– ఎండ.. అప్రమత్తతే అండ
– వేసవి వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి
– జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు
– ‘నవతెలంగాణ’తో హైదరాబాద్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ జె.వెంకటి
నవతెలంగాణ-సిటీబ్యూరో
”ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత నీరసింపజేస్తోంది. వేసవిలో సంభవించే హీట్ వేవ్‌లతో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియకుండానే వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ బారిన పడినవారు చల్లని నీరు తాగుతూ శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్నా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసు కోవాలి..? ఏ సమయంలో బయటకు వెళ్లాలి..? వంటి అంశాలపై సోమవారం హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి ‘నవతెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడారు.
నవతెలంగాణ : వేసవిలో ఎలాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది?
డీఎంఅండ్‌హెచ్‌ఓ : ఎండ వేడిమి కారణంగా వడదెబ్బతోపాటు బీపీ, షుగర్ పెరగడంతోపాటు గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు, కడుపునొప్పి, చర్మవ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్నారుల్లో ఎక్కువగా జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
వడదెబ్బ సమస్యలకు ఎలాంటి సన్నాహాలు చేపట్టారు?
వడదెబ్బ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని పీహెచ్‌సీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాం. ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా సూచించాం. ప్రతి పీహెచ్సీలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశాం.
ఈ ఏడాది వడదెబ్బ, డీ హైడ్రేషన్ కేసులు నమోదయ్యాయా?
ఇప్పటి వరకు ఎలాంటి వడదెబ్బ, డీహైడ్రేషన్ కేసులు నమోదు కాలేదు. ఎండలు రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించకుంటే పరిస్థితి మారవచ్చు. వడదెబ్బకు గురైతే శరీరంలో నీటి శాతం లోపిస్తుంది. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, నిద్ర లేదా కలవరింతలు, ఫిట్స్ లేక పాక్షికంగా అపస్మారకస్థితి వంటి లక్షణాలుంటాయి.
వడ దెబ్బ తగిలిన తర్వాత మళ్లీ ఎండలోకి వెళ్ల కూడదు.
ఎండ తీవ్రత ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది?
ఎండలో తిరిగితే వడదెబ్బ ప్రభావం అందరిపై ఉంటుంది. ప్రధానంగా వృద్దులు, చిన్న పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులు (బీపీ, షుగర్, హార్ట్ స్ట్రోక్) ఉన్నవారు, బయట పని చేసే కార్మికులు, ఎక్కువగా వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా 60 ఏండ్లు పైబడిన వారు, చిన్నారులు, క్రీడాకారులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలి. డీ హైడ్రేషన్‌ను తగ్గించడానికి సాధారణంగా ప్రతి ఒక్కరూ 3 నుంచి 4 లీటర్లు, ఎండలో మరింత ఎక్కువ నీరు తీసుకోవాలి. దాహం లేకపోయినా క్రమం తప్పకుండా తాగాలి.
పిల్లలు, వృద్దులు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ముఖ్యంగా 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, చిన్నారులు, క్రీడాకారులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినీరు, మజ్జిగ తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్ జోలికి పోకూడదు. శరీరంలో నీటిశాతం పెంచే పుచ్చకాయ, కొబ్బరినీరును తీసుకోవాలి.
అందరికీ అవసరమయ్యే ముఖ్యమైన జాగ్రత్తలేంటి?
ప్రజలు తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లాలి, బయటకు వెళ్లే సమయంలో ఎండదెబ్బ తగలకుండా రుమాలు, క్యాపులు పూర్తిస్థాయిలో టవల్ కట్టుకోవాలి. తలకు ఎండ తగలకుండా చూసుకోవాలి. తలతిరగడం, తీవ్రమైన అలసట అనిపిస్తే వెంటనే చల్లని గాలివచ్చే ప్రదేశాల్లో సేదతీరాలి.
హీట్ వేవ్‌తో జాగ్రత్తలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



