ఇది హోటలా.. మద్యం సేవించే బారా..!
నవతెలంగాణ-అచ్చంపేట
వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వంట గదులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అపరిశుభ్రంగా ఉన్న హోటళ్లను సీజ్ చేస్తామని ఫుడ్ఇన్ స్పెక్టర్ శ్రీలత యజమాలను హెచ్చరించారు. శనివారం పట్టణంలో నవబృందావన్ ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ రెస్టారెంట్, కావేరి హోటల్, ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు వంట గదులు అపరిశుభ్రంగా ఉండడంతో యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గదులు, సరుకులు నిలువ చేసే గదులలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలన్నారు.
14 రోజుల తర్వాత మళ్లీ వస్తా ఇదేవిధంగా ఉంటే హోటళ్ల ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఫ్రీజ్ లో నిలువచేసిన కూరగాయలను, ఆకుకులను, అల్లం వెల్లుల్లి ఇతర మసాలా లను గుర్తించి పడేశారు. టెస్టింగ్ సాల్ట్ వాడొద్దని, ఆహార పదార్థాలలో, బిర్యానీ వంటకంలో హాని కలిగించే రంగులు హెచ్చరించారు. శాంపిళ్లు సేకరించారు. ప్యాకింగ్ తేదీ, వినియోగ గడువు తేదీలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావేరి హోటల్లో మద్యం బాటిల్లు విచ్చలవిడిగా ఉండడంతో యజమాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హోటలా.. లేక మద్యం సేవించే బారా..! అని కోపగించుకున్నారు. వెంటనే బాటిళ్లను అక్కడి నుంచి తీయించారు. పరిశుభ్రతలు పాటించాలి. నియమ నిబంధనలకు ప్రకారంగా హోటళ్ళు నిర్వహించాలని సూచించారు.



