నవతెలంగాణ -హైదరాబాద్: శ్రీలంక క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కుమార సంగక్కర.. 17 ఏండ్ల క్రితం తమ జట్టుపై జరిగిన ఉగ్రదాడిని గుర్తుచేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో లాహోర్‌లో పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఆ భయానక దాడి తన జీవిత దృక్పథాన్నే పూర్తిగా మార్చేసిందని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆయన ఆనాటి భయానక క్షణాలను పంచుకున్నారు.
2009 మార్చి 3న లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం సమీపంలో శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, సంగక్కర, అజంతా మెండిస్, తిలాన్ సమరవీర సహా పలువురు శ్రీలంక ఆటగాళ్లు గాయపడ్డారు. ఈ దాడి కారణంగా పాకిస్థాన్‌లో చాలా ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయింది. దాడికి ముందు జరిగిన ఓ సంఘటనను సంగక్కర గుర్తుచేసుకున్నాడు. “మేము మ్యాచ్ మూడో రోజు గ్రౌండ్‌కు బయలుదేరాం. బస్సులో ముందు సీట్లో కూర్చున్న ఓ ఫాస్ట్ బౌలర్, ‘ఈ ఫ్లాట్ పిచ్‌లపై బౌలింగ్ చేసి నా నడుం విరిగిపోతోంది. ఓ బాంబు పేలితే హాయిగా ఇంటికి వెళ్లిపోవచ్చు’ అని సరదాగా అన్నాడు. ఆ మాట అన్న నిమిషం కూడా గడవకముందే మా బస్సుపై దాడి జరిగింది” అని సంగక్కర తెలిపాడు.
ఆ దాడిలో తాను గాయపడ్డానని, ఇప్పటికీ తన కుడి వైపు శరీరంలో శ్రాప్నెల్ ఉందని సంగక్కర వెల్లడించారు. “నాకు ఎప్పుడూ పీడకలలు రాలేదు. కానీ, ఆ ఘటన శ్రీలంకలో అప్పుడు జరుగుతున్న అంతర్యుద్ధ పరిస్థితులపై నాకు గొప్ప అవగాహనను, కృతజ్ఞతాభావాన్ని ఇచ్చింది. మాకు కేవలం రెండు నిమిషాల పాటు ఆ భయానక అనుభవం ఎదురైతేనే అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద వార్త అయింది” అని అన్నాడు. కొన్ని వారాల తర్వాత కొలంబోలో జరిగిన ఓ సంఘటన తనను మరింతగా కదిలించిందని సంగక్కర వివరించారు. “నేను కారులో వెళ్తుండగా ఓ సైనికుడు ఆపి, ‘మీకు అలా జరిగినందుకు చాలా బాధపడ్డాం’ అన్నాడు. ‘ఇలాంటివి మీకు, మీ సైనికులకు రోజూ జరుగుతాయి కదా’ అని నేను బదులిచ్చాను. దానికి ఆ సైనికుడు, ‘అవును, కానీ మేము దానికోసమే సైన్యంలో చేరాం’ అని చెప్పాడు. ఆ మాటలతో నేను నిశ్చేష్టుడనయ్యాను.



