ఏపీలో అంగన్‌వాడీలను తొలగించడం దుర్మార్గం

Route map for Metro Phase-2 expansion finalized– ఇది జగన్‌ ప్రభుత్వానికే నష్టం
– సమ్మె డిమాండ్లను పరిష్కరించాలి..తొలగింపును ఆపాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అంగన్‌వాడీ కార్మికులను విధుల్లోంచి తొలగించడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వ తీరును ఖండించారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై నిర్బంధాలు విధించడాన్నీ, అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. నెలన్నర నుంచి సమ్మె చేస్తున్నా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే అంగన్‌వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారని తెలిపారు. వారు గొంతెమ్మ కోరికలేం కోరటం లేదనీ, తమ హక్కులను నెరవేర్చాలని కోరటంలో న్యాయం ఉందని పేర్కొన్నారు. అంగన్‌వాడీల పట్ల కర్కశంగా వ్యవహరించడం జగన్‌ ప్రభుత్వానికే నష్టదాయకమని హెచ్చరించారు. అంగన్‌వాడీలతో మొండి వ్యవహరించిన తమిళనాడులోని జయలలిత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వాలు కుప్పకూలిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికైనా అంగన్‌వాడీల విషయంలో జగన్‌ వెనక్కి తగ్గి వారికి న్యాయం చేయాలని సూచించారు. అదేవిధంగా, అంగన్‌వాడీల చలో విజయవాడ కార్యక్రమాన్ని కవరేజీ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు.

Spread the love