శాటిలైట్ చిత్రాలతో బహిర్గతం
మిలిటరీ స్థావరాల నిర్మాణం
‘న్యూ రఫా’ ప్రణాళికపై తీవ్ర అనుమానాలు ొ అంతర్జాతీయ సంస్థల నుంచి విమర్శలు
గాజా : గాజాపై ఇజ్రాయిల్ దుశ్చర్యలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నగరంలో సైనిక స్థావరాల నిర్మాణంపై ఇజ్రాయిల్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. గాజా ప్రాంతంలో పునర్నిర్మాణం నిలిచిపోవడంతో పాటు.. ఇజ్రాయిల్ సైన్యం శాశ్వత స్థావరాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్టు ఈ చిత్రాల ఆధారంగా వెల్లడైంది. ముఖ్యంగా రఫా ప్రాంతంలో ఈ నిర్మాణాలు విస్తృతంగా జరుగుతున్నాయని తాజా నివేదికలు చెప్తున్నాయి.
అల్ జజీరా డిజిటల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ చేసిన పరిశోధనలో ప్లానెట్ ల్యాబ్స్, సెంటినెల్ హబ్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 15 వరకు తీసిన చిత్రాలు ఆందోళనకర విషయాలను బయటపెట్టాయి. ఉత్తర గాజాలోని బీట్ హనూన్, దక్షిణంలోని రఫా ప్రాంతాల్లో శిధిలాల తొలగింపు దాదాపు ఆగిపోయింది. అయితే అదే సమయంలో ఇజ్రాయిల్ సైన్యం తన స్థావరాలను పటిష్టం చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక మార్చి 10 నుంచి తీసిన శాటిలైట్ చిత్రాలు గాజా నగరంలోని షుజాయియా ప్రాంతంలోని అల్-ముంటార్ కొండపై విస్తృతస్థాయిలో భూమి సమతలీక రణ, కోట నిర్మాణాలు కనిపించాయి. అలాగే ఖాన్ యూనిస్ ప్రాంతంలో కూడా సైనిక అవుట్ పోస్టులు నిర్మాణంలో ఉన్నాయి. సెంట్రల్ గాజాలోని మఘాజీ శిబిరం వరకు పొడవుగా గోతులు, ఇతర నిర్మాణాలు కొనసాగుతోన్నాయని మార్చి 15న తీసిన చిత్రాలు తెలియజేస్తున్నాయి.
కాగా 2025 చివరల్లో ఫోరెన్సిక్ ఆర్కి టెక్చర్ చేసిన అధ్యయనంలో గాజాలో 48 ఇజ్రాయిల్ సైనిక స్థావరాలను గుర్తించారు. వాటిలో 13 స్థావరాలు ‘సీజ్‌ఫైర్’ తర్వాత నిర్మితమయ్యాయి. ఇవి ఇప్పుడు రోడ్లు, వాచ్‌టవర్లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లతో కూడిన శాశ్వత స్థావరాలుగా మారాయి.
‘న్యూ రఫా’ ప్రణాళికపై అనుమానాలు
దక్షిణ గాజాలోని రఫా నగరాన్ని మళ్లీ నిర్మించేందుకు అమెరికా-ఇజ్రాయిల్‌లు ఒక ప్రణాళికను ప్రతిపాదిం చిన విషయం విదితమే. దీనికి ‘న్యూ రఫా’గా ప్రచారం సాగింది. ఈ రఫా నగరం రెండేండ్ల పాటు జరిగిన ఇజ్రాయిల్ బాంబుదాడుల వల్ల పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఉపగ్రహ చిత్రాలు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశకు కూడా చేరలేదని సూచిస్తున్నాయి. ఇది ఆదిలోనే నిలిచిపోయినట్టు వివరిస్తున్నాయి.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్.. న్యూ రఫా పేరుతో ఏఐ ద్వారా ఆధునిక నగర రూపకల్పనను ప్రదర్శించాడు. ఇందులో ఎత్తైన భవనాలు, లగ్జరీ రిసార్ట్‌లు ఉన్నాయి. ట్రంప్ ఈ ప్రణాళికలను ‘మిడిల్ ఈస్ట్ రివేరా’గా ప్రచారం చేస్తూ 10 బిలియన్ డాలర్ల నిధులు వాగ్దానం చేశాడు.
అయితే జెనీవాలోని యూరో-మెడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్ ఈ ప్రణాళికను తీవ్రంగా విమర్శించింది. ఇదంతా జనాభా మార్పిడి, బలవంతపు తరలింపు కోసం రూపొందించిన ప్రయత్నంగా అభివర్ణించింది. ఈ ప్రణాళిక ప్రకారం గాజాను చిన్న చిన్న జనాభా బ్లాక్‌లుగా విభజించి, సైనిక నియంత్రిత ప్రాంతాలుగా మార్చుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో న్యూ రఫా ప్రణాళికపై అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి.
కొత్త సరిహద్దుగా ‘యెల్లో లైన్’
గాజాలో ‘యెల్లో లైన్’ అనే ‘సీజ్‌ఫైర్’ సరిహద్దును ఇజ్రాయిల్ శాశ్వత సరిహద్దుగా మార్చుతున్నట్టు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఇజ్రాయిల్ సైన్యాధిపతి ఎయాల్ జమీర్ ఈ లైన్‌ను ‘కొత్త సరిహద్దు’గా పేర్కొనగా, రక్షణమంత్రి ఇజ్రాయిల్ కాట్జ్.. గాజాను ఎప్పటికీ విడిచిపెట్టబోమని, అక్కడ సైనిక-వ్యవసాయ కాలనీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాదు.. ఇజ్రాయిల్ రహస్యంగా సరిహద్దు గుర్తులను పాలస్తీనీయుల ప్రాంతాల్లోకి మరింత లోపలికి మార్చినట్టు కూడా పరిశోధనలో వెల్లడైంది. ఆక్స్‌ఫామ్, సేవ్ ది చిల్డ్రన్ వంటి సహాయ సంస్థలు ట్రంప్ పునర్నిర్మాణ ప్రణాళికను తీవ్రంగా విమర్శించాయి. గాజాలో ప్రజల పరిస్థితుల్లో ఎలాంటి స్పష్టమైన మార్పూ తీసుకురాలేదని, ఈ ప్రణాళిక పూర్తిగా విఫలమైందని ఆరోపించాయి.
గాజాలో ఇజ్రాయిల్ దుశ్చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



