మాలల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరికే శ్రీనివాస్..
నవతెలంగాణ – రాయపోల్
రాష్ట్రంలో మాలల జనాభాను కావాలనే తక్కువగా చూపిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని మాలల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరికే శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీల వర్గీకరణ ద్వారా మాలలకు విద్యా, ఉపాధి అవకాశాలలో తీవ్ర అన్యాయం జరిగిందని, తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన సర్వేలో కూడా మాలల పట్ల వివక్షత స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
2011 జనాభా లెక్కలలో 17 లక్షలకు పైగా ఉన్న మాలల సంఖ్య, తాజా సర్వేలో 14 లక్షలకు పడిపోవడం వెనుక ప్రభుత్వం ఉద్దేశపూర్వక వైఖరి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.మాల ఉపకులాలను విడదీసి లెక్కించడం ద్వారా అసలు జనాభాను తగ్గించి చూపించే ప్రయత్నం చేశారని, నేతకాని, మాలసాలే, మాల బైండ్ల వంటి కులాలను వేరు చేసి ఇతర గ్రూపుల్లో చేర్చడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ సర్వే శాస్త్రీయంగా జరగలేదని, వెంటనే రీసర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో మాలల జనాభా నాల్గవ స్థానంలో ఉండాల్సి ఉండగా, తాజా గణనలో ఏడవ స్థానానికి పడిపోయిందని, ఇది సరైన గణాంకం కాదని అన్నారు. రెడ్డి, గౌడ్ కులాల కంటే మాలల సంఖ్య తక్కువగా చూపించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో కొంతమంది మాలలు అభివృద్ధి సాధిస్తే అగ్రవర్ణాలు సహించలేకపోతున్నాయని, ఇంకా మెజార్టీ మాలలు వెనుకబడి, అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మాలలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై స్పందించకపోవడం బాధాకరమని, మాల సమాజానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించలేని వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాల విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు మేల్కొని పోరాడాలని పిలుపునిచ్చారు.మాలల జనాభా గణాంకాలను సరిదిద్దకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని కరికే శ్రీనివాస్ హెచ్చరించారు.



