నవతెలంగాణ-మిడ్జిల్
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని దోనూరు గ్రామ పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా, చక్కటి సంస్కారం, క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తల్లిదండ్రులను పిల్లలను తప్పకుండా పాఠశాలకు వెళ్లేలా చూడాలని, ఇంట్లో వారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు, బడి మానేసే పిల్లలు లేకుండా చేసేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని స్పష్టం చేశారు.
ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం: విద్యాబోధనలో విశేష ప్రతిభ కనబరిచి, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించిన దోనూరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మయ్యను విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయుడికి జిల్లా స్థాయి గుర్తింపు రావడం దోనూరు గ్రామానికి ఎంతో గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, విద్యార్థులను క్రమశిక్షణతో తీర్చిదిద్దుతూ పాఠశాల అభివృద్ధికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తారా సింగ్, ఉపాధ్యాయులు కృష్ణా నాయక్, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ఉపసర్పంచ్ వార్డు మెంబర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



