తమిళనాడులో సీపీఐ(ఎం) అభ్యర్థికి అచ్యుతమేనన్
విస్తృత ప్రచారం పార్టీపై అచంచల నిబద్ధతతో గ్రామాలన్నీ తిరుగుతూ క్యాంపెయిన్
చెన్నై : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పార్టీలన్నీ తమ అభ్యర్థుల కోసం విపరీత ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రజలను ఆకర్షించే ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆయా పార్టీల కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి సలుపుతున్నారు.
నాగపట్టినం జిల్లా కిల్వేలూర్ నియోజకవర్గంలో జి. అచ్యుతమేనన్ అనే వికలాంగుడైన కార్యకర్త.. తన శారీరక వైకల్యాన్ని పక్కకు పెట్టి మరీ సీపీఐ(ఎం) అభ్యర్థి డి. లత కోసం సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. పార్టీ సభ్యుడిగా గ్రామాలన్నీ తిరుగుతూ ప్రచారం చేస్తున్న అచ్యుతమేనన్ కథ ప్రేరణగా నిలుస్తోంది.
కేరళలో మాజీ ముఖ్యమంత్రి సి. అచ్యుత మేనన్ పేరు మీద అనేక మంది ఉన్నారు. కానీ తమిళనాడులోని నాగపట్టినం జిల్లాలో మాత్రం ఒక అచ్యుతమేనన్ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. 38 ఏండ్ల అచ్యుతమేనన్.. శారీరక అంగ వైకల్యం (పోలియో)తో బాధపడుతున్న ప్పటికీ ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు కిల్వేలూర్ పార్టీ కార్యాలయం నుంచి ప్రచారం ప్రారంభిస్తారు. ఆయన నడవలేకపోవడం వల్ల సహచరులు ఆయనను వాహనంలో ఎక్కిస్తారు. లౌడ్స్పీకర్తో కూడిన వాహనంలో గ్రామాలన్నీ తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసం గిస్తారు. అభ్యర్థి అక్కడికి చేరుకునేలోపే ఆయన తన ప్రచారం ముగించుకొని తదుపరి ప్రదేశానికి వెళ్లిపోతారు.
ప్రచారంలో బీజేపీపై విమర్శల బాణాలు
ప్రచారంలో భాగంగా ఆయన బీజేపీ, దాని మిత్రపక్షాలు దేశానికి ముప్పుగా ఉన్నాయని చెప్తారు. అలాగే ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ ఇ. రామస్వామి, భారతరత్న బి.ఆర్. అంబేద్కర్ సిద్ధాంతాల ప్రాముఖ్యతను వివరించి, దేశానికి వామపక్ష ప్రత్యామ్నాయం అవసరమని నొక్కి చెప్తారు.
అలాగే ప్రముఖ తమిళ నటుడు విజరు రాజకీయాల్లోకి రావడంపై అచ్యుతమేనన్ విమర్శలు చేశారు. ఆయనకు రాజకీయ అనుభవం లేదనీ, స్పష్టమైన సిద్ధాంతం, కార్యాచరణ ప్రణాళిక లేదని తెలిపారు. యువత ఆయనను కేవలం సినీ ప్రభావంతో అనుసరిస్తున్నదనీ, ఇది సరైన నిర్ణయం కాదని చెప్పారు.
వామపక్ష కుటుంబం నుంచి..
అచ్యుతమేనన్ కుటుంబం మొదటి నుంచే వామపక్ష భావజాలానికి అనుకూలంగా ఉంది. ఆయన తండ్రి పి.గణేశన్ వామపక్ష అనుచురుడు కాగా.. తల్లి వల్లి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు. తమ ప్రాంతంలో పార్టీకి బలమైన స్థానం ఉందని అచ్యుత మేనన్ చెప్తున్నారు. మరణించిన పార్టీ నేత ఎస్.డి. తంగయాన్ ఆయనకు అచ్యుతమేనన్ అని పేరు పెట్టారు.
చదవడం మీద ఆసక్తి
పార్టీతో ఉన్న అనుబంధం వల్ల అచ్యతమేనన్కు చదవడం మీద ఆసక్తి పెరిగింది. రష్యా రచయిత ఫ్యోడర్ దోస్తోయెవ్స్కీ రచనలు ఆయనకు ఎంతో ఇష్టం. అలాగే సూ.వెంకటేషన్ రచించిన ‘వెల్పారి’ పుస్తకాన్ని కూడా చదివారు. ఆయన ముత్తజగు అనే టీవీ సీరియల్కు కథ రాశారు. కవితలు, వ్యాసాలు రాయడం, చిత్రాలు వేయడం కూడా చేస్తారు. కిల్వేలూర్లోని తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుడిగా కూడా ఆయన ఉన్నారు.
పార్టీ కార్యాలయంలోనే ఉంటూ…
ప్రస్తుతం అచ్యుతమేనన్ ఒక ఎన్జీఓ అయిన హీడ్ ఇండియాలో పని చేస్తున్నారు. భవిష్యత్తులో పార్టీకి మరింత సేవల చేయాలని ఆశిస్తున్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థి లత గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తన పార్టీ కోసం నిస్వా ర్థంగా పని చేస్తున్న అచ్యుతమేనన్ కు పార్టీ సహచరులు ఆహారం అందించి, అవసరాలు తీర్చుతున్నారు. ఆయన పార్టీ కార్యాల యంలోనే నివసిస్తున్నారు. అచ్యుతమేనన్కు దగ్గర బంధువుగా ఆయన అన్న కుమార్తె మాత్రమే ఉంది. ”ఈ పార్టీ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. పార్టీ లేకపోతే నేను సాధారణ వికలాంగుడిగా మిగిలిపోయే వాడిని. బహుశా రైల్వే ప్లాట్ఫాం మీద భిక్షాటన చేస్తూ ఉండేవాడినేమో..” అని అచ్యుతమేనన్ భావోద్వేగంగా చెప్పారు.



