– డిపో నుంచి కదలని 54 బస్సులు
– రీజనల్ మేనేజర్ విజ్ఞప్తి మేరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రోడ్డుపైకి వచ్చిన బస్సులు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో గురువారం ఉదయం ప్రయివేట్ బస్సు డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. డిపో మేనేజర్ గురిజాల సత్యనారాయణ బస్ స్టాపులు విషయంలో తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని డ్రైవర్లు ఆరోపించారు. అగ్రిమెంట్ మేరకు ఆగాల్సిన స్టాపులు కన్నా అదనపు స్టాపులు విషయమై డీఎం సత్యనారాయణకు ప్రయివేట్ డ్రైవర్ల మధ్య గత కొంతకాలంగా వాదోపవాదాలు జరుగుతూ వస్తున్నాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న చిన్న చిన్న ఫిర్యాదులకే ఎలాంటి కారణం లేకుండా డ్యూటీలు తీసేస్తున్నారని ప్రయివేట్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డిపో మేనేజర్ వైఖరికి నిరసనగా ఏకంగా 54 సర్వీసులను నిలిపివేసి డిపోలోనే డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. తెల్లవారుజాము నుంచే బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వినాయక చవితి పండగ సమీపిస్తున్న వేళ ఈ ఆందోళన జరగడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి బస్సులు కదలకపోవడంతో డ్రైవర్లు, కండక్టర్లు సైతం డిపో కాంప్లెక్స్‌లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమ్మె కారణంగా ఆర్టీసీ ఆదాయానికి కూడా భారీగా గండి పడింది. బస్సులు నడుస్తాయా లేదా అనే మీమాంస నడుమ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల మధ్య గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సమస్యను వెంటనే తేల్చాలని ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగారు. డిపో మేనేజర్ సత్యనారాయణ ప్రయివేట్ డ్రైవర్లతో చర్చలు ప్రారంభించారు. ఆర్టీసీ ఖమ్మం రీజనల్ మేనేజర్ సరిరాం నాయక్ విజ్ఞప్తి మేరకు డ్రైవర్లు శాంతించారు. సమ్మె విరమించిన ప్రయివేట్ డ్రైవర్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి తమ బస్సులను తమ బస్సులను రోడ్డెక్కించారు.



