Thursday, September 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకీసర పీఎస్‌లో ఏసీబీ ట్రాప్..రూ.5 లక్షల లంచంతో ఎస్‌ఐ పట్టుబాటు

కీసర పీఎస్‌లో ఏసీబీ ట్రాప్..రూ.5 లక్షల లంచంతో ఎస్‌ఐ పట్టుబాటు

- Advertisement -

– ఇన్‌స్పెక్టర్ ప్రమేయం వెలుగులోకి రావడంతో ఇద్దరి అరెస్టు 
– పీడీఎస్ కేసులో బెయిల్ కోసం లంచం డిమాండ్ ఆరోపణలు
నవతెలంగాణ- నాచారం:
  మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు లంచం కేసులో పట్టుబడ్డారు. పీడీఎస్‌ బియ్యం కేసుకు సంబంధించి బాధితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం రూ.6 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది.

బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో బుధవారం రాత్రి కీసర చెరువు సమీపంలో అధికారులు ట్రాప్ ఏర్పాటు చేశారు. రాత్రి సుమారు 11:30 గంటలకు ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి తన కారులో బాధితుడి నుంచి రూ.5 లక్షల లంచం స్వీకరిస్తుండగా డీఎస్పీ మాజిద్ అలీఖాన్ నేతృత్వంలోని ఏసీబీ బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

విచారణలో ఈ వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. బాధితుడిని గత కొద్ది రోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపగా, కేసుపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -