– దెబ్బతిన్న అమెరికా రక్షణ కవచం తుస్సుమన్న థాడ్ వ్యవస్థలు
– ఇరాన్ దాడులను అడ్డుకోవడంలో వైఫల్యం
– వాటి కోసం అగ్రరాజ్యానికి 142 బిలియన్ డాలర్లు ముట్టచెప్పిన మధ్యప్రాచ్యÛ దేశాలు
నవ తెలంగాణ – సెంట్రల్ డెస్క్
ఇరాన్ ఆయుధ శక్తిని ఎదుర్కోవడానికి అమెరికా ప్రభుత్వం క్షిపణి రక్షణ వ్యవస్థలను రూపొందిం చింది. వీటి కోసం గల్ఫ్ దేశాలు బిలియన్ల కొద్దీ నిధులను… ఏకంగా 142 బిలియన్ డాలర్లను కుమ్మరించాయి. కానీ జరిగిం దేమిటి? ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినప్పుడు వాటి పరిమాణం, వ్యయ అసమానతలు అంచనాలను తలకిందులు చేశాయి. మధ్యప్రాచ్యంలోని గల్ఫ్ దేశాలకు మిగిలింది కాలిపోయిన థాడ్ వ్యవస్థలు, ఖరీదైన గుణపాఠం మాత్రమే. గల్ఫ్ దేశాలకు అమెరికా ఇస్తానని చెప్పిన భద్రతా వ్యవస్థలలో ప్రధానమైనది లాక్‌హీడ్ మార్టిన్‌కు చెందిన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్). దీనితో పాటు పేట్రియాట్ పీఏసీ-3 బ్యాటరీలు కూడా ఉన్నాయి. అమెరికాలో ప్రభుత్వ ప్రాధాన్యతలను నిర్దేశించేది రక్షణ సంస్థలే కాబట్టి ఈ వ్యవస్థలు అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్న వంటూ ఊదర కొట్టారు. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ఈ వ్యవస్థలు సమర్ధ వంతంగా తిప్పికొడతాయని నమ్మించారు. ట్యాంకర్లతో యుద్ధం చేసే కాలం నాటి నుంచి క్షిపణుల నుంచి పొంచి ఉన్న ముప్పును ఈ వ్యవస్థలు తొలగిస్తాయని నమ్మిన గల్ఫ్ దేశాలు అనేక సంవత్సరాలుగా వాటిపై అనేక బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నాయి.
టెహ్రాన్ దాడులతో కకావికలం
జోర్డార్, సౌదీ అరేబియా, యూఏఈలలోని థాడ్ రాడార్లపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు నేరుగా దాడి చేయగలిగాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం తగలబడిపోయింది. జోర్డాన్‌లోని మువాఫక్ వైమానిక స్థావరంలో ఉన్న రాడార్ ప్రదేశంలో శకలాలు మాత్రమే మిగిలాయి. యుఏఈలోని అల్ రువాయిస్ సమీపంలో ఉన్న థాడ్ బ్యాటరీపై పలు దఫాలుగా దాడి జరిగింది. ఇరాన్ వైపు నుంచి వచ్చిన పలు ఆయుధాలను అడ్డుకోవడంలో పాట్రియట్ వ్యవస్థలు ఆపసోపాలు పడ్డాయి. వీటిలో కొన్నింటిని మాత్రమే ఆ వ్యవస్థలు అడ్డుకోగలిగాయి. పైగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు అత్యంత చౌకైనవి. వీటిని తిప్పికొట్టడానికి అమెరికా వ్యవస్థలపై భారీగా ఖర్చు చేశారు. హౌతీల దాడులను పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నామని గతంలో ప్రకటనలు చేసిన యూఏఈ, ఇప్పుడు పెదవి విప్పడం లేదు. ఇరాన్ నెల రోజులకు వందకు పైగా క్షిపణులను తయారు చేస్తోందని, వాటిని అడ్డుకునేందుకు తాము నెలకు ఆరేడు వ్యవస్థలను మాత్రమే నిర్మించగలుగు తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా గమనార్హం.
థాడ్ వ్యవస్థలు నిర్వీర్యమైన నేపథ్యంలో వాటికి సంబంధించిన బ్యాటరీ లను దక్షిణ కొరియా నుంచి మధ్య ప్రాచ్యానికి తరలించేందుకు అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ చర్యను అడ్డుకోలేక పోయారు. ఇప్పుడు గల్ఫ్ దేశాలకు… ముఖ్యంగా సౌదీ అరేబియాకు వాస్తవమేమిటో అర్థమవుతోంది.
గల్ఫ్‌లోని అమెరికా ఆస్తులే లక్ష్యం
ఇరాన్, సౌదీ అరేబియా 2023 మార్చిలో దౌత్య సంబంధాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించుకున్నాయి. చైనా మధ్యవర్తిత్వంతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్‌పై దాడులకు అమెరికా సిద్ధం కావడంతో గల్ఫ్ దేశాలు మరోసారి దౌత్య యత్నాలు చేశాయి. ఇరాన్‌పై దాడులకు అమెరికా తన స్థావరాలను ఉపయోగించుకునేందుకు సౌదీ అరేబియా నిరాకరించింది. ఇరాన్ ప్రతీకార దాడులపై అనేక గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి కూడా. అయితే అమెరికా-ఇజ్రాయిల్ చర్యలతో గల్ఫ్ దేశాలకు మరో మార్గం లేకపోయింది. అమెరికా అందించిన హార్డ్‌వేర్ వ్యవస్థలు పనిచేస్తాయా లేదా అని తెలుసుకునేందుకు అవి ప్రయత్నించాయి. గల్ఫ్ దేశాలలోని అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ 400 బాలిస్టిక్ క్షిపణులను, సుమారు వెయ్యి డ్రోన్లను ప్రయోగించింది. బహ్రైన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, యూఏఈలలోని పట్టణ ప్రాంతాలు, ఇంధన స్థావరాలు, విమానాశ్రయాలు, పౌర మౌలిక సదుపాయాలపై టెహ్రాన్ దాడులు జరిపింది.
సౌదీతో భారీ ఒప్పందం
గత సంవత్సరం మేలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియాద్‌లో పర్యటించినప్పుడు తన దేశ చరిత్రలోనే అతి పెద్దదైన సైనిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అది సౌదీ అరేబియా కోసం ఉద్దేశించిన 142 బిలియన్ డాలర్ల ఆయుధ ప్యాకేజీ. ఇందులో థాడ్ వ్యవస్థలు, పాట్రియాట్ పీఏసీ-3 ఆధునీకరణలు, క్షిపణులు, గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయో గించే అత్యాధునికమైన ఆయుధాలు, సాయుధ డ్రోన్లు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. ఇరాన్, దాని మిత్రుల నుంచి ముప్పు ఎదురైనప్పుడు దానిని ఎదుర్కో వడానికి సౌదీ సైన్యాన్ని సన్నద్ధం చేయడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం. తొమ్మిది నెలల తర్వాత ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్ దాడి చేసిన సమయంలో ఈ వ్యవస్థలను ఉపయోగించారు. అయితే వీటిని ఇరాన్ సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. ఫలితంగా అమెరికా అందించిన రక్షణ కవచం విఫలమైంది.



