– జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. ముక్తిదా
నవతెలంగాణ – కామారెడ్డి
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ఈ నెల 12న శనివారం 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, ప్రిన్సిపల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. ముక్తిదా తెలిపారు. రాష్ట్రంలోని అన్ని న్యాయస్థాన సముదాయాల్లో లోక్ అదాలత్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో మొత్తం ఆరు లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కామారెడ్డి ప్రధాన కేంద్రంలో నాలుగు, ఎల్లారెడ్డిలో ఒకటి, బిచ్కుందలో ఒక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. పెండింగ్‌లో ఉన్న రాజీకి అనుకూలమైన క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకు రికవరీ, మోటారు వాహన ప్రమాద పరిహారం, కుటుంబ, వైవాహిక, కార్మిక, విద్యుత్, నీటి బిల్లులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కోర్టులో కేసు దాఖలు చేయకముందు పరిష్కరించగల ప్రీ-లిటిగేషన్ వివాదాలను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడంతో కక్షిదారులకు సమయం, ధనం, శ్రమ ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో వివాదాలు పరిష్కారం కావడంతో భవిష్యత్తులో విభేదాలకు అవకాశం తగ్గుతుందన్నారు.
లోక్ అదాలత్‌లో రాజీ కుదిరిన అనంతరం సంబంధిత బెంచ్ అవార్డు జారీ చేస్తుందని, ఆ అవార్డు తుది, ఇరుపక్షాలపై చట్టబద్ధంగా అమలవుతుందని తెలిపారు. లోక్ అదాలత్ ప్రజలకు సులభంగా, వేగంగా, సఖ్యతతో న్యాయం అందించే గొప్ప వేదిక అని పి. ముక్తిదా పేర్కొన్నారు. కక్షిదారులు సంవత్సరాల తరబడి కేసులను కొనసాగించకుండా సెప్టెంబర్ 12న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న వారు తమ న్యాయవాదులు, పోలీసు అధికారులను సంప్రదించి కేసులను రాజీకి తీసుకురావడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి కార్యాలయం లేదా సంబంధిత న్యాయస్థానాలను సంప్రదించాలని సూచించారు.



