నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఐలమ్మ విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. సీపీఐఎం పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి, డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… నాటి రజాకార్లు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని కొనియాడారు. రైతాంగాన్ని సమీకరించి, తమ భూములను తామే సాగు చేసుకునే హక్కు కోసం ఆమె సాగించిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి గొప్ప స్ఫూర్తినిచ్చిందన్నారు. నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల ఆగడాలు పరాకాష్టకు చేరడంతోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉద్భవించిందని గుర్తుచేశారు.
చాకలి ఐలమ్మ వంటి వీరవనితల పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. ప్రజలందరూ సాయుధ పోరాట చరిత్రను, అమరవీరుల త్యాగాలను అధ్యయనం చేయాలని సూచించారు. అమరుల త్యాగాలను వృథా కానివ్వకుండా, వారి ఆశయ సాధన కోసం సీపీఐ(ఎం) నిరంతరం ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు రావుల రాజబాబు, మోరంపూడి వెంకటేశ్వరరావు, మీరాజ్, రామకృష్ణ, జిలానీ, మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, మహిళా సంఘం నాయకులు శీలం కరుణ, తన్నీరు కృష్ణవేణి, నాగమణి, రాణీ రుద్రమదేవి, భూలక్ష్మి, తిరుమల, సరోజిని, హేమలత, కృష్ణవేణి, భాస్కర్, చెరుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



