పల్లె పరిమళంలో పుట్టిన వ్యక్తిత్వం.. మట్టివాసనలో మమకారం కలిసిన స్వచ్ఛమైన పైరగాలి… అక్కడే మంజుల పత్తిపాటి అనే ఒక సున్నిత హృదయం రూపుదిద్దుకుంది. తర్వాత కాలంలో ఓ సేవకురాలిగా తయారయింది. రాజకీయాల్లోకి ప్రవేశించి ఊరూరూ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటుంది. వాటి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తుంది. అంతేనా తన జ్ఞాపకాలకు, అనుభవాలకు అక్షర రూపం ఇస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ఆలేరు పల్లె గాలిలో, మట్టి పరిమళంలో పెరిగిన ఆ చిన్నారి… పుస్తకాలతో పాటు జీవితాన్ని కూడా చదివింది. రాధానర్సింహారావు దంపతులకు మూడవ సంతానంగా 1974లో పుట్టారు. ఆమెకు తండ్రి ‘ఉపాధ్యాయ వృత్తి కేవలం జీవనోపాధి కాదు అది విలువల బాట’ అని చెబుతూ పెంచారు. అలా తండ్రి పెంపకంలో ఆ చిన్నారి పుస్తకాల మధ్య మాత్రమే కాదు ప్రకృతి ఒడిలో కూడా ఎదిగింది. అల్లారుముద్దుగా పెరిగినా.. ఆ పల్లె జీవితం ఆమెకు మానవత్వాన్ని నేర్పింది. టైపింగ్ హయ్యర్, లోయర్ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. తన చిన్ననాటి జ్ఞాపకాలను ‘పల్లెటూరి జ్ఞాపకాలు’గా పదాల్లో నింపినప్పుడు ఆమె హృదయం కవిత్వంగా పలికింది.
చిన్నవయసులోనే బాధ్యతలు…
బాధ్యతల బాటలో బలమైన అడుగులు, చిన్న వయసులోనే వివాహం. జీవితం ఒక్కసారిగా బాల్యాన్ని వెనక్కి నెట్టేసి బాధ్యతల వైపు నడిపింది. బావి నీళ్ళ బరువు కేవలం భుజాలపై కాదు జీవితంపై పడింది. బిందెలు మోసిన చేతులు, కట్టెల పొయ్యిపై వండిన వేళ్లు కష్టాల్ని కరిగించి బలంగా మారాయి. తర్వాత కలం పట్టి సమాజాన్ని మేల్కొలిపాయి. ఎదుర్కొన్న ప్రతి కష్టం ఆమెను కుంగదీయలేదు సరికదా మరింత గట్టిగా చేశాయి. ఆ కష్టాల్లో ఆమె చిరునవ్వు చచ్చిపోలేదు… అదే ఆమె అంతర్ముఖ బలానికి నిదర్శనంగా మారింది. మొదట ఎంపీడీఓ కార్యాలయంలో టైపిస్ట్‌గా పనిచేసి, తర్వాత ఉపాధ్యాయు రాలిగా సేవలందిస్తూ ఒక తల్లిగా, ఒక వ్యక్తిగా తన పాత్రలను సమర్థంగా నెరవేర్చింది.
ప్రజల మధ్య పుట్టిన నాయకత్వం
స్వార్థం లేని సేవాభావం.. అదే ఆమెకు అసలైన గుర్తింపు. తనకు వచ్చే స్వల్ప వేతనంలోనూ అవసరమైన వారికి చేయూతనిచ్చిన ఆమె మనసు రాజకీయాలకు మార్గం చూపింది. అందరిలో కలసి పోతూ, అందరి కష్టాల్లో పాలుపంచుకునే తత్వాన్ని గ్రహించిన ఆమె జీవిత భాగస్వామి మంజులను రాజకీయాల్లో ఉంటే మరింత మందికి సేవ చేసే అవకాశం దక్కుతుందని సలహా ఇచ్చారు. అలా భర్త ప్రోత్సాహంతో ఎంపీటీసీగా పోటీ చేసి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ ఆమెలోని సంకల్పం మాత్రం ఓడిపోలేదు. తర్వాత కాలంలో మండల అధ్యక్షురాలిగా, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, ప్రజల సమస్యలను తనవిగా భావించింది. రైతుల కష్టాలపై స్పందిస్తూ, రైతు సమస్యలపై గళమెత్తుతూ మార్కెట్ వ్యవసాయ కమిటీలో సేవలు అందించారు. రైతులకు గోనె సంచులు అందుబాటులో ఉంచుతూ లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంది.
హృదయం పలికిన కవిత్వం
జీవితాన్ని దగ్గరగా చూసిన కళ్లకు… బాధను అనుభవించిన హృదయానికి… కవిత్వం ఒక సహజ స్పందన. మంజుల కలం కేవలం అక్షరాలు కాదు, అనుభవాల ప్రవాహం. ఆమె జీవితానుభవాలే ఆమె కలానికి సిరా అయ్యాయి. అలా మూడు వందలకుపైగా కవితలు రాసింది. రైతుల కష్టం, మహిళల వేదన, బాల్యపు జ్ఞాపకాలు, ప్రకృతి పరిరక్షణ… ఇలా ప్రతి అంశం ఆమె కవితల్లో జీవిస్తుంది. రైతుల కష్టాలు, మహిళల అగచాట్లు, బాలకార్మిక వ్యవస్థ, పండుగలకు ప్రకృతికి గల సంబంధాలు, ఓటు విలువ, కళాకారుల కష్టాలు, స్త్రీ హృదయం, సాంఘిక అంశాలపై ఎన్నో కవితలు రాశారు. అమ్మ హృదయం, చివరి దుప్పటి వంటి రచనలు ఆమె అంతరంగ గాథలకు ప్రతిబింబాలు. పత్రికలు, ఆన్లైన్ వేదికల ద్వారా ఆమె కవిత్వం పాఠకుల హృదయాలను తాకుతోంది.
మనసులను మేల్కొలుపుతుంది
మట్టిలో మొలిచిన మానవత్వం పద్యంగా వికసించింది. మట్టిలో పుట్టి… కష్టాల్లో కరిగి… సేవలో వెలిగిన ఒక జీవితం మంజుల పత్తిపాటి. ఆమె కలం కేవలం రాయదు.. మనసులను మేల్కొలుపుతుంది. ప్రజల బాధను పలుకుతుంది. ప్రకృతిని కాపాడమని పిలుస్తుంది. మట్టివాసనతో ప్రయాణిస్తున్న ఆ మానవత్వం…ఈరోజు కవిత్వంగా వికసించి, సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇలా మరెంతో సేవ చేయాలని, మరెన్నో రచనలు రాయాలని మనసారా కోరుకుంటూ…
రైతులకు సేవ చేస్తూ
కరోన సమయంలో నిత్యావసర సరుకులు అందించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంది. ఆమె తాను చేపట్టిన పదవులను కేవలం అధికారం కోసం కాకుండా బాధ్యతగా భావించింది. సామాజిక సేవ చేస్తూ వారి కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత వాటికి అక్షర రూపం ఇవ్వాలని భావించింది. అలా సాహిత్య రచనల పట్ల ఆసక్తి కనపరిచింది. అందుకు ఇంకో కారణం ఆమె పడిన కష్టాలు కూడా. తన రాజకీయ ప్రయాణంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రామగ్రామానికి తిరిగేది. ప్రజల్లోకి వెళ్లి ప్రత్యక్షంగా కలుసుకుని ఆయా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసేది.
– అచ్యుతుని రాజ్యశ్రీ



