Tuesday, April 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'మెట్రో'ను ఉదయం 5 గంటల నుంచే నడపండి

‘మెట్రో’ను ఉదయం 5 గంటల నుంచే నడపండి

- Advertisement -

ప్రభుత్వానికి ద.మ.రైల్వే జీఎం లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ సర్వీసుల్ని ఉదయం 5 గంటల నుంచే ప్రారంభించాలని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజరు కుమార్‌ శ్రీవాస్తవ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుకు లేఖ రాసారు. మెట్రోరైల్‌ సేవలు ప్రస్తుతం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్నాయి. దాన్ని ఉదయం 5 గంటలకు మార్చాలని ఆ లేఖలో కోరారు. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు రైలులో హైదరాబాద్‌కు వస్తున్నారనీ, ఈ ప్రయాణికులను తీసుకువచ్చే ప్రధాన రైళ్లు సికింద్రాబాద్‌ మరియు నాంపల్లి వంటి రైల్వే స్టేషన్లకు ఉదయం 4.30 నుంచి 7 గంటల మధ్య చేరుకుంటాయని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతి, ఢిల్లీ, విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లే వందేభారత్‌, రాజధాని, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులతో సహా పలు రైళ్లు ఉదయం 5 గంటల నుంచి 6.20 గంటల మధ్య బయలుదేరుతాయని పేర్కొన్నారు. ఈ నిర్దిష్ట సమయంలో మెట్రోరైలు సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం నాగోల్‌, మియాపూర్‌, ఎల్‌బి నగర్‌ స్టేషన్ల నుంచి మెట్రో రైళ్లు ఉదయం 6 గంటలకు బయలుదేరుతున్నప్పటికీ, నాంపల్లి, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లకు మొదటి మెట్రోరైలు చేరుకోవడానికి ఉదయం 6:20 నుంచి 6:30 గంటల వరకు పడుతోంది. ఈ లేఖపై సీఎస్‌ రామకృష్ణారావు వెంటనే స్పందించారు. హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ అధికారులు దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -