శించిన అమెరికా తానే రంగంలోకి దిగి ఏ ఓడనూ ఇరాన్‌ రేవుల్లోకి రాకపోకలకు అనుమతించేది లేదని ప్రకటించింది. ఇరాన్‌ నుంచి కొనుగోలు చేసిన చమురుతో ఉన్న ఓడలను ఇప్పుడు ట్రంప్‌ జిగినీ దోస్తు మన ప్రధాని నరేంద్రమోడీ ఎలా జలసంధిని దాటిస్తారో చూడాల్సి ఉంది. దీనికీ ”అనుమతి”ని అడుక్కుంటారా లేక ఇప్పటికైనా చేస్తున్నది తప్పని ఖండించి ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటారా !

ఇంతకాలం సదరు జలసంధితో తమకు పనిలేదని, ఎవరికి కావాలంటే వారు మాట్లాడుకొని నౌకలను విడిపించు కోవచ్చు, మా దగ్గర చమురు చాలా ఉంది, కావాలంటే అమ్ముతామని మాట్లాడిన ట్రంప్‌ ఇప్పుడు దిగ్బంధనానికి ఆకస్మికంగా ఎందుకు నిర్ణయించాడన్న చర్చ జరుగుతోంది. ఇరాన్‌ ఎగుమతి చేసే చమురులో ఎనభై శాతం వరకు చైనా దిగుమతి చేసుకుంటున్నది. అందువలన ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇరాన్‌ రేవుల నుంచి ఆ ఓడలను అడ్డుకుంటే అటు చైనాను ఇటు ఇరాన్‌ను ఇరకాటంలో పెట్టవచ్చన్న ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తున్నది. బహుశా దానికి పూర్వరంగాన్ని సిద్ధం చేసేందుకే ఇరాన్‌కు చైనా ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు గతంలో కూడా చైనా ముందు ప్రదర్శించిన అమెరికాకు తలబొప్పి కట్టి దిగివచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా ఉడుత ఊపులకు బెదిరేవారెవరూ లేరని, ప్రపంచం మీద తన పెత్తనం చెల్లదని వాషింగ్టన్‌ పెద్దలు ఎంత త్వరగా గ్రహిస్తే అంతమంచిది!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -