నవతెలంగాణ-సత్తుపల్లి: గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాలు జరిగే తటాకాలను (చెరువులు) మున్సిపల్ చైర్‌పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ బుధవారం మున్సిపల్, పోలీస్, విద్యుత్, ఐబీ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపల్ పరిధిలోని బేతుపల్లి చెరువు, తామర చెరువులను ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా నిమజ్జనానికి సంబంధించి మున్సిపల్, పోలీస్, విద్యుత్, ఐబీ శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై చర్చించారు. నిమజ్జన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిమజ్జన స్థలాల వద్ద పక్కా ఏర్పాట్లు చేపట్టాలని బృందం తీర్మానించింది.
చెరువుల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తుతో పాటు నీటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని తీర్మానించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడడంతో పాటు, రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్సవాల ముగింపు నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసేలా అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రెహానా కమల్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహ, పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి, ఐబీ డీఈఈ మరియన్న, విద్యుత్ శాఖ పట్టణ ఏఈ ఉబ్బన శరత్ బాబు, మున్సిపల్ ఏఈ సురేష్, కౌన్సిలర్లు దూదిపాల రాంబాబు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, హాకీం నాయకులు విరివాడ నాగభూషణం, నారాయణరెడ్డి పాల్గొన్నారు.



