Tuesday, April 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాళేశ్వరంపై సీబీఐ విచారణ ఏమైంది?

కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఏమైంది?

- Advertisement -

కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి సూటిప్రశ్న
సీబీఐ విచారణకు ఆదేశించకపోతే ఆందోళన ప్రారంభిస్తాం
ఆ భయంతోనే ఢిల్లీకి హరీశ్‌రావు పరుగు
బ్యారేజీల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం
ప్రాణహిత-చేవేళ్ల పూర్తిచేస్తాం
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం..అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపినా, కేంద్రప్రభుత్వం స్పందించడంలేదని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రం తక్షణం సీబీఐ విచారణకు ఆదేశించకపోతే కాళేశ్వరం నుంచే ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరించారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మేడిగడ్డ బ్యారేజిని ఆయన సందర్శించారు. అంతకుముందు కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. రూ.198 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మేడిగడ్డ బ్యారేజిను సందర్శించిన నేపథ్యంలో నేషనల్‌ డ్యాం సేఫ్టి ఏజెన్సీ, తదితర కేంద్ర ఏజెన్సీ ప్రతినిధుల సమక్షంలో ప్రాజెక్టులో జరిగిన లోపాలను సాంకేతికంగా విశ్లేషించారు. ఈ సందర్భంగా అంబటిపల్లిలోని ఎల్‌అండ్‌టీ గెస్ట్‌ హౌజ్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిపై ప్రధాన నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌షా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిందని అనేక మార్లు మాట్లాడారని గుర్తుచేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాళేశ్వరం అవినీతిపై మాట్లాడుతూ విచారణ బాధ్యతల్ని సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్‌, హరీశ్‌రావులను జైల్లో పెడతామని ప్రగల్భాలు పలికారని చెప్పారు. ఈ క్రమంలో కాళేశ్వరం అవినీతిపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన 624 పేజీల నివేదికను శాసనసభ పూర్తిస్థాయిలో చర్చించి, సీబీఐ విచారణకు లేఖ రాసిందని తెలిపారు. ఆ లేఖ రాసి 9 నెలలు గడిచినా, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కాళేశ్వరం అవినీతిపై జడ్జిమెంట్‌ రిజర్వు చేసి, ఈ నెల 22వ తేదీన తీర్పు ఇవ్వనుందనీ, దానితో హడావిడిగా హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌ ఢిల్లీకి పరిగెత్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సీబీఐ విచారణ చేపట్టకుంటే ఆందోళనకు దిగుతామని కేంద్రానికి లేఖ పంపిన నేపథ్యంలో, కేంద్రప్రభుత్వం ఎక్కడ విచారణకు ఆదేశిస్తుందోననే భయంతోనే హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లారని వివరించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులను అడ్డుపెట్టుకుని విచారణ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు.

రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా, సీబీఐ విచారణపై స్పందించట్లేదన్నారు. గోదావరి జలాలను తెలంగాణ జిల్లాలకు తీసుకొచ్చి సస్యశామలం చేసేందుకు 1975లో ఆనాటి సీఎం జలగం వెంగళరావు, నాటి మహారాష్ట్ర సీఎం ఎస్‌బీ చౌహన్‌లతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును రూ.35,800 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారని గుర్తుచేశారు. రూ.11,750 కోట్లు ఖర్చు చేశాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనీ, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ ఊరు, పేరు మార్చి అంచనా వ్యయాలను పెంచి తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరం వద్దకు తీసుకొచ్చారని చెప్పారు. దీంతో రూ.35,500 కోట్ల అంచనా వ్యయాన్ని రూ.లక్షా 50వేల కోట్లకు పెంచారని తెలిపారు. ఫలితంగా కేసీఆర్‌ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాన్ని పొందారని ఆరోపించారు. 2016లో ప్రారంభించిన మేడిగడ్డ పనులు 2018లో పూర్తి చేసి ప్రపంచంలోనే అత్యద్భుతమైన బ్యారేజీ అని గవర్నర్‌ నర్సింహన్‌ను తీసుకొచ్చి, అల్లుడు హరీశ్‌రావు పేరును కాళేశ్వరరావుగా నాటీ సీఎం కేసీఆర్‌ గవర్నర్‌తో చెప్పించారని గుర్తుచేశారు. ఆ తర్వాత బ్యారేజీలో లీకేజీలు ఉన్నాయని, ఇంజినీరింగ్‌ అధికారులు ప్రభుత్వానికీ, ఎల్‌అండ్‌టీ సంస్థకు లేఖలు రాసినా, అప్పటి సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్‌ అవినీతి, ఆహంకారాన్ని ప్రకృతి గుర్తించి 2023 అక్టోబర్‌లో బ్యారేజీ కుప్పకూలిపోయి బహిర్గతం చేసిందన్నారు.

బ్యారేజీ నిర్మాణంలోనే డిజైన్‌ లోపాలు ఉన్నాయని, నిర్వాహణలోనూ లోపాలు ఉన్నాయని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆనాటి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికే సమర్పించిందని చెప్పారు. విజిలెన్స్‌ నివేదిక ఇచ్చినా, ఆనాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిర్మాణ సంస్థ తప్పులు, నాటి ప్రభుత్వ దోపిడీ నేపథ్యంలో కేసీఆర్‌, హరీశ్‌రావుతో పాటు 119 మంది అధికారులను పీసీ ఘోష్‌ కమిటీ విచారించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షన్నర కోట్ల రూపాయల అంచనాలతో నిర్మాణ పనులు చేపట్టిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను గుత్తేదారులకు చెల్లించిందన్నారు. ఇంతాచేస్తే లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని అన్నారు. ఈ అవినీతిని వదలబోమనీ, తప్పించుకోవాలని చూస్తున్న దోషులను కచ్చితంగా శిక్షిస్తామని హెచ్చరించారు. నెలరోజుల ముందే మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలను స్వయంగా సందర్శించి జాతీయ ఏజెన్సీల ప్రతినిధుల సమక్షంలో లోపాలను గుర్తించి తదనుగుణంగా బ్యారేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో అతి తెలివి తేటలకు పోయి బీఆర్‌ఎస్‌ నేతలు సమీపంలోనే బహిరంగసభ ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. జీవన్‌రెడ్డి చేరిండు… జీవన్‌టోన్‌ దొరికిందనీ, కండలు పెరుగుతా యని భావించిన బీఆర్‌ఎస్‌ నేతలు ఆకస్మికంగా ఢిల్లీకి ఎందుకు పరుగులు పెట్టారని ప్రశ్నిం చారు. బీజేపీ నేతల కాళ్లు మొక్కి విచారణ నుంచి తప్పించుకోవడానికే హరీశ్‌రావు ఢిల్లీకి పోయారని ఎద్దేవా చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బీఆర్‌ఎస్‌ ఆపిన ప్రాజెక్టును పూర్తిచేసి ప్రాణహిత నుంచి చేవేళ్లకు గోదావరి జలాలను తీసుకొస్తామన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును హరీశ్‌రావు నిక్కరు తొడుక్కోక ముందే కాంగ్రెస్‌ ప్రారంభిం చిందన్నారు. సమావేశంలో నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మైనింగ్‌ శాఖ మంత్రి గడ్డం వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వర క్షేత్ర పునర్నిర్మాణం
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానాన్ని అత్యద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. సోమవారం క్షేత్ర పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ పునరాభివృద్ధి పనులకు, అలాగే రూ.3.70 కోట్లతో నిర్మించనున్న నూతన బస్టాండ్‌ భవనానికి భూమిపూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -