Tuesday, April 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచర్చలపై అనిశ్చితి

చర్చలపై అనిశ్చితి

- Advertisement -

– నో అన్న ఇరాన్‌
– అమెరికా ఆధీనంలో ఇరాన్‌ కార్గో నౌక
– మండిపడ్డ టెహ్రాన్‌
– ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరిక
– ఇరాన్‌లో ఇప్పటివరకు 3375 మంది మృతి
– ఇస్లామాబాద్‌కు అమెరికా ప్రతినిధి బృందొం భగ్గుమన్న చమురు ధరలు
నవతెలంగాణ-సెంట్రల్‌ డెస్క్‌

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. హార్ముజ్‌ జలసంధిని దిగ్బంధించిన అమెరికా నౌకాదళం తమ దేశానికి చెందిన ఓ కార్గో నౌకపై కాల్పులు జరిపి దానిని స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్‌ మండిపడింది. ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది. నౌకలోని సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారని రూఢ చేసుకున్న తర్వాత దాడులకు దిగుతామని తెలిపింది. ఇరాన్‌ నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఆ రెండు దేశాల మధ్య జరగాల్సిన రెండో విడత చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, సీనియర్‌ అధికారులతో కూడిన బృందం చర్చల నిమిత్తం ఇస్లామాబాద్‌ చేరుకుంది. అయితే చర్చలకు హాజరయ్యే ప్రశ్నే లేదని ఇరాన్‌ తేల్చి చెప్పింది. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగుస్తున్న తరుణంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

అమెరికా దురాక్రమణపై స్పందిస్తాం : ఐఆర్‌జీసీ
గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో తన నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్‌ భగ్గుమంది. అమెరికా దళాలపై ‘అవసరమైన చర్యలు’ తీసుకుంటామని హెచ్చరించింది. అమెరికా దళాల దురాక్రమణపై నిర్ణయాత్మ కంగా స్పందించేం దుకు ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) సిద్ధంగా ఉన్నదని తస్నిమ్‌ వార్తా సంస్థ తెలియజేసింది. నౌకలో సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉండడంతో ఇరాన్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. వారు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత ఉగ్రవాద అమెరికా సైన్యంపై ఐఆర్‌జీసీ అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆ వార్తా సంస్థ తెలిపింది. ఇలాంటి పరిస్థితులలో రెండో విడత చర్చలకు అవకాశమే లేదని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘై స్పష్టం చేశారు. ఇరాన్‌ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో గడువులు, అల్టిమేటంలు విధించడంపై తమకు నమ్మకం లేదని ఆయన చెప్పారు. మరోవైపు…చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్నప్పటికీ పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

నీవే…కాదు నీవే
కాల్పుల విరమణ ఒప్పందం గడువు రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో దాని ఉల్లంఘనలపై ఇరాన్‌, అమెరికా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ‘హార్ముజ్‌పై బుల్లెట్‌ దాడి చేయాలని ఇరాన్‌ నిర్ణయించుకుంది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తోంది. మేము న్యాయబద్ధమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ప్రతిపాదించాం. వారు దానిని అంగీకరిస్తారనే నమ్మకం ఉంది. అలా జరగని పక్షంలో ఇరాన్‌లో ప్రతి విద్యుత్‌ ప్లాంటును, ప్రతి బ్రిడ్జిని పేల్చివేస్తాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టెహ్రాన్‌పై ఆరోపణలు చేశారు. ట్రంప్‌ ప్రకటనలో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి…కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘించింది. రెండోది…పెద్ద ఎత్తున సైనిక చర్యకు అమెరికా సిద్ధంగా ఉంది. కాగా ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ దీటుగా స్పందించింది. ఇరాన్‌ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘై ఓ ప్రకటన చేస్తూ ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధమే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు ఉదాహరణ అని తెలిపారు. అమెరికా చర్య చట్టవిరుద్ధమని, అది ఐరాస ఛార్టర్‌కు వ్యతిరేకంగా ఉన్నదని విమర్శించారు.

క్షేత్ర స్థాయిలో పరిస్థితి చేయి దాటిపోతున్న తరుణంలో ఈ సందేశాలు వెలువడ్డాయి. హార్ముజ్‌లో నౌకలను అమెరికా దిగ్బంధించినందునే జలసంధిని మూసేశానని ఇరాన్‌ తెలిపింది. అమెరికా, ఇరాన్‌ మధ్య ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు జరిగిన సుదీర్ఘ సంప్రదింపులలో కేవలం పరిమిత అవగాహన మాత్రమే సాధ్యపడింది. ఇరాన్‌ అనేక రాయితీలు కోరడం, అమెరికా పలు డిమాండ్లను ముందుకు తేవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇరాన్‌పై మరింత ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా హార్ముజ్‌ దిగ్బంధనం ఎత్తుగడ పన్నింది. అయితే అది ఫలించకపోగా ప్రతికూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓడరేవుల దిగ్బంధం కొనసాగినంత కాలం పాకిస్తాన్‌కు ప్రతినిధి బృందాన్ని పంపేదే లేదని ఇరాన్‌ తేల్చి చెప్పింది. ‘హార్ముజ్‌ను తెరిస్తే..ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధం కొనసాగితే మేము తప్ప అన్ని దేశాలు వ్యాపారం చేసుకుంటాయి’ అని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘర్‌ ఘలీబఫ్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ప్రకటనపై మండిపడిన ఇరాన్‌ చర్చల బృందం సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు మహమ్మద్‌ మరాండీ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంటుంది. యూఏఈ, బV్‌ారైన్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, కువైట్‌లను వెంటనే విడిచిపొండి. ఇరాన్‌ ప్రతీకార చర్యలకు దిగి అన్నింటినీ ధ్వంసం చేస్తుంది’ అని తెలిపారు.

ఇరాన్‌ నౌకపై అనేక రౌండ్ల కాల్పులు… స్వాధీనం
గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధం ఆదేశాలను ఇరాన్‌ నౌక ఉల్లంఘించిందని, అందుకే తమ దళాలు దానిపై కాల్పులు జరిపి ఇంజిన్‌ గదికి నష్టం కలిగించాయని, ఆ తర్వాత మెరైన్లు నౌకను స్వాధీనం చేసుకున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకొచ్చారు. హార్ముజ్‌ జలసంధి సమీపంలో ఈ ఘటన జరిగింది. కాగా ఇరాన్‌ పతాకంతో గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ను దాటేందుకు ప్రయత్నించిన నౌకకు చెందిన ఇంజిన్‌ గదిపై అనేక రౌండ్లు కాల్పులు జరిపామని అమెరికా సైన్యం తెలిపింది.

భగ్గుమంటున్న చమురు ధరలు
హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తిరిగి మూసివేయడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ అయిన బ్రెంట్‌ క్రూడ్‌ ఏడు శాతం పెరిగి 96.88 డాలర్లకు చేరింది. ఇరాన్‌ కార్గో నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్న తర్వాత శాంతి ఒప్పందానికి తలుపులు దాదాపుగా మూసుకుపోయిన నేపథ్యంలో సోమవారం చమురు ధరలు మరింతగా పెరిగాయి. శుక్రవారం నుంచి చమురు ధరలు పెరుగుతూనే ఉండడం గమనార్హం. హార్ముజ్‌ను తెరుస్తున్నామంటూ ఇరాన్‌ చేసిన ప్రకటనతో దిగివచ్చిన చమురు ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.

హార్ముజ్‌పై నియంత్రణను వదులుకోం : ఇరాన్‌
హార్ముజ్‌ జలసంధిపై నియంత్రణను వదులుకునే ప్రశ్నే లేదని ఇరాన్‌ తేల్చి చెప్పింది. అది తమ నుంచి విడదీయరాని హక్కు అని ఐఆర్‌జీసీ మాజీ కమాండర్‌ ఇబ్రహీం అజిజి చెప్పారు. హార్ముజ్‌లో నౌకల ప్రయాణంపై ఇరాన్‌ నిర్ణయం తీసుకుంటుం దని, వాటి రవాణాకు అనుమతులు కూడా ఇస్తుందని తెలిపారు. ఈ అంశాన్ని చట్టంలో పొందుపరుస్తామని పార్లమెంట్‌ సభ్యుడు కూడా అయిన అజిజి అన్నారు. జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీకి కూడా ఆయన నేతృత్వం వహిస్తున్నారు. అమెరికాతో జరుగుతున్న యుద్ధం ఇరాన్‌కు అత్యంత వ్యూహాత్మక జలసంధిని ఓ కొత్త ఆయుధంగా అందించిందని ఆయన చెప్పారు. శత్రువును ఎదుర్కోవడానికి అది ఓ ఆస్తిగా మారిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -