Friday, September 4, 2026
E-PAPER
Homeజాతీయంపోల్‌ను ఢీకొట్టిన ఇండిగో విమానం..

పోల్‌ను ఢీకొట్టిన ఇండిగో విమానం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : శ్రీనగర్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం పార్కింగ్‌ చేస్తుండగా వీఎడీజీఎస్‌ పోల్‌ను తాకింది. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

ముంబై నుంచి శ్రీనగర్‌ వచ్చిన ఇండిగో విమానం 6ఈ 225 (వీటీ-ఎన్‌ఓజీ) ఉదయం 9.02 గంటలకు బే నంబర్‌ 6లో పార్కింగ్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. విమానాన్ని సరైన స్థానంలోకి తీసుకెళ్తున్న సమయంలో వీఎడీజీఎస్‌ డిస్‌ప్లే యూనిట్‌తో పాటు లేజర్‌ లేదా కెమెరా సెన్సర్లను అమర్చిన పోల్‌ను విమానం తాకినట్లు అధికారులు వెల్లడించారు.

వెంటనే ప్రయాణికులు, సిబ్బందిని మాన్యువల్‌ మెట్ల సాయంతో విమానం నుంచి దించారు. అందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సంబంధిత అధికారులు నిబంధనల ప్రకారం విచారణ చేపట్టనున్నారు. విచారణ పూర్తయ్యే వరకు ప్రమాదానికి కారణంపై ఎలాంటి నిర్ధారణకు రావడం లేదని స్పష్టం చేశారు.

ఈ ఘటనతో శ్రీనగర్‌ విమానాశ్రయ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

గురువారం కూడా ఇండిగో విమానానికి సంబంధించిన మరో ఘటన చోటుచేసుకుంది. దోహా నుంచి బెంగళూరుకు వెళ్తున్న 6ఈ 1302 విమాన పైలట్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా మస్కట్‌కు మళ్లించారు. అక్కడ వైద్య బృందం పైలట్‌కు చికిత్స అందించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానం, కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసి బెంగళూరుకు పంపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -