Tuesday, April 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమళ్లీ అధికారం మాదే

మళ్లీ అధికారం మాదే

- Advertisement -

రాగానే హైడ్రా ఎత్తేస్తాం
తెలంగాణ పునర్నిర్మాణానికి మరో యజ్ఞం
రెండేండ్లలో అన్ని రంగాల్లో అధ్వానం
బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌రెడ్డి
పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం
జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ నుంచే యుద్ధం : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్‌


తెలంగాణ పునర్నిర్మాణానికి మరో యజ్ఞం అవసరమని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే అన్ని రంగాలు అధ్వాన్న స్థితిలోకి వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే తొలివేటు హైడ్రాపైనే అని స్పష్టం చేశారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ నుంచే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై యుద్ధం మొదలుపెడుతున్నట్టు ఆయన ప్రకటించారు. సోమవారం జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి టి.జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు కేసీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాజకీయ ప్రత్యర్థులుగా తాము దశాబ్దాలుగా ఉన్నా తమ మధ్య స్నేహం కొనసాగుతూనే ఉందని కేసీఆర్‌ తెలిపారు.

కాంగ్రెస్‌, టిడీపీ తియ్యటి, పుల్లటి మాటలు
గతంలో తెలంగాణ పదంపై అసెంబ్లీలో సైతం నిషేధం విధించిన సమయంలో, ఇక్కడి ప్రజల పట్ల, మాట్లాడే భాష, బతుకు, నీళ్లు, ఉద్యోగాలు వనరుల మీద వివక్ష ఉండేదని కేసీఆర్‌ గుర్తుచేశారు. ఎస్సారెస్పీ కాలువ ఉన్న ప్రాంతం మొదలు మహబూబ్‌ నగర్‌ వరకు యువత ఉపాధి కోసం వలసలకు వెళితే పల్లెల్లో వృద్ధులే మిగిలిన పరిస్థితి ఆనాడు ఉండేదన్నారు. చేసిందేమి లేకున్నా నాడు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు తియ్యటి, పుల్లటి మాటలు చెబుతూ ప్రజలను కట్టు బానిసలుగా మార్చాయన్నారు. నాటి సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్‌ ఛార్జీలు పెంచితే దానికి వ్యతిరేకంగా తాను లేఖ రాశాననీ, కొంత మంది రైతులు వ్యతిరేకిస్తే హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌లో కాల్పులు జరిపి ముగ్గురిని చంపేశారని తెలిపారు. దాంతో తెలంగాణ సమస్యలకు పరిష్కారం ప్రత్యేక రాష్ట్రమే అని తాను నిర్ణయించుకున్నాననీ, ఒక్కడిగా బయలుదేరానని తెలిపారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ పార్టీతో జతకడితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాడు తెలంగాణను ఎగబెట్టే ఆలోచనతో జాప్యం చేసిందని కేసీఆర్‌ తెలిపారు.

మాజీ సీఎం రోశయ్య 14ఎఫ్‌ తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా కేసీఆర్‌ చచ్చుడో…తెలంగాణ వచ్చుడో అంటూ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటే అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణ ప్రకటన చేశారని గుర్తుచేశారు. ఆంధ్ర ప్రజా ప్రతినిధుల రాజీనామాల బెదిరింపులతో కేంద్రం వెనక్కి తగ్గితే మళ్లీ జేఏసీ పెట్టి మూడున్నరేండ్లు ఉధతంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించినట్టు తెలిపారు. 2014లో వచ్చిన తెలంగాణలో ప్రజలు ఆశీర్వదించి అధికారమిస్తే ప్రజల జీవితాల్లో మార్పు కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్టు కేసీఆర్‌ తెలిపారు. మిషన్‌ భగీరథతో అన్ని వర్గాల ప్రజలకు తాగునీరు, తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తిని 7 వేల నుంచి 20 వేల మెగావాట్లకు పెంచి 24గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేశామని చెప్పారు. రైతుబంధు, దళిత బంధు తదితర పథకాలను అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. బీఆర్‌ఎస్‌ ను ఓడించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అర్రాస్‌ పాట పాడినట్టు 6 గ్యారంటీలు, 420 హామీలంటూ అన్ని వర్గాల ప్రజలను వంచించిందని కేసీఆర్‌ దుయ్యబట్టారు. రైతులు పొలాలు ఎండిపోతున్నాయి, కనీసం సమయానికి యూరియా కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ ఏమైంది? అని ప్రశ్నించారు. నోటికొచ్చిన మాటలు అమలుకాని హామీలతో కాంగ్రెస్‌ ఊదరగొట్టినా బీఆర్‌ఎస్‌ 1.7 శాతం స్వల్ప ఓట్లతో ఓడిపోయిందని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి పని చేసేందుకు అవకాశమివ్వాలనీ వేచి చూస్తే, చిల్లర మాటలు తప్ప నిర్మాణాత్మక కార్యక్రమం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. పొదరిల్లులాగా తెలంగాణను మార్చి కడుపులో సల్ల కదలకుండా రైతులు బాగుండేలా చేసి అప్పగిస్తే యూరియా ఇవ్వడం చాతగానిది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారింది? అని ప్రశ్నించారు. రియల్‌ ఎస్టేట్‌, రైతుల భూముల ధరలు తగ్గాయనీ, మక్కలు కొనకుండా బోనస్‌ అంటూ బోగస్‌ మాటలు మాట్లాడుతున్నారనీ, చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని విమర్శించారు. ”పొద్దున లేస్తే కేసీఆర్‌ చావాలని అంటున్నావ్‌. నువ్వు ఎంత మొత్తుకున్నా కేసీఆర్‌ చావడు….” అని కాంగ్రెస్‌ నేతల విమర్శలపై స్పందించారు.

ఉద్యోగులకు 72 శాతం పీఆర్సీని బీఆర్‌ఎస్‌ ఇస్తే, ఉద్యోగులు తాము పొదుపు చేసుకున్న డబ్బులను కూడా రిటైర్మెంట్‌ తర్వాత కాంగ్రెస్‌ సర్కార్‌ ఇవ్వడం లేదని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయెంబర్స్‌ మెంట్‌ పథకాన్ని తాము కొనసాగిస్తే వాటికి బకాయిలు పెట్టి విద్యార్థులను వేధిస్తున్నదని విమర్శించారు. స్కాంలతో సింగరేణిని నాశనం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయంలో మున్సిపాల్టీలు మురికికూపాలుగా మారాయని దుయ్యబట్టారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే పూర్తి చేయడం లేదన్నారు. సీనియర్‌ నాయకుడు జీవన్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. జగిత్యాల జిల్లా బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు విద్యాసాగర్‌ రావు సబాధ్యక్షత వహించిన సభలో మండలి విపక్ష నేత మధుసూధనా చారి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పాడి కౌషిక్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌, ఎల్‌ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -