- అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్: 22A భూముల అంశంపై గతంలోనూ తప్పుగా చేర్చిన భూములను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే చరిత్ర కొంతమందిని ఎప్పుడూ క్షమించదని సీఎం వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన తప్పిదాలపై చర్చ జరిగితేనే భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే ప్రతిపక్షం గతంలో జరిగిన తప్పిదాలపై చర్చించేందుకు సిద్ధంగా లేక సభ నుంచి బయటకు వెళ్లిందని విమర్శించారు. నిషేధిత భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. 22A భూముల విషయంలో ప్రజల్లో ఉన్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని వాస్తవాలను సభ వేదికగా వివరించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను కూడా చర్చలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.



