నవతెలంగాణ-హైదరాబాద్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ హైదరాబాదీ యువకుడు అక్కడ ఆకస్మికంగా మృతి చెందాడు. నగరంలోని సంతోష్‌నగర్‌కు చెందిన మహమ్మద్ జాబేర్ హుస్సేన్ (27), అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం లోవెల్ నగరంలో ఈ నెల 14న మృతి చెందాడు.
జాబేర్ 2021లో సివిల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లాడు. కనెక్టికట్‌లో చదువు పూర్తి చేసి లోవెల్‌లో ఉద్యోగంలో చేరాడు. గత నెల ఆగస్టులోనే టెక్సాస్‌లో ఆయనకు వివాహం జరిగింది. సెప్టెంబర్ 14న ఉదయం తన తల్లితో ఫోన్లో మాట్లాడినప్పుడు జాబేర్ ఆరోగ్యంగానే ఉన్నాడని ఆయన తండ్రి జాకీర్ తెలిపారు. అయితే, అదే రోజు సాయంత్రం జాబేర్ నిద్రలోనే మరణించినట్లు ఆయన భార్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
జాబేర్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఆయన కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో వారు మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్‌ను ఆశ్రయించారు. ఆయన ఈ విషయంపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, వీలైతే అయ్యే ఖర్చులను భరించాలని కోరారు.
మరోవైపు, హైదరాబాద్ ఎంపీ సైతం ఈ విషయంపై స్పందించి, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌కు లేఖ రాశారు. జాబేర్ అంత్యక్రియల కోసం మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, జాబేర్ మృతికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.



