నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. ఆదాయంలో వాటా విషయంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో మే 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సమ్మర్ సీజన్లో విడుదల కావాల్సిన పలు క్రేజీ సినిమాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఉన్న రెంటల్ పద్ధతి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని థియేటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన నిర్వహణ ఖర్చులు, ఓటీటీల ప్రభావంతో ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో థియేటర్లు నడపడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. అందుకే, మల్టీప్లెక్స్‌ల తరహాలో వసూళ్లలో మొదటి వారం 60 శాతం రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం వాటా ఇచ్చేలా కొత్త రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదనను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగాయని, ఈ సమయంలో రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేస్తే నిర్మాతలు మరింతగా నష్టపోతారని వారు వాదిస్తున్నారు. ఏప్రిల్ 30లోగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మె ఖాయమని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.



