మహిళలను చిన్నచూపు చూసిన బాబ్స్ సంస్థ 18 శతాబ్దం నుండే పనిచేస్తున్నది. గుళ్లలోకి మహిళలను రానియ్యని ఆచరణ వాళ్లది. ఇలాంటి ప్రచారకులకు, బోధకులకు మన విశ్వగురువు నాయకుడు. ఆధునిక ప్రజాస్వామిక, లౌకిక విధా నాలకు పూర్తి విరుద్ధమైన ఆలోచనలతో నడుస్తున్న తీరును చూసి ప్రపంచమంతా నవ్వుతున్నది. ప్రపంచంలోనే మొట్ట మొదటి రాజకీయ విప్లవం సాధించిన ‘పారిస్ కమ్యూన్’లో మహిళలు స్వేచ్ఛ కోసం వీరోచితంగా పోరాడిన నేలలో లింగ వివక్షతలకు పాల్పడడం క్షమించరాని నేరం. చైతన్యయుతమైన అక్కడి మహిళలు తమ ప్రతిఘటనను ప్రదర్శించారు.
స్వామి వివేకానంద ఆనాడు చికాగోలో జరిగిన ఆధ్యాత్మికుల సభలో ప్రసంగించి అందరినీ అబ్బుర పరిచారని మనందరికీ తెలుసు. సంబోధనలోనే ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అని ఒక ఉన్నతమైన పిలుపుతో అందరి మనసులు గెలుచు కున్నాడని విన్నాము. భారతదేశపు గౌరవ మర్యాదలు, సంప్రదాయాలు, విలువల గురించి ఆయన ప్రసంగం ప్రస్ఫురించందని విమర్శకులు అభిప్రాయ పడి, ఆయన్ను కొనియాడారు. అట్లాంటి చరిత్రను చెరిపిరాసేందుకు పూను కుంటున్నాయి నేటి మతవాదుల చర్యలు. భక్తి, ఆరాధన వ్యక్తిగతమైన విషయాలు. అవి ఎలా చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఇప్పుడు ఏం జరిగింది. ఏం జరుగుతోంది? మన దేశ ఉన్నత్యాన్ని దెబ్బతీసే పనులకు మత ప్రచారకులు, ప్రవచనకారులూ ఒడిగడుతున్నారు.మొన్న సెప్టెంబరు 5న ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో జరిగిన సంఘటన మతవాదుల వివక్షతలను వెల్లడిస్తోంది. వివక్షా పూరిత వీరి ప్రవర్తనకు పారిస్‌లోని ప్రసిద్ధ పర్యటన కట్టడం ఈఫిల్ టవర్‌ను ఒకరోజు మూసేసారు. అసలేం జరిగిం దంటే, బాబ్స్ అనే ఒక హిందూ ధార్మిక సంస్థ (బొచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంత) సభ్యులు ఒక వంద మంది కాషాయ వస్త్రాలు ధరించి, ఈఫిల్ టవర్ సందర్శనకు వెళ్లారు. అందులో వారి గురువు కూడా ఉన్నాడు. అందరు పర్యటించినట్లే వాళ్లూ పర్యటిస్తే ఇంత చెప్పుకునేవాళ్లం కాదు.
ఆ ఈఫిల్ టవర్‌లో వందలాదిమంది ఉద్యోగులు పనిచేస్తారు. అందులో మహిళలూ ఉంటారు. మన హిందూ సాధు సన్యాసులు, అక్కడ మహిళా ఉద్యోగులను వారికి కనపడకుండా తప్పుకోవాలని కోరారు, వారు పనిచేస్తున్న ప్రదేశంలో పురుష ఉద్యోగులను ఉంచాలని, మేము మహిళలను చూడకూడదని వీరి వివక్షాపూరిత ఆచారాన్ని అక్కడ అమలు చేయటానికి సిద్ధపడ్డారు. ఈఫిల్ టవర్ యాజమాన్యం వారి కోరిక మేరకు తప్పుకోవాల్సిందిగా కోరింది. మహిళలను వారు చూస్తే మలిన పడిపోతారని వారి భావం, పాపమై పోతుందనే ఉద్దేశం, అక్కడ మహిళా ఉద్యోగులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఒక విదేశీ గడ్డపైన మన మత ఆచారాలు ఎంత వివక్ష పూరితంగా ఉంటాయో ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. వెంటనే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగ సంఘాలు వీరి ప్రవర్తనకు నిరసనగా ఒక రోజు సమ్మెకు దిగడంతో సెప్టెంబరు 7న ఈఫిల్ టవర్ సందర్శనను నిలిపివేశారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, అంతకుముందు రోజు పారిస్‌లో బాబ్స్ అనే సంస్థ నిర్మించిన దేవాలయ ప్రారంభోత్సవానికి మన ప్రధాని మోడీ హాజరయ్యారు. భారత్, ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధానికి ఇదొక ప్రతీక అని, ఈ సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని కోరి ఉన్నారు. ఆ వెనువెంటనే ఈ సంఘ టన చోటు చేసుకున్నది.
ఉద్యోగులు చేసిన సమ్మెతో ప్రభుత్వం జోక్యం చేసుకుని, జరిగిన దానిపై దర్యాప్తు చేస్తున్నది. టవర్ ఆపరేటింగ్ కంపెనీ పొరపాటు చేసిందని, దేశం అవలంబిస్తున్న సమానత్వ, గణతంత్ర విధానాలకు వ్యతిరేకమైన చర్య ఇదని, లింగ వివక్షతను అనుమతించబోమని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఘటనను ఫ్రెంచ్ రాజకీయ నాయకులు, అధికారులు ఖండించారు. ఇంత పెద్ద దుమారం రేగగానే సదరు ‘బాబ్స్’ సంస్థ క్షమాపణలు కోరింది. ప్రపంచంలో మన ఆచరణ, మహిళల పట్ల వివక్షత, అసమానతలు ఏ విధంగా ఉన్నాయో బహిరంగ పరిచారు. ఇవి మనకు తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయి. స్త్రీల పట్ల మతతత్వవాదులు ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాలలోనూ అదే రకమైన ఆచరణ, ఆలోచన కొనసాగుతుంది. దీన్ని ఇప్పుడు కూడా మన దేశంలోని మతవాదులు కానీ, పరిపాలిస్తున్న నాయకులు కానీ ఖండించరు. వీరి మత ఛాందస విధానాలు, మన దేశంలో కులపరంగానూ దుర్మార్గమైన వివక్షతలను పాటిస్తున్నారు.
వాళ్లూ సనాతనవాదం గురించి మాట్లాడుతున్నారు. మహిళలను చిన్నచూపు చూసిన బాబ్స్ సంస్థ 18 శతాబ్దం నుండే పనిచేస్తున్నది. గుళ్లలోకి మహిళలను రానియ్యని ఆచరణ వాళ్లది. ఇలాంటి ప్రచారకులకు, బోధకులకు మన విశ్వగురువు నాయకుడు. ఆధునిక ప్రజాస్వామిక, లౌకిక విధా నాలకు పూర్తి విరుద్ధమైన ఆలోచనలతో నడుస్తున్న తీరును చూసి ప్రపంచమంతా నవ్వుతున్నది. ప్రపంచంలోనే మొట్ట మొదటి రాజకీయ విప్లవం సాధించిన ‘పారిస్ కమ్యూన్’లో మహిళలు స్వేచ్ఛ కోసం వీరోచితంగా పోరాడిన నేలలో లింగ వివక్షతలకు పాల్పడడం క్షమించరాని నేరం. చైతన్యయుతమైన అక్కడి మహిళలు తమ ప్రతిఘటనను ప్రదర్శించారు.



