నాలుగైదు రోజులు ఆ రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు : ఐఎండీ హెచ్చరిక
ఏప్రిల్ 25 వరకు దేశంలో తీవ్ర వడగాల్పులు
పలు రాష్ట్రాల్లో వడగండ్ల వానలు
న్యూఢిల్లీ: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతుండగా రానున్న నాలుగైదు రోజుల పాటు దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు (హీట్ వేవ్స్) వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25 మధ్య హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, తూర్పు రాజ స్తాన్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్తాన్, మధ్యప్రదేశ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.
ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఏప్రిల్ 23 వరకు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది. అదే విధంగా నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లోనూ ఏప్రిల్ 22 వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది.
ఐఎండీ ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 20, 21 తేదీల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావచ్చని, రవాణా సౌకర్యాలకు కూడా అంతరాయం కలగవచ్చని పేర్కొంది. అంతేకాక స్థానికంగా వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇక దేశంలోని పశ్చిమ హిమాలయ ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో హిమపాతం, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వెస్ట్రన్ డిస్టర్బెన్సెన్స్, చక్రవాత పరిభ్రమణాల వంటి వివిధ వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయని వెల్లడించింది.
ఉరుములతో కూడిన వర్షాలు, వడగండ్ల వానలు
దక్షిణ, మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో సోమవారం మోస్తరు నుంచి తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అలాగే సోమవారం- మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తీవ్ర ఉక్కపోత
”ఏప్రిల్ 20-26 మధ్య గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఏప్రిల్ 20-22 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఏప్రిల్ 20-24 మధ్య కేరళ, మాహే, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, యానాం, ఏప్రిల్ 24, 25 తేదీల్లో గుజరాత్ తీర ప్రాంతాల్లో ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉండే అవకాశం ఉంది” అని ఐఎండీ పేర్కొంది.
రాత్రి వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు
ఏప్రిల్ 20, 21 తేదీల్లో హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లోనూ, ఏప్రిల్ 20న ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 20-22 మధ్య ఒడిశాలో రాత్రివేళల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ వెల్లడించింది.
ఎండల నేపథ్యంలో
జాగ్రత్తలు తప్పనిసరి
ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో చిన్నపిల్లలు, వృద్ధులు సహా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లడం మంచిది కాదని చెబుతున్నారు. చెమట రాకపోవడం, తీవ్రమైన అలసట, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
నిప్పుల కొలిమే
- Advertisement -
- Advertisement -



