నవతెలంగాణ-హైదరాబాద్: అవినీతి అధికారులు బదిలీ అయినప్పుడో, సస్పెండ్ అయినప్పుడో జనం సంబరాలు జరుపుకున్న ఘటనలు ఇటీవల తరచూ కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లా కీసరలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అవినీతి ఎస్సై ఏసీబీకి పట్టుబడటంతో జనం సంబరాలు జరుపుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కీసర పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు చేపట్టిన చర్యలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పీడీఎస్ బియ్యం కేసుకు సంబంధించి రూ.5 లక్షలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కీసర సీఐ ఆంజనేయులు పాత్రపైనా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో స్థానికులు నాయకులు కీసర పోలీస్ స్టేషన్ ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఏసీబీ చర్యలను స్వాగతిస్తూ జనం నినాదాలు చేసినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ ఎదుట కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది. కాగా, లంచం వ్యవహారంపై ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


