నవతెలంగాణ-ఆలేరు టౌన్
పారంపర్య వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఆలేరు పట్టణానికి చెందిన డాక్టర్ చింతకింది మురహరికి, వైద్య పండిత అవార్డు లభించింది. భద్రాచలంలో నిర్వహించిన పారంపర్య వైద్య మహాసంఘం తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. మహాసభలో యోగ గురువు శ్రీశ్రీ శివస్వామి, పారంపర్య వైద్య మహాసభ అధ్యక్షుడు దొంత యాత్రి మహర్షి తదితరుల చేతుల మీదుగా డాక్టర్ చింతకింది మురహరి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ చింతకింది మురహరి మాట్లాడుతూ.. పారంపర్య వైద్య విధానాలకు గుర్తింపు తీసుకురావడంతో పాటు, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పూర్వీకుల నుంచి అందిన వైద్య విజ్ఞానాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పరిరక్షిస్తూ ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేయాలన్నారు. తన సేవలను గుర్తించి వైద్య పండిత అవార్డుతో సత్కరించిన పారంపర్య వైద్య మహాసంఘం రాష్ట్ర నాయకత్వానికి, యోగ గురువు శ్రీశ్రీ శివస్వామి, దొంత యాత్రి మహర్షి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పారంపర్య వైద్యాన్ని ప్రోత్సహించేందుకు వైద్యులు, పరిశోధకులు, వైద్య నిపుణులు, యువత సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పారంపర్య వైద్య రంగానికి చెందిన పలువురు ప్రతినిధులు, వైద్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.



