– వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించాలి
– డీఆర్డీఏ అదనపు సంచాలకులు ఎన్.రవి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకం నిధులతో రైతులకు ఫామ్ పాండ్లను నిర్మిస్తున్నదని డీఆర్డీఏ అదనపు సంచాలకులు ఎన్.రవి అన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడంతో పాటు భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఫామ్ పాండ్లు దోహదపడతాయని తెలిపారు.
గురువారం అశ్వారావుపేట మండలంలో ఆయన పర్యటించారు. కావడిగుండ్ల, కన్నాయిగూడెం పంచాయతీల్లో నిర్మిస్తున్న పంట కుంటలను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని పథకం సహాయ ప్రాజెక్టు అధికారి రామచంద్రరావు ను ఆదేశించారు.
అనంతరం ఆయన నవతెలంగాణ తో మాట్లాడుతూ అశ్వారావుపేట మండలానికి ఫామ్ పాండ్ల నిర్మాణానికి 112 లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు వ్యక్తిగత కేటగిరీలో 116 పాండ్లు మంజూరు కాగా 22 పనులు కొనసాగుతున్నాయి అని తెలిపారు.కమ్యూనిటీ కేటగిరీలో ఒకటి మంజూరై, ఒకటి నిర్మాణంలో ఉంది. మంజూరైన లక్ష్యంతో పోలిస్తే మండలంలో – 5 బ్యాలెన్స్ నమోదైంది.మండలంలో మొత్తం 27 గ్రామపంచాయతీ లు ఉన్నాయి.
జిల్లాలోని 471 గ్రామపంచాయతీ ల పరిధిలో 1,950 ఫామ్ పాండ్ల లక్ష్యానికి గాను 1,018 వ్యక్తిగత పాండ్లు, 180 కమ్యూనిటీ పాండ్లు మంజూరయ్యాయి. వీటిలో వ్యక్తిగత విభాగంలో 210, కమ్యూనిటీ విభాగంలో 46 పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 752 పాండ్లు బ్యాలెన్స్ లో ఉన్నాయి అని విలేకరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు బాడిస లక్ష్మణ్ రావు,మడకం నాగేశ్వరరావు, కార్యదర్శులు శోభన్ బాబు, శ్రీకాంత్,టీఏ బాలక్రిష్ణ,ఎఫ్ఏ లు నాగేశ్వరరావు, రాంబాబు లు పాల్గొన్నారు.



