Sunday, September 13, 2026
E-PAPER
Homeదర్వాజఆత్మ కథలు - దళిత జీవితాలు

ఆత్మ కథలు – దళిత జీవితాలు

- Advertisement -

ఆకలితో – దారిద్రంలో పుట్టి పెరిగిన దళిత పిల్లలు, తమ పట్ల చూపే వివక్ష – అణచివేతలకు గురి అవుతూనే, అన్యాయాలు – అవమానాలు సహిస్తూ, చదువుకొని పైకెదిగిన క్రమాన్ని అక్షరీకరిస్తే అవే ” దళిత ఆత్మకథలు” గా నిలుస్తాయి. తెలుగులో మొదటగా జాషువా తన ” ఆత్మ కథ” ను రాసుకున్నారు. శ్రీమతి హైమావతి భీమన్న” పాలేరు నుంచి పద్మశ్రీ వరకు” అంటూ బోయి భీమన్న జీవిత చరిత్రను రాశారు. ఇటీవల కాలంలో దార్ల వెంకటేశ్వరరావు “నెమలి కన్నులు” పేరిట తమ స్వీయ చరిత్రను రాసుకున్నారు. ఆ కోవలో ఇప్పటి ఎజ్రాశాస్త్రి గారి ఆత్మకథ “మా ఊరి పొలిమేర దాటినంక” పేరిట రావడం అభినందించదగ్గ విషయం. వరుసగా మూడేళ్లు కరువు రాగా పంటలు పండక పనులు లేక రచయిత కుటుంబం, నందికొండ దగ్గర నాగార్జునసాగర్ డ్యాం కడుతున్నారని తెలుసుకొని పనులు వెతుక్కుంటూ, లేబర్ కాలనీలో ఇల్లు వెతుక్కుని, నాగార్జునసాగర్ పైలాన్ దగ్గర రచయిత తాత, తండ్రి, అన్న చెప్పులు కుట్టుకుంటూ బతుకుతుండేవారు. వీళ్ళ తండ్రి దగ్గర బూట్లు పాలిష్ చేసుకొని పోయే ఒక అధికారి వీరి కథ వీరి జాలిపడి తండ్రిని జె ఇ దగ్గర ,ఏ ఈ దగ్గర తాతను, ఎలక్ట్రిక్ యార్డు దగ్గర కాపలాదారునిగా అన్నకు ఉద్యోగం పెట్టిస్తాడు.

1966లో ప్రాజెక్టు పనులు పూర్తికావస్తున్న నేపథ్యంలో తాతను, అన్నను విధుల నుండి తొలగిస్తారు. దాంతో తండ్రి ‘మీరంతా ఊరికి పోయి ఏదైనా పని చేసుకుని బ్రతకండి. చివరి ముగ్గురు పిల్లల్ని కనిగిరి హాస్టల్ లో చేర్పించమని’ పంపిస్తాడు. ఆరేళ్ల వయసులో బడిలో చేరిన రచయితకు బడి రామాలయంలో జరగడం, అందులోని సత్యం పంతులు నిష్టా నియమాలు ఎక్కువగా ఉండడంతో, మాల మాదిగ పిల్లల్ని రామాలయం బయట కూర్చో పెట్టేవాడు. ఒకసారి అయ్యగారి కోసం తెచ్చిన మజ్జిగ ముంతను తెలియకుండా తాకడంతో పంతులు రచయితను చావబాదుతాడు. నాగార్జునసాగర్ నుండి వచ్చిన తండ్రి ఈ సంగతి తెలుసుకొని, కనిగిరికి తీసుకుపోయి పిల్లల్ని అక్కడి హాస్టల్ లో చేర్పిస్తాడు. చదువుకునే పిల్లల్లా కాకుండా బోస్టన్ స్కూల్ లోని బాల ఖైదీల్లా ఉండే వాళ్ళం అని అక్కడ గడచిన జీవితం గురించి చెబుతాడు. క్రమశిక్షణ పేరిట విధించే భయంకరమైన శిక్షల గురించి చెబుతారు. హాస్టల్ జీవితమంటే మనకు మనమే శుభ్రం పాటించాలి. ఎవరూ నేర్పరు. బాల్యం, పసితనం వల్ల పరిశుభ్రత లేక పిల్లలు అంటువ్యాధులతో అలమటించేవారు. వీధుల్లో అమ్మే తినుబండారాలు చూస్తే నోరూరేవి. కానీ చేతిలో చిల్లి గవ్వ ఉండేది కాదు. ఇంటర్వెల్ లో కిచెన్ దగ్గరకు వచ్చి ఎవరూ లేకపోతే మిగిలినవి ఉంటే తిని తాగడం, అక్కడ ఉన్న కోడిగుడ్లను ఎత్తుకుపోయి బజార్లో అమ్ముకొని హోటల్లో తినేవాడు.

నీళ్లు పోసిన వాళ్లకు ఒక ముద్ద రాగి సంగటి ఎక్కువ పెడతారని నీళ్లు తోడేవాడు. సెలవుల్లో ఇంటికి వస్తే ముగ్గురు అన్నదమ్ములు నాట్లకు పోయేవారు. అలా పోకపోతే కూడు కూడా ఉండేది కాదు.ఇంటి నుండి వస్తే, హాస్టల్లో నిద్రపోయిన తర్వాత వాళ్ళ ట్రంకు పెట్టెలు పగులగొట్టి వాళ్లు ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న తినుబండారాలను సీనియర్లు దొంగిలించే వాళ్ళు. హాస్టల్ లోని ఆడా మొగ పిల్లల్ని టీచర్లు వాళ్ళ ఇళ్ళలో బానిసల్లా వాడుకునేవారు. పనులన్నీ చేసి ఆకలితో నకనకలాడుతుంటే మార్తా టీచర్ ఏ రోజు ఇంత చద్ది బువ్వ పెట్టిన పాపాన పోలేదు. కానీ ఆమె బడికి వచ్చి బైబిల్ చదివి ప్రార్థన చేస్తుంటే, ఈమె ఎంతటి నిస్వార్థ నీతిమంతురాలు అనుకుంటారు. ఒకరోజు స్కూల్ మూసేసి దొర బంగాళాలో మీటింగుకు పిల్లలందరినీ తోలుకు పోతారు. అక్కడ రెండు దున్న కుర్రలని కోసి వండుతుంటే , ఇంకోపక్క ప్రార్ధనలు. సమావేశానికి వచ్చిన సంఘ పెద్దలు సుష్టిగా తిని పోతారు. పొద్దున రెండు గరిటెల గోధుమ జావ తాగి వచ్చిన పిల్లలు ఆకలితో మాడుతుంటే అన్నం, కూర అయిపోయాయని తెలుస్తుంది.” ఎట్టా మూడు గంటలు అయింది.

కాసేపు ఆగి సాయంత్రం ఒకేసారి తింటారులే” అని కరస్పాండెంట్ అనడంతో పిల్లలంతా బావురుమని ఏడుస్తారు. పనులు లేక మాదిగ పల్లెలో 90 శాతం మంది పస్తులు ఉండేవారు. మాదిగ పల్లె కాదు. కొంతమంది పేద రైతులు, బోయ, ముత్రాసుల, దూదేకులోల్లు పస్తులు ఉండేవారు. పెద్దవాళ్లయితే ఎలాగో ఓర్చుకుంటారు. పసిబిడ్డలు, బాలింతలు, గర్భిణీ స్త్రీల యాతనలు వేరు.ఇంటి పరిస్థితులు దుర్భరమైనప్పుడు ఇద్దరన్నలు కొండకు పోయి కట్టెలమోపులు కట్టుకొని, పది మైళ్ళ దూరంలోని కనిగిరి కి పోయి అమ్ముకొని, సరుకులు తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళు. దాంతో మిగతా వాళ్ళ కన్నా వీళ్ళ పరిస్థితి ఒకింత నయం అనుకోవాలి. క్రిస్మస్ పండుగను మాదిగోల్ల పండుగ అంటారు. కొత్త బట్టలు వరన్నం అంటే అది క్రిస్మస్ పండుగ నాడే . మద్రాసుకు పోయి టైలరింగ్ నేర్చుకొని వచ్చిన భోగం రంగయ్య లేడీస్ టైలర్ గా పేరు తెచ్చుకుంటాడు. హరనాథ్ లా ఉండే భోగం రంగయ్య సినిమాల్లో చేరాలని మద్రాస్ పోయి విఫలమై ఇంటికి తిరిగి వస్తాడు. అందగాడైన రంగయ్య, కరణం పెద్ద కూతురుతో లేచిపోతే కుట్టమని ఇచ్చిన బట్టలు పోయి అందరూ లబోదిబోమంటారు , రచయిత కుటుంబంతో సహా.

పాత సామాన్లు అమ్మిన డబ్బుతో రచయిత రాజమండ్రి కి బదిలీ అయిన తండ్రి దగ్గరకు వెళతాడు. అక్కడి నుండి ఊరంతా తిరుగుతూ కనిపించిన హోటల్లో పని అడిగి క్లీనర్ గా చేరుతాడు. అక్కడి సూపర్వైజర్ తో బాధలు పడలేక మానేసి ఇంకో హోటల్ లో చేరుతాడు. అక్కడ కొంతకాలం పనిచేసి ఆరోగ్యం బాగాలేక మానేస్తాడు. తర్వాత దగ్గరలో ఉన్న లాడ్జి లో బాయ్ గా మారతాడు. అక్కడ పని సులువుగా ఉండి డబ్బులు బాగా దొరుకుతుండేవి. ఇంటి మీదకు గాలి మళ్ళడంతో అక్కడ పని మానేసి గోదావరి రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు ఎక్కుతాడు. ఒంగోలులో దిగి నడుచుకుంటూ ఆకలి అయితే అడుక్కుతిని, సంతనూతలపాడు మీదుగా పేర్నమిట్ట చేరుకుంటాడు. అక్కడ వైశ్యుల హోటల్లో పనిచేస్తూ, కనిగిరి పోయే లారీ కనిపిస్తే బతిమిలాడి కనిగిరిలోని ఇంటికి చేరుకుంటాడు.
అప్పుడు తల్లి ఉన్న ఊర్లో పశువుల కాపరిగా కుదురుస్తుంది. తండ్రి గోపవరం రమ్మని ఉత్తరం రాస్తే తల్లితో కలిసి వస్తాడు. అక్కడి టీ కొట్టులో పనిచేస్తూ ఏడవ తరగతి కట్టి పాస్ అవుతాడు. 8, 9 తరగతులను నిర్లక్ష్యం చేసి మిత్రులతో కలిసి సినిమాలు, తాగడం, బ్రాకెట్ ఆడటం చేసేవాడు. వాళ్ళయ్యకు గోపవరం నుండి ఏలేశ్వరం బదిలీ కావడంతో అక్కడ పదవ తరగతిలో చేర్పిస్తాడు. అందులో ఫెయిల్ అయి అందరూ తిట్టడంతో రైలేక్కి రాయపూర్ చేరుకొని, భిలాయి స్టీలు ప్లాంట్ లో పనిచేసుకుంటున్న బావ దగ్గరికి చేరుతాడు.

ఆయన అక్కడ హోటల్ పనిలో చేర్పిస్తాడు. ఏలేశ్వరం వచ్చి రెక్కల పరీక్ష కట్టమని తండ్రి ఉత్తరం రాస్తే వస్తాడు. అక్కడ తెలుగు మాస్టారు శాస్త్రి కలిసి ఫీజు కట్టి, ట్యూషన్ చెప్పించగా పదవ తరగతి పాస్ అవుతాడు. ఈ అధ్యాయంలో 1977లో వచ్చిన దివిసీమ తుఫాను, ఏలేరు మీద రిజర్వాయర్ నిర్మాణం, పట్టణంగా మారిన ఏలేశ్వరం వర్ణన, విశాఖపట్నం నుండి భిలాయిపోయే రైలు ప్రయాణ విశేషాలను ఆసక్తికరంగా తెలియజేశారు. రచయిత ఇంటర్లో చేరి మొదటి సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవుతాడు. విద్యార్థి సంఘ ఎన్నికలలో జూనియర్ కాలేజీ ప్రెసిడెంట్ గా ఎన్నికవుతాడు. పి డి ఎస్ యు లో చేరి క్రియాశీలకంగా పనిచేస్తాడు. ఇంటర్ అయిన తర్వాత నిడదవోలులో ఐటిఐ చదివి, డ్యాంలో టెంపరరీ వర్క్ ఇన్స్పెక్టర్గా చేరుతాడు. వాళ్ళ క్వార్టర్స్ లో ఉండే బీబీ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. పెళ్లికి వాళ్ల పెద్దలు తిరస్కరిస్తారు. దాంతో భిలాయి లో చదువుకుంటున్న అక్క కూతురు కమలను పెళ్లి చేసుకుంటాడు. భిలాయ్ నుండి చూడటానికి వచ్చిన అక్కగారు, భిలాయి వస్తే పర్మనెంట్ పని చూసుకోవచ్చు అని తీసుకెళ్తుంది. వాళ్ళ బావ అక్కడ ఒక స్టార్ హోటల్లో వెయిటర్ గా పెట్టిస్తాడు. రెండు సంవత్సరాలు ఒకపక్క కుటుంబం కోసం పోరాడటం, మరోపక్క ఛత్తీస్ గడ్ ముక్తిమోర్ఛా కోసం పోరాటంలో పాల్గొంటాడు. వాళ్ళ అయ్యకు పక్షవాతం వచ్చిందని తెలియగానే కుటుంబంతో కలిసి కనిగిరి చేరుకుంటాడు. తర్వాత కాలంలో బిఎస్పి లో చేరి అంబేద్కర్ కార్యక్రమాలు చేపడతాడు.

వాళ్ళ అయ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే అతనికి పెన్షన్ వస్తుంది. తండ్రి స్థానంలో కొడుకుకు ఉద్యోగం వస్తుంది. అలా ఒక ఎనిమిది నెలలు పనిచేసిన తర్వాత సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం ఒంగోలు వినుకొండ ప్రాజెక్టుకు బదిలీ చేస్తారు. 1994 కనిగిరి మాదిగ పల్లెలో వాళ్ళ మామగారు కట్టిన రెండు పోర్షన్ల మిద్దెలో చేరుతాడు. అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన కృష్ణ మాదిగ ,కృపాకర్ల సాహచర్యంతో మాదిగ దండోరా సమితిలో చేరి పనిచేస్తారు. ఒంగోలు రాగానే సాహితీ మిత్రుల పరిచయం, ఆయన సాహిత్య కృషికి దోహదపడింది.” కర్ర ముక్క” దీర్ఘకావ్యం తర్వాత రాసిన నాలుగు నవలలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. స్వయంకృషితోనే రచయితగా ఎదిగాడు. పిల్లలకు మంచి చదువులు చెప్పించి, వాళ్ళ పెళ్లిళ్లు చేసేసి, సొంతంగా ఇల్లు కట్టుకొని స్థిరపడతాడు. 40 ఏళ్ల ఉద్యోగ ప్రస్తానాన్ని కొనసాగించి చివరకు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ గా పదవీ విరమణ చేస్తారు. తల్లిదండ్రుల నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తిరిగిన రచయిత, జీవితంలోని మంచి- చెడులను, చేసిన పొరపాట్లను – తప్పులను నిష్పక్షపాతంగా బయటపెట్టారు. ఉన్న విషయాలను దాచిపెట్టడం, లేని గొప్పలను చెప్పుకోవడం చేయలేదు. ఇదంతా బాగానే ఉంది. అయితే తన సాహిత్య జీవితం గురించి కానీ, భార్యా పిల్లల గురించి కానీ ఏమి చెప్పకపోవడం ఆశ్చర్యం. ఆత్మకథను అదరాబాదరగా ముగించడం కంటే, ఆ విషయంలను కూడా రాసి ఉంటే, ఆత్మ కథ విస్తృతి పెరిగేది. సమాజంలో జీవన ప్రమాణాలు పెరిగి, మనిషి జీవితకాలం పెరిగిపోతుంటే – మనిషి రిటైర్ అయిన కాలంతోనే అంతా ముగిసిపోయిందనుకొని ఆత్మకథలు రాసుకుంటూ పోతే ఎలా? మిగిలిన 10 ,20 ఏళ్ల కాలం నిష్క్రియాపరంగా బతికేయడానికే నిశ్చయించుకున్నారా? ఏమో తెలియదు.

కె.పి.అశోక్ కుమార్,
9700000948

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -