Thursday, April 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆ శాస్త్రవేత్తలు ఎక్కడీ

ఆ శాస్త్రవేత్తలు ఎక్కడీ

- Advertisement -

అమెరికా పరిశోధనలో భాగస్వాముల
అదృశ్యంపై ఎఫ్‌బీఐ విచారణ
వాషింగ్టన్‌ :
అణు భౌతిక శాస్త్రవేత్త, మిట్‌ సంస్థ ప్రొఫెసర్‌ను మాసాచూసెట్స్‌లోని ఆయన నివాసం ఎదుటే దారుణంగా కాల్చి చంపారు. పదవీ విరమణ చేసిన ఓ వైమానిక దళ జనరల్‌ తన న్యూ మెక్సికో నివాసం నుంచి అదృశ్యమయ్యారు. లాస్‌ ఏంజెల్స్‌లో ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ జాడ తెలియడం లేదు. ఇలా ఇటీవలి సంవత్సరాలలో కీలకమైన అమెరికా అణు-ఏరోస్పేస్‌ పరిశోధనలో భాగస్వాములైన కనీనం పది మంది శాస్త్రవేత్తలు హత్యకు గురి కావడమో లేదా అదృశ్యమవడమో జరిగింది. దీంతో వారు ఏవైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో భాగస్వాములు అయ్యారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. శాస్త్రవేత్తల హత్య, అదృశ్యం వెనుక ఉన్న కారణాలను కనిపెట్టే పనిలో ఉన్నామని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) తెలిపింది. ఈ విషయంలో ఇంధన, రక్షణ మంత్రిత్వ శాఖలతో పాటు ప్రభుత్వ, స్థానిక పోలీసులతో కలిసి పనిచేస్తున్నామని చెప్పింది. ఇదిలావుండగా రిపబ్లికన్ల నేతృత్వంలోని హౌస్‌ ఓవర్‌సైట్‌ కమిటీ కూడా ఈ అంశంపై దర్యాప్తు చేస్తోంది. హత్యకు గురైన లేదా అదృశ్యమైన వ్యక్తుల వద్ద కీలకమైన శాస్త్ర సమాచారం ఉన్నదని తెలియజేసింది. మరణాలు, అదృశ్యాల మధ్య ఏదైనా సంబంధం ఉన్నదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎఫ్‌బీఐ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, నాసా నుంచి హౌస్‌ ఓవర్‌సైట్‌ కమిటీ సమాచారాన్ని కోరింది. ఇది దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశమని నాసా ప్రతినిధి బెథానీ స్టీవెన్స్‌ చెప్పారు. కాగా చనిపోయిన లేదా అదృశ్యమైన వారి వివరాలలోకి వెళితే…2023లో ఈ ఘటనలు మొదలయ్యాయి. నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీలో (జేపీఎల్‌) పాతిక సంవత్సరాలు పనిచేసిన మైకెల్‌ డేవిడ్‌ హిక్స్‌ ఆ సంవత్సరం జూలై 30న చనిపోయారు. కారణం ఇప్పటి వరకూ తెలియదు. అప్పటి నుంచి జేపీఎల్‌తో సంబంధమున్న అనేక మంది వ్యక్తులు చనిపోవడమో లేదా కన్పించకుండా పోవడమే జరిగింది. అంతరిక్ష పరిశోధనలో నిష్ణాతుడైన ఫ్రాంక్‌ మైవాల్డ్‌ 2024లో లాస్‌ ఏంజెల్స్‌లో అడవిలో సంచరిస్తూ అదృశ్యమయ్యారు. 2025 జూన్‌లో ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ అయిన మోనికా రెజా కూడా అడవిలోనే కన్పించకుండా పోయారు. రిటైర్డ్‌ ఎయిరఫోర్స్‌ మేజర్‌ జనరల్‌ విలియం నెయిల్‌ మెకాస్‌లాండ్‌ న్యూ మెక్సికోలోని తన నివాసం నుంచి బయటికి వెళ్లి అదృశ్యమయ్యారు. కాగా లాస్‌ ఏంజెల్స్‌ లేబొరేటరీలో పనిచేస్తున్న మెలిస్సా కసియాస్‌, ఆంథోనీ ఛావెజ్‌ల జాడ కూడా తెలియడం లేదు. హైవేపై కాసియాస్‌ నడుచుకుంటూ వెళ్లడాన్ని కొందరు చూశారు. ఆ తర్వాత ఆమె ఆచూకీ లేదు. ఫోర్‌మన్‌గా పనిచేసిన ఛావెజ్‌ 2025 మేలో అదృశ్యమయ్యారు.
ఇటీవలి కాలంలో కొందరు శాస్త్రవేత్తలు అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయారు. మాసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లారైరోను బోస్టన్‌లోని ఆయన నివాసం సమీపంలోనే కాల్చి చంపారు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో పనిచేస్తున్న కార్ల్‌ గ్రిల్‌మెయిర్‌ను లాస్‌ ఏంజెల్స్‌లోని ఆయన నివాసం వెలుపలే కాల్చి చంపారు. ఓ కేసులో సాక్ష్యమిచ్చిన అమెరికా వైమానిక దళ ఇంటెలిజెన్స్‌ మాజీ అధికారి మాథ్యూ జేమ్స్‌ సులివన్‌ 2024లో చనిపోయారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలన్నింటిపై ఎఫ్‌బీఐ విచారణలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -