నిషేధిత జాబితాలోకి భూముల సర్వేనెంబర్లు
భూ సేకరణ కోసం తతంగం నడిపిస్తున్న సర్కారు
ఇండిస్టియల్ కారిడార్ పేరుతో భూములు గుంజుకుంటున్న వైనం
ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న భూమిని కోల్పోతున్న ప్రజలు
రైతుల దీనగాథలపై నవతెలంగాణ ప్రత్యేక కథనం
భూమి అంటే ప్రభుత్వ రికార్డుల్లో ఎకరాల లెక్కలు కాదు. ఓ కుటుంబం తరాల తరబడి ఆస్తి. బతుకుదెరువుకి, పొట్టకూటికి ఆ భూమే ఆధారం. పచ్చని భూమిలో తన చెమట చుక్కలతో బంగారు పంటలు తీసి రైతు సంబురపడతాడు. ఇదంతా ఒకెెత్తు అయితే, అభివృద్ధి, పరిశ్రమల పేరుతో పచ్చని పొలాలను ‘కంపెనీ భూతం’ కబళిస్తే.. ఆ భూమి వెనుక దాగి ఉన్న ఓ కుటుంబం నిశ్శబ్దంగా ముక్కలవుతుంది. ఇప్పుడు ఇండ్రస్టియల్ కారిడార్ కోసం భూములు కోల్పోతున్న రైతులది కూడా ఇదే పరిస్థితి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కండ్లాపూర్, రాపోల్ భూ బాధిత రైతుల కన్నీటి గాథలపై ప్రత్యేక కథనం.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
అభివృద్ధి పేరుతో ప్రభుత్వం నిర్వహించే భూ సేకరణ అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని భూముల్లోనే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలోనూ ఎక్కువ భూ సేకరణ ఈ జిల్లాలోనే జరిగింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి రంగారెడ్డి జిల్లానే టార్గెట్‌గా నిలిచింది. అభివృద్ధి పేరుతో ఇక్కడి భూముల్ని కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతోం ది. భారత్ ఫ్యూచర్ సిటీ, ఇండిస్టియల్ కారిడార్స్, గ్రీన్ ఫీల్డ్ రోడ్ పేరుతో వేలాది ఎకరాల భూ సేకరణ జరుగుతోంది. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కండ్లాపూర్ రాపోలు గ్రామాల్లో 1,197 ఎకరాల భూమిని ఇండిస్టియల్ కారిడార్ కోసం సేకరించేందుకు ప్రభుత్వం ఫారమ్ (సీ ) నోటీసును పబ్లిష్ చేసింది.కండ్లాపూర్ రెవెన్యూ పరిధిలో 587 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 159 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూములపై ఆధారపడి 350 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. రాపోలు గ్రామంలో 509 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, 101 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూములపై 300 కుటుంబాలు ఆధారపడ్డాయి. ఇందులో అరెకరం నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులే ఉన్నాయి. ఈ రెండు గ్రామాల్లో సుమారు వెయ్యి కుటుంబాలు, 4 వేల మంది జీవనం సాగిస్తున్నారు.
విలువైన పంటలు సాగు..
ఈ భూముల్లో గజం జాగా ఖాళీగా ఉండదు. సారమంతమైన నేల కావడంతో బంగారం కంటే విలువైన పంటలను రైతులు పండిస్తున్నారు. మక్కలు, పల్లి, కందులు, మినుములు, జొన్నలు, సజ్జలు, పత్తి, వరి పంటలు, పండ్ల తోటలు మామిడి ఎక్కువగా పండిస్తారు. ఏడాదిలో రెండు పంటలు సాగు చేస్తారు. అయితే ఈ భూములును ఇండిస్టియల్ కారిడార్ కోసం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భూ సేకరణపై ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేసింది. రైతులకు నేరుగా నోటీసులు ఇవ్వడం కానీ, గ్రామ సభలు పెట్టి చెప్పడం కానీ చేయలేదు. నేరుగా ఈ భూములను నిషేదిత జాబితాలో పెట్టింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బాధిత రైతుల్ని ‘నవతెలంగాణ’ పలకరించింది. వారి ఆవేదనకు అక్షరరూపం ఇచ్చే ప్రయత్నం చేసింది.
రైతుల దీనస్థితి
కండ్లాపూర్ గ్రామంలో గాండ్ల ఫ్యామిలీకి 36 ఎకరాల భూమి ఉంది. వీరు ప్రస్తుతం 15 కుటుంబాలుగా ఉన్నారు. ఒక్కో కుటుంబానికి ఎకరంన్నర, రెండు ఎకరాలు వస్తోంది. వీరికి వ్యవసాయమే జీవనాధారం. వీరి భూమిని ప్రభుత్వం నిషేదిత జాబితాలో చేర్చింది. వీరిలో రైతు గాండ్ల రవి రెండు ఎకరాల్లో వ్యవసా యం చేస్తున్నారు. ఈయన ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. ఈ రెెండెకరాలు ప్రభుత్వ నోటీసుల్లో ఉందని ఊరిలో పెద్దమనుషుల ద్వారా తెలుసుకున్న రవి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘ 45 ఏండ్ల వయస్సులో నేను కుటుంబాన్ని పట్టుకుని ఊరు విడిచి ఎక్కడకు వెళ్లాలి… ఏ పని చేసి నా పిల్లలను సాకాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల జోలికి రావొద్దని మొత్తుకుంటున్నారు. ‘ఎమ్మెల్యే సారూ.. మీ కాళ్లు మొక్కుతాం మా భూమి జోలికి రాకండి..’ అంటూ బోరున విలపించాడు. రాపోలు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గోపాల్‌ది మరో గాథ. ఉద్యోగ విరమణ తరువాత తన రెండెకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. రిటైర్డ్ సమయంలో వచ్చిన డబ్బులతో పందుల పెంపకం కోసం షెడ్ వేశారు. ఉన్నపళంగా భూమిని ప్రభుత్వం తీసుకుంటుంది అనే వార్తతో ఆ రైతు కండ్లలో కన్నీళ్లు.. గుండెల్లో బాధ తప్ప మరొకటి కనిపించడం లేదు. ‘ దేశ ప్రజల కోసం నా ప్రాణాలను అడ్డుపెట్టాను. కానీ పిల్లల కోసం భూమిని కాపాడలేక పోతున్నాను..’ అంటూ తన ఆవేదనను పంచుకున్నాడు. ఇలా ఏ కుటుంబాన్ని కదలించినా వారి దు:ఖం వర్ణనాతీతం. వీరు తమ భూములు కాపాడుకోవడం కోసం వివిధ రూపాల్లో తమ గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇండిస్టియల్ కారిడార్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, తమ భూములను తమకే ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
అభివృద్ధి పేరుతో రైతుల బతులకు ఆగం చేయొద్దు
మా ఊరికి కంపెనీలు కావాలని మేము అడుగలేదు. మాకు ఉద్యోగాలు ఇవ్వమని కోరలేదు. ఈ ప్రాంత ప్రజలకు వ్యవసాయం తప్ప, మరొక పని రాదు. బంగారం లాంటి పంటలు పండే భూముల్లో కంపెనీలు పెట్టొద్దు. బలవంతంగా ఈ భూములు లాక్కొవాలని చూస్తే ఊరుకునేది లేదు. పంటకు అనువుగాలేని భూముల్లో కంపెనీలు పెట్టుకోవాలి. అలాంటి భూములు నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. అక్కడకు వెళ్లండి.
– పూలేందర్, సర్పంచ్ కాండ్లపూర్
పచ్చని భూముల్లో కంపెనీల కార్చిచ్చు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



