Wednesday, September 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలి

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలి

- Advertisement -

– మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 
నవతెలంగాణ-మెదక్ టౌన్ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా గుర్తించిన అనామలీస్, నాన్‌-లింక్డ్ కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించి, ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం కొనసాగుతున్న క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ప్రక్రియ, డ్రాఫ్ట్ ఓటరు జాబితా అనంతరం గుర్తించిన కేసులపై సమీక్షించారు. జిల్లాలో మండలాల వారీగా గుర్తించిన అనామలీస్, నాన్‌-లింక్డ్ కేసులు, జారీ చేసిన నోటీసులు, నోటీసులు అందించిన వారి వివరాలు, పెండింగ్‌లో ఉన్న కేసుల పూర్తి సమాచారాన్ని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్దేశిత తేదీలో అవసరమైన ఆధారాలతో హాజరయ్యేలా బీ ఎల్ వో లు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఆమోదించబడిన డాక్యుమెంట్లలో ఏదైనా ఒకదాన్ని సమర్పించినప్పుడు, సంబంధిత పత్రాలను పరిశీలించి స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ ఉద్దేశం అర్హులైన ఓటర్లను తొలగించడం కాదని, అవసరమైన ఆధారాల ద్వారా వారి వివరాలను ధృవీకరించడమేనని కలెక్టర్ స్పష్టం చేశారు. వివాహం, వలస, కుటుంబ వివరాల్లో మార్పులు, తల్లిదండ్రుల డాక్యుమెంట్లు అందుబాటులో లేకపోవడం వంటి ప్రత్యేక కేసులను నిబంధనల మేరకు పరిశీలించాలని తెలిపారు. ఇప్పటికీ ఆన్‌లైన్‌లో లింక్ చేసుకునే అవకాశం ఉన్న నాన్‌-లింక్డ్ కేసులను సంబంధిత వ్యక్తులకు తెలియజేసి వెంటనే పూర్తి చేయించాలని సూచించారు. ప్రతి బీ ఎల్ వో తమ పరిధిలోని కేసులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అవసరమైన డాక్యుమెంట్లు మరియు కేసుల పురోగతితో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. క్లిష్టమైన కేసులను ప్రత్యేకంగా గుర్తించి, అవసరమైన సందర్భాల్లో ఉన్నతాధికారుల మార్గదర్శకాలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అంబ దాస్ రాజేశ్వర్,ఎన్నికల విభాగం అధికారి గఫార్, డిప్యూటీ తాసిల్దార్ రాజేశ్వరి, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -