Sunday, April 19, 2026
E-PAPER
Homeజిల్లాలుమృత్యువు అంచున ప్రాణాలు కాపాడిన ఖాకీ హీరోలు

మృత్యువు అంచున ప్రాణాలు కాపాడిన ఖాకీ హీరోలు

- Advertisement -

– పోలీసుల సాహసానికి ఎస్పీ ప్రశంసలు
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రదర్శించిన అప్రమత్తత, సాహసం, మానవతా దృక్పథాన్ని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ప్రశంసించారు. వివిధ ఘటనల్లో ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడుతూ, నేరాలను అడ్డుకుంటూ పోలీస్ సిబ్బంది చూపిన సేవలను గుర్తించి జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న సంఘటనల్లో పోలీసులు సమయానికి స్పందించి బాధితులను రక్షించారు. బాన్సువాడలో ఆస్తి తగాదాలతో ఉరివేసుకున్న వ్యక్తిని బ్లూ కోల్ట్స్ సిబ్బంది డి. నవీన్, హోంగార్డ్ రాములు తలుపులు పగలగొట్టి రక్షించారు. రాజంపేట మండలం బసవన్నపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కానిస్టేబుల్ జె. శ్రీనివాస్, హోంగార్డ్ రాజిరెడ్డి సాహసంగా కాపాడారు.

సదాశివనగర్ మండలం టెక్రియాల్ చెరువు వద్ద అర్ధరాత్రి సమయంలో ప్రమాదంలో ఉన్న వ్యక్తిని బ్లూ కోల్ట్స్ సిబ్బంది వినయ్ రెడ్డి, మురళి, శ్రీనివాస్ చాకచక్యంగా స్పందించి రక్షించారు. బాధితుడితో సున్నితంగా మాట్లాడి అతడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇక రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రేషన్ బియ్యం రవాణాపై మెరుపు దాడి నిర్వహించి సుమారు 8 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి పట్టణంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పట్టుకుని నేరాలను అడ్డుకున్నారు. వారి నిబద్ధతను గుర్తించిన ఎస్పీ నగదు బహుమతి అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మానవ ప్రాణం అత్యంత విలువైనదని, క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు కుటుంబాలకు విషాదాన్ని మిగులుస్తాయని పేర్కొన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు పోలీసుల సహాయం తీసుకోవాలని, ‘డయల్ 100’ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన సిబ్బంది నిజమైన ‘ఖాకీ హీరోలు’ అని కొనియాడిన ఎస్పీ, నేర నియంత్రణతో పాటు ప్రాణరక్షణలో చూపిన మానవతా దృక్పథమే పోలీస్ శాఖకు గౌరవాన్ని పెంచుతుందని తెలిపారు. ప్రజల భద్రత కోసం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పోలీస్ సిబ్బందికి పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -