నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు.
స్వయంగా ప్రధానమంత్రి మోడీ నుంచి మొదలుకొని ఈరోజు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు పైన విషం కక్కుతూ…బిజెపి చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు. తెలంగాణను కించపరిచిన తేజస్వి సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు బిజెపి పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలే బిజెపి అధికారిక విధానంగా భావించాల్సి వస్తుందన్నారు.



